Nagarkurnool Lok Sabha Constituency : విలక్షణ తీర్పునకు కేరాఫ్ నాగర్‌కర్నూల్…క్లీన్‌స్వీప్‌కు మూడు పార్టీల నజర్
కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ తగాదాలు ఇక్కడ బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో కసిరెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. జైపాల్ యాదవ్ వైపు ఆధిష్టానం మొగ్గుచూపింది.
Nagarkurnool Lok Sabha Constituency : ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇప్పుడు కారు పార్టీకి పెట్టని కోట.. అలాంటి నాగర్‌కర్నూలులో రాజకీయం నానా మలుపులు తిరుగుతోంది. నాగర్‌కర్నూల్‌లో పట్టు సాధించేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయ్. ఎంపీతో పాటు ఏడు అసెంబ్లీలను క్లీన్‌స్వీప్ చేయాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంటే.. కంచుకోటలో మళ్లీ పాగా వేయాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కమలం పార్టీ కూడా దూకుడు పెంచుతోంది. మరి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పొలిటికల్ సీన్ ఏంటి.. బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది ఏంటి.. జూపల్లి అడుగులు ఎటువైపు.. డీకే అరుణ గద్వాల బరిలో నిలుస్తారా లేదా.. కారు పార్టీలో ఎలాంటి టికెట్ ఫైట్ కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను వెంటాడుతోన్న బలహీనతలు ఏంటి.. బీజేపీకి ఇక్కడ సరైన అభ్యర్థులు కూడా లేరా.. నాగర్‌కర్నూల్ రాజకీయం ఏ మాట్లాడుకుంటోంది.
సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన రాములు…తొలిసారి నియోజకవర్గంపై కన్నేసిన బీజేపీ…పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ కసరత్తు
నాగర్‌కర్నూలు పార్లమెంట్‌లో ప్రతీసారి విలక్షణ తీర్పే కనిపిస్తుంది. దీంతో ఈసారి మూడు పార్టీలు ఈ లోక్‌సభ స్థానంపై కన్నేశాయ్. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం కావడంతో.. ఆయాపార్టీల్లో ఉన్న కీలకనేతలు ఎవరికి వారే కసరత్తు మొదలుపెట్టారు. ఓ వైపు పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా… మరోవైపు పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తొలిసారి నియోజకవర్గంపై కన్నేసిన బీజేపీ.. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తోంది. దీంతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. నాగర్‌కర్నూల్‌లో సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోతుగంటి రాములు ఉన్నారు. ఐతే ఆయన అచ్చంపేట నుంచి అసెంబ్లీ బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. తనతో పాటు యువనేతలను ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. దీంతో రాములును అచ్చంపేట బరిలో దింపి.. అక్కడ ఎమ్మెల్యే బాలరాజును నాగర్‌కర్నూలు ఎంపీ పోటీకి దింపుతారనే టాక్ నడుస్తోంది.
నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌కు బలమైన కేడర్…బీజేపీ నుంచి బంగారు శృతి పోటీకి దిగే చాన్స్
మధ్యలో టీడీపీ గెలిచినా.. నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. హస్తం పార్టీకి ఇక్కడ బలమైన కేడర్ ఉంది. దీంతో ఈ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన మల్లు రవి మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఈస్థానాన్ని రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నారు. నాగర్‌కర్నూలు నుంచి గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన బంగారు శృతి.. మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో లక్షా 29వేలకు పైగా ఓట్లు సాధించిన శృతి.. ఈ మూడున్నరేళ్లలో దూకుడు పెంచారు. క్రమంగా బలం పెంచుకుంటూ వచ్చారు. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూలులో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
నాగర్‌కర్నూలు లోక్‌సభ పరిధిలో.. నాగర్‌కర్నూలు అసెంబ్లీతో పాటు.. వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ సెగ్మెంట్‌లు ఉన్నాయ్. ఇందులో ఆలంపూర్, అచ్చంపేట ఎస్సీ రిజర్వ్‌డ్ కాగా.. మిగిలిన నియోజకవర్గాలు జనరల్.
