డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ

ఫొటో సోర్స్, PRIVATE COLLECTION
- రచయిత, సుధ జి తిలక్
- హోదా, బీబీసీ కోసం
రెండో ప్రపంచ యుద్ధంలో డన్‌కర్క్‌లో పట్టుబడిన మిత్రరాజ్యాల సైనిక దళాలను అక్కడి నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నం ఒక కీలక ఘట్టం.
అయితే, ఆ దళాల్లో 300 మంది భారత సైనికులు కూడా ఉన్నారన్నదే ఎక్కువమందికి తెలియని విషయం.
1940లో ఫ్రెంచ్ పట్టణమైన డన్‌కర్క్ సముద్ర తీరం వద్ద, బ్రిటన్ దాని మిత్రరాజ్యాల సైన్యాన్ని జర్మన్ నాజీ సైన్యం చుట్టుముట్టింది. ఆ సమయంలో అక్కడి నుంచి తప్పించుకోవడమే ఉత్తమ మార్గంగా మిత్రరాజ్యాల కూటమి భావించింది.
మే నెలలో తొమ్మిది రోజులపాటు 3,38,000 మంది సైనికులను డన్‌కర్క్ బీచ్, హార్బర్ నుంచి తరలించారు.
చరిత్రలో 'డన్‌కర్క్ ఎవాక్యుయేషన్'గా ప్రసిద్ధి చెందిన ఈ ఘట్టంలో భారతదేశానికి చెందిన మేజర్ మొహమ్మద్ అక్బర్ ఖాన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.
మే 28న, 300 మంది భారత సైనికులతో పాటు, 23 బ్రిటిష్ దళాలను డన్‌కర్క్ నుంచి సురక్షితంగా ఈస్ట్ మోల్‌కు తరలించడంలో విజయం సాధించారు. సుమారు మైలు పొడవున్న రేవు కట్టపై ఈ దళాలను ముందుండి నడిపించారు.
2017లో క్రిస్టోఫర్ నోలన్ తీసిన డన్‌కర్క్ సినిమాలో కూడా ఈ రేవుకట్ట కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, PRIVATE COLLECTION
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఈ ఆరడుగుల సాహసి భారతదేశానికి తిరిగి వచ్చారు.
1947 ఆగస్టులో స్వతంత్ర్యానంతరం భారతదేశం నుంచి పాకిస్తాన్ చీలినప్పుడు, అక్బర్ ఖాన్ సీనియర్ ఆఫీసర్‌గా పాకిస్తాన్ కొత్త ఆర్మీలో చేరారు. ముహమ్మద్ అలీ జిన్నాకు సైనిక సలహాదారుడిగా నియమితులయ్యారు. నలభైకు పైగా పుస్తకాలు రాశారు. చైనా వెళ్లి మావోను కలిశారు.
డన్‌కర్క్ ఎవాక్యుయేషన్‌లో ముఖ్య పాత్ర పోషించిన మేజర్ అక్బర్ ఖాన్ లాంటి భారత సైనికులను చరిత్ర పూర్తిగా విస్మరించిందని బ్రిటిష్ చరిత్రకారుడు గీ బౌమన్ అంటారు.
ఆయన అయిదు సంవత్సరాల పాటు అయిదు దేశాలలో తిరిగి ఈ సైనికుల వివరాలు సేకరించారు. పాత దస్తావేజులు వెతికి, ఫ్యామిలీ ఆల్బంల నుంచి ఛాయాచిత్రాలు సేకరించి, వారి వారసులతో మాట్లాడి ఈ వివరాలను పోగుచేశారు.
భారత సైనికుల వివరాలు
డన్‌కర్క్ ఎవాక్యుయేషన్‌లో పాల్గొన్న భారత సైనికులు 25వ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి చెందినవారు. బ్రిటిష్ సైన్యానికి సహాయం చేయడం కోసం తమ కంచర గాడిదలతో సహా 7,000 మైళ్లు (11,265 కిమీ) ప్రయాణం చేసి ఫ్రాన్స్ చేరుకున్నారు. వారిలో నలుగురు మినహా అందరూ ముస్లింలే.
వారు ఖాకీ దుస్తులు, టిన్ హెల్మెట్లు (స్టీల్ హెల్మెట్లు), టోపీలు, తలపాగాలు ధరించేవారు. వారి దగ్గర ఆయుధాలేమీ లేవు. ఫ్రాన్స్ చేరడానికి ఆరు నెలల ముందు పంజాబ్ నుంచి బయలుదేరిన సమయంలో వారికి ఎలాంటి ఆయుధాలు మంజూరు చేయలేదు.
ఫ్రాన్స్‌లో ఎముకలు కొరికే చలిలో సామాగ్రిని చేరవేయడానికి మోటార్ వాహనాలు పనికిరాని కారణంగా బ్రిటిష్ సైన్యానికి కంచర గాడిదలు అవసరపడ్డాయి. అయితే, వారికి జంతువులను మచ్చిక చేసుకునే సామర్థ్యం లేకపోవడంతో, భారత సైనికుల సహాయం కావలసి వచ్చింది.
యుద్ధ సమయంలో కామన్వెల్త్ దేశాల నుంచి సుమారు యాభై లక్షల సైనికులు బ్రిటిష్ ఆర్మీకి సహాయంగా నిలిచారు. వారిలో సగం మంది దక్షిణ ఆసియా నుంచి వెళ్లినవారే.
అయితే, డన్‌కర్క్‌లో భారత సైనికులు ఏమయ్యారు, వారికి ఏం జరిగింది అనేది అస్పష్టంగానే మిగిలిపోయింది.
"ఈ సైనికుల గాథలు చరిత్ర చెప్పని కథలుగా మిగిలిపోయాయి" అని బౌమన్ తన ఇటీవల పుస్తకం 'ది ఇండియన్ కంటింజెంట్: ది ఫర్గాటెన్ ముస్లిం సోల్జర్స్ ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ డన్‌కర్క్ 'లో రాశారు.
ఈ సైనికుల్లో ఒకరైన చౌదరి వలీ మొహమ్మద్ తన బృందంతో సహా మే 23న డన్‌కర్క్ చేరుకున్నారు.
"జర్మన్ విమానాలు భయంకరమైన పక్షుల్లా మా తలలపై నుంచి ఎగురుతూ మా మీద బుల్లెట్ల వర్షం కురిపించాయి.. 15 రోజుల పాటు నేను నిద్రపోలేదు" అంటూ అప్పటి సంