Jump to content

ఈక

వికీపీడియా నుండి
(ఈకలు నుండి దారిమార్పు చెందింది)
వివిధ రకాలైన ఈకలు

ఈక (ఆంగ్లం: Feather) బహువచనం ఈకలు పక్షుల బాహ్యచర్మము నుండి అభివృద్ధి చెంది, జీవి శరీరాన్ని కప్పుతూ బాహ్య అస్థిపంజరముగా ఏర్పడుతుంది. ఈకల అమరిక, విస్తరణను టెరిలాసిస్ (Pterylosis) అని అంటారు. రాటిటే లేదా ఎగరలేని పక్షులలో ఈకలు ఒకే రీతిలో విస్తరించి ఉంటాయి. కారినేటా లేదా ఎగిరే పక్షులలో ఈకలు క్రమ శ్రేణులలో అమరి ఉంటాయి. ఈ శ్రేణులను పిచ్ఛ ప్రదేశాలు (Pterylae) అని, వీటి మధ్యనున్న ఖాళీ స్థలాలను అపిచ్ఛక ప్రదేశాలు (Apterylae) అని అంటారు. మెలనిన్ (Melanin) వర్ణ పదార్ధము ఉండటము వలన ఈకలు వివిధ వర్ణాలలో ఉంటాయి.

రకాలు

[మార్చు]

ఈకలు మూడు రకాలు. అవి :

  • క్విల్ ఈకలు : ఇవి రెక్కలను, తోకను కప్పుతూ ఎగరటానికి సహాయపడతాయి.
  • దేహ పిచ్ఛాలు : ఇవి శరీరమును కప్పు ఉంటాయి.
  • రోమ పిచ్ఛాలు : ఇవి దేహ పిచ్ఛాల మధ్య ఉంటాయి.
  • నూగుటీకలు :

క్విల్ ఈక నిర్మాణము

[మార్చు]
Parts of a feather:
1. Vane
2. Rachis
3. Barb
4. Afterfeather
5. Hollow shaft, calamus
Featherstructure of a Blue-and-yellow Macaw

క్విల్ ఈకలు పొడవుగా ఉంటాయి. ప్రతి ఈకలో మధ్య అక్షము, విస్తరించిన పిచ్ఛపాలము ఉంటాయి. మధ్య అక్షపు సమీపాగ్ర భాగమును కెలామస్ లేదా క్విల్ అని, దూరాగ్ర భాగమును విన్యాసాక్షము లేక షాఫ్ట్ అని అంటారు.

  • కెలామస్ (Calamus) : కెలామస్ లేదా క్విల్ బోలుగా, గొట్టము వలె ఉండి పాక్షిక పారదర్శకముగా ఉంటుంది. దీని అడుగు భాగము బాహ్యచర్మపు పుటిక లోనికి చొచ్చుకొని ఉంటుంది. కెలామస్ చివర చిన్న రంధ్రము ఉంటుంది. దీనిని నిమ్ననాభి అంటారు. ఈ రంధ్రము ద్వారా అంతశ్చర్మపు సూక్షాంకురము ఒకటి ఈక లోపలికి వెళుతుంది. దీనిని పిచ్ఛ సూక్ష్మాంకురము అని అంటారు. దీని ద్వారా రక్త కేశనాళికలు ప్రవేశించి పెరిగే ఈకకు పోషక పదార్ధాలను, వర్ణకాలను సరఫరా చేస్తుంది. క్విల్, విన్యాసాక్షము కలిసే ప్రాంతంలో ఉదరతలములో మరొక సూక్ష్మ రంధ్రము ఉంటుంది. దీనిని ఊర్ధ్వనాభి అని అంటారు. దీని దగ్గర కొద్ది సంఖ్యలో మెత్తటి ఈకలు ఉంటాయి. వీటిని అనుపిచ్ఛము అని అంటారు.
  • విన్యాసాక్షము (Rachis) : మధ్య అక్షము యొక్క దూరాగ్రభాగమును విన్యాసాక్షము లేదా షాఫ్ట్ అని అంటారు. ఇది ఘనముగా ఉండి, అడ్డుకోతలో కోణీయంగా కనిపిస్తుంది. దీని ఉదరతలపు మధ్య భాగములో ఉన్న గాడిని అంబిలికల్ గాడి అని అంటారు.
  • పిచ్ఛపాలము (Vexellum) : విన్యాసాక్షముకు ఇరుపక్కలా అతుక్కొని కంటకాలు (Barbs) ఉంటాయి. ఈ కంటకాలు విన్యాసాక్షము నుండి ఏటవాలుగా ఉద్భవిస్తాయి. విన్యాసాక్షాన్ని కంటకాలతో సహా కలిపి పిచ్ఛపాలము అని అంటారు. కంటకాలు సన్నగా పొడవుగా ఉండి ఒకదానితో ఒకటి సమాంతరముగా ఉంటాయి. కంటకాల పరిమాణము క్రమముగా సమీపాగ్ర భాగము నుండి దూరాగ్ర భాగము పోయే కొలది తగ్గుతూ ఉంటాయి. ప్రతి కంటకమునకు ఇరువైపుల ఏటవాలుగా విస్తరించిన సున్నితమైన వెంట్రుకల వంటి నిర్మాణాలు రెండు శ్రేణులలో అమరి ఉంటాయి. వీటిని కంటక కీలితాలు (Barbules) అని అంటారు.

దేహ పిచ్ఛాలు

[మార్చు]

శరీరమును కప్పి చిన్న చిన్న ఈకలు ఉంటాయి. ఇవి శరీర రూపాన్ని నిర్ణయిస్తాయి గనుక వీటిని దేహ పిచ్ఛాలు (Contour feathers) అని అంటారు. ఇవి అన్ని లక్షణాలలో క్విల్ ఈకలను పోలి ఉంటాయి. కాని వీటికి కంటక కీలితాలు అంత బాగా అభివృద్ధి చెంది ఉండవు. కనుక కంటకాలు విడివిడిగా ఉంటాయి. ఈ పిచ్ఛాల వలన దేహ ఉపరితలము నునుపుగా ఉంటుంది. అంతేకాక ఉష్ణ నిరోధకముగా పనిచేస్తుంది.

రోమ పిచ్ఛాలు

[మార్చు]

దేహ పిచ్ఛాల మధ్య ఖాళీలలో ఈ రోమ పిచ్ఛాలు (Filoplumes) ఉంటాయి. ఇవి చిన్నవిగా, సున్నితముగా, దారాల వలె ఉంటాయి. ప్రతి రోమ పిచ్ఛము పొట్టిగా ఉన్న దృఢమైన కెలామస్ ను, పొడవైన బలహీనమైన విన్యాసాక్షమును కలిగి దూరాగ్ర భాగములో మాత్రమే కంటకాలను, కంటక కీలితాలను కలిగి ఉంటాయి. ఈ పిచ్ఛాలు జీవి దేహము మీద ఉన్న అన్ని ఈకలను తొలగించిన తర్వాత కనిపిస్తాయి.

నూగుటీకలు

[మార్చు]

బాల్యదశలో దేహాన్ని కపి ఉండే సున్నితమైన ఊలు వంటి చిన్న రోమాలను నూలుటీకలు (Down feathers or Plumules) అంటారు. ప్రౌఢదశలో వీటి స్థానములో దేహ పిచ్ఛాలు ఉంటాయి. ప్రతి నూగుటీక యొక్క కెలామస్ భాగము చర్మము లోనికి చొచ్చుకొని ఉండి, పలుచని క్షీణించిన విన్యాసాక్షమును కలిగి పొడవైన కంటకాలు, చిన్న కంటక కీలితాలను కలిగి ఉంటుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • రక్షణ : ఈకలు శరీరాన్నంతటిని కప్పి ఉండి మృదువైన చర్మమును కాపాడతాయి.
  • ఉష్ణ నిరోధకము : పక్షులు ఉష్ణరక్తజీవులు. వీటి శరీర ఉష్ణోగ్రత 104 F - 112 F మధ్య ఉంటుంది. శరీరము మీదగల ఈకల తొడుగు వలన శీతాకాలములోను, వేసవికాలములోను ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతుంది.
  • ఉడ్డయిక నిర్మాణము : ఈకలు చాలా తేలికగా ఉండటము వలన, అవి ఎక్కువ సంఖ్యలో శరీరము మీద ఉన్నప్పటికి వీటి శరీరము చాలా తేలికగా ఉంటుంది. రెక్కల మీద కప్పి ఉన్న క్విల్ ఈకలు రెక్కకు విస్తారతలాన్ని చేకూర్చి, ఎగరటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తోక మీద గల ఈకలు చుక్కాని వలె పనిచేస్తూ పక్షులు ఎగిరేటప్పుడు దిశలను మార్చటానికి సహాయపడతాయి.
  • ఆత్మరక్షణ : లైపోక్రోమ్, మెలనిన్ అను వర్ణక పదార్ధాల వలన ఈకలు వివిధ రంగులలో కనిపిస్తాయి. ఈకలు పక్షులు నివసించు ప్రదేశాల రంగులో ఉండి వాటి ఉనికిని శత్రువులు తెలుసుకోకుండా చేస్తాయి. అందువలన పరభక్షకాల నుండి రక్షణ కల్పిస్తాయి.
  • లింగ నిర్ణయము : ఆడజీవుల కంటే మగజీవులు ఎక్కువ ఈకలను కలిగి, వివిధ వర్ణాలలో ఉండటము వలన వాటి లైంగిక ద్విరూపకత (Sexual dimorphism) తెలుగుకోవడానికి ఈకలు ఉపయోగపడతాయి. అంతేకాక ఆడజీవులను ఆకర్షించడానికి ఈకల రంగు మగజీవులలో ఉపయోగపడుతుంది.
  • గూళ్ళు నిర్మించుట : సంతానోత్పత్తి కాలములో గూళ్ళను నిర్మించుటకు ఈకలు ఉపయోగపడతాయి. వదులుగా ఉన్న ఈకలను తమ శరీరములో నుంచి తీసి గూళ్ళను నిర్మిస్తాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈక&oldid=2879030" నుండి వెలికితీశారు