పార్లమెంట్ పరిధి రాజకీయాలను ప్రభావితం చేసే కొల్లాపూర్ అసెంబ్లీ
పార్లమెంట్ పరిధి రాజకీయాలను ప్రభావితం చేయగల అసెంబ్లీ నియోజకవర్గం కొల్లాపూర్. బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం.. ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో హర్షవర్ధన్ రెడ్డికి వరుస వివాదాలు కనిపిస్తున్నాయ్. జూపల్లి ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్న దాని మీదే ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అనుచరగణం ఉన్న జూపల్లి.. రాజకీయ అడుగులే పలు నియోజకవర్గాల్లో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కొల్లాపూర్‌లో జూపల్లి, బీరం మధ్య గ్రూప్ తగాదాలు పీక్స్‌కు చేరుకున్నాయ్. సిట్టింగ్‌లకే మరోసారి అవకాశం అని కేసీఆర్ ప్రకటించడంతో.. తనే మళ్లీ బరిలో నిలుస్తానని బీరం ధీమాగా ఉన్నారు. ఐతే కొల్లాపూర్‌లో విజయం తనదేనని.. అధిష్టానం తనకే అవకాశం ఇస్తుందని జూపల్లి అంటున్నారు. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
జూపల్లి అడుగులు ఎటు అన్న దాని మీదే రాజకీయం…
కొల్లాపూర్‌లో బీరం వర్గంతో కోల్డ్‌వార్ నడుస్తున్న వేళ.. జూపల్లి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా.. జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఈసారి టికెట్ తనకే అంటూ.. జూపల్లి, హర్షవర్దన్ రెడ్డి ఎవరికి వారే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. దీంతో ఈసారి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అటు కాంగ్రెస్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. జగదీశ్వర్ రావు, అభిలాష్ రావు మధ్య గ్రూపు తగాదాలు కనిపిస్తున్నాయ్. టికెట్ తనకంటే తనకు అంటూ ఇద్దరు నేతలు ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఐతే మాజీ ఎమ్మెల్యే అయిన జగదీశ్వర్‌రావు.. తన పరిచయాలు ఉపయోగించి టికెట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అనుభవం ఉన్న నేతగా ఒక్కసారి అవకాశం కల్పించాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అభిలాష్ రావు కూడా నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు కొల్లాపూర్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించింది. కమలం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొల్లాపూర్ ఒకటి. 2018లో కమలం పార్టీ తరఫున పోటీ చేసిన ఎల్లేని సుధాకర్ రావు… ఆ తర్వాత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ జనాలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలిచినా.. జూపల్లి అడుగులు ఎటు అన్న దాని మీదే.. ఇక్కడ రాజకీయం తీసుకునే మలుపులు ఆధారపడి ఉంటాయనే వాదన వినిపిస్తోంది.
READ ALSO : Chevella Lok Sabha Constituency : చెమట్లు పట్టిస్తోన్న చేవెళ్ల పార్లమెంట్ రాజకీయం…ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?
నాగర్‌కర్నూలు లో హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో జనార్ధన్ రెడ్డి..నాగర్‌కర్నూలులో బీజేపీకి కూడా గట్టి పట్టు
నాగర్‌కర్నూలు అసెంబ్లీలో మర్రి జనార్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరోసారి ఆయనే బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఐతే త్వరలో పదవీకాలం ముగియనున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో కూచకుళ్ల దామోదర్ రెడ్డి వర్గం… మర్రి జనార్థన్ రెడ్డి సహకరించడంతోనే… ఆయన విజయం నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఈ ఎన్నికల్లో కూచకుళ్ల దామోదర్ రెడ్డి వర్గం కీలకంగా మారబోతోంది. తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుండటం.. కుమారునికి టికెట్ దక్కకపోతే కూచుకుళ్ల వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఈసారి నాగర్ కర్నూలు గెలుపోటముల్లో కూచుకళ్ల కీలక ఫ్యాక్టర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మరోసారి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా తనతో పాటు… తన కుమారుని రాజకీయ భవిష్యత్‌కు రూట్ క్లియర్ చేసుకోవాలనే ప్లాన్‌లో నాగం ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత రాజకీయాలకు తాను గుడ్‌బై చెప్పి… కుమారుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. నాగర్‌కర్నూలులో బీజేపీకి కూడా గట్టి పట్టే ఉంది. గత ఎన్నికల్లో కమలం పార్టీ నుంచి పోటీ చేసిన దిలీప్ ఆచారి మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది.
అచ్చంపేటలో హ్యాట్రిక్ విజయం మీద కన్నేసిన బాలరాజు
అచ్చంపేటలో గువ్వల బాలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా హ్యాట్రిక్ విజయం మీద కన్నేశారు. ఐతే నాగర్‌కర్నూలు ఎంపీ రాములు.. అచ్చంపేట నియోజకవర్గంపై కన్నేశారని తెలుస్తోంది. అధిష్టానాన్ని ఒప్పించి అసెంబ్లీ బరిలో దిగాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తనకు కాకపోతే తన తనయుడు భరత్‌ను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కపోతే.. ఇతర పార్టీ నుంచైనా సరే బరిలో నిలవాలని భరత్ ఫిక్స్ అయ్యారనే ప్రచారం నడుస్తోంది. అచ్చంపేట నియోజకవర్గంలో తన మార్క్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. రాములు లేదా ఆయన తనయుడికి అచ్చంపేట టికెట్ దక్కితే… గువ్వల బాలరాజును నాగర్‌కర్నూల్ ఎంపీ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి పట్టుంది. వరుసగా రెండుసార్లు ఓడిన మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలపై ప్రతిరోజు పోరాటాలు చేస్తున్నారు. యురేనియం తవ్వకాల వంటి సమస్యలపై పోరాడుతూ నియోజకవర్గ జనాలకు దగ్గరవుతూ.. ఉనికి కాపాడుకుంటున్నారు. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతికి తోడు.. వివాదరహితుడు అనే పేరు తనకు కలిసి వస్తుందని వంశీకృష్ణ అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మల్లేశ్వర్ పోటీ చేయగా.. ఈసారి కమలం పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని ప్లాన్ చేస్తోంది.
కల్వకుర్తిలో బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్న గ్రూప్ తగాదాలు…కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి పోటీ చేసే చాన్స్
కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ తగాదాలు ఇక్కడ బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. గత ఎన్నికల్లో కసిరెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. జైపాల్ యాదవ్ వైపు ఆధిష్టానం మొగ్గుచూపింది. ఆ తర్వాత కసిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఐతే ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే దక్కేలా కసిరెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో రెండువర్గాల మధ్య పోరు పీక్స్‌కు చేరింది. జైపాల్ యాదవ్ మీద వ్యతిరేక పెరుగుతోందని.. అది తనకు కలిసొస్తుందని కసిరెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో బీఆర్‌ఎస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్‌కు కూడా కల్వకుర్తిలో బలమైన కేడర్ ఉంది. బీజేపీ నుంచి వరుసగా ఓటమి చవిచూస్తున్న తల్లోజు ఆచారి.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. ముందు నుంచే నియోజకవర్గంపై దృష్టిసారించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి బరిలోకి దిగేందుకు రెడీ సిద్ధం అవుతున్నారు.
వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి నిరంజన్ రెడ్డికి బలమైన కేడర్…టీడీపీ నుంచి రావుల పోటీ పై ఆసక్తి
వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు.. పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడంలో ఆయన తనదైన మార్క్ వేసుకున్నారు. మరోసారి తన గెలుపు నల్లేరుపై నడకేననే ధీమాతో ఉన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు… యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి.. ఈసారి పోటీ చేస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. బలమైన అభ్యర్థి, కేడర్ లేకపోవడంతో.. బీజేపీ పరిస్థితి అంతంగా మాత్రంగానే ఉంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి టీడీపీని వీడి.. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్నా.. ఆయన నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. రావుల తీసుకోబోయే స్టాండ్ ఇక్కడ గెలుపోటముల్లో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయ్.
గద్వాలలో బలంగా బీజెపి…బలహీనంగా కాంగ్రెస్..బీఆర్ ఎస్ లో గ్రూపుల పోరు
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి ఆసక్తి కనిపిస్తోంది. ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే గద్వాల్‌లో గ్రూప్ తగాదాలు కారు పార్టీకి ఇబ్బందిగా మారాయ్. బండ్లతో పాటు జడ్పీ చైర్‌పర్సన్ సరిత కూడా ఈసారి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో రెండువర్గాల మధ్య గ్రూప్‌వార్ తారాస్థాయికి చేరుకుంది. కొంతకాలంగా నియోజకవర్గంలో ఎవరికి వారే విస్తృతంగా పర్యటిస్తూ.. కేడర్‌ను ఏర్పాటుచేసుకుంటున్నారు. బీసీ మహిళ కావడంతో.. ఈసారి తనకే టికెట్ ఖాయమని సరిత ధీమాగా ఉన్నారు. సిట్టింగ్‌లకే సీట్లు అన్న కేసీఆర్ ప్రకటనతో.. ఈసారి పోటీ చేయబోయేది తానే అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ బరిలోకి దిగితే.. గట్టి పోటీ తప్పదనే ఆలోచనతో.. కారు పార్టీ హైకమాండ్ గద్వాల్ మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఐతే డీకే అరుణ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారా.. పార్లమెంట్ బరిలో నిలుస్తారా.. అవసరాన్ని బట్టి రెండు స్థానాల్లోనూ పోటీ చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అరుణ తీసుకునే నిర్ణయం.. గద్వాల రాజకీయాలను మలుపు తిప్పే చాన్స్ ఉంది. ఆమె బీజేపీలో చేరడంతో.. హస్తం పార్టీకి ఇక్కడ బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. గత ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన గొంగళ్ల రంజిత్‌ను పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న ప్రాంతంకావడంతో.. బీసీ నేతను బరిలోకి దింపితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
ఆలంపూర్ లో బీఆర్ ఎస్ టిక్కెట్ కోసం భారీ పోటీ….సిట్టింగ్ ఎమ్మెల్యేగా అబ్రహంకు టిక్కెట్టు దక్కేనా?
ఆలంపూర్‌లో అబ్రహం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఈసారి బీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగానే ఉంది. మాజీ ఎంపీ మంద జగన్నాధం తనకు లేదా తన వారసుడికి టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే.. మాజీ జడ్పీ ఛైర్మన్ బండారు భాస్కర్ కూడా ఆశలు పెట్టుకున్నారు. దీంతో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఆలంపూర్‌లో.. గెలుపోటములను ప్రభావితం చేసే కీలకనేతగా చల్లా వెంకట్రామ్ రెడ్డికి పేరు ఉంది. ఐతే ఆయన బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత.. కాంగ్రెస్ పూర్తిగా వీక్ అయింది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సంపత్ కుమార్.. మళ్లీ ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. బీజేపీకి ఇక్కడ పెద్దగా కేడర్ లేదు. దీంతో బలమైన అభ్యర్ధి కూడా లేరు. దీంతో సరైన అభ్యర్థి కోసం కమలం పార్టీ అన్వేషణ మొదలుపెట్టింది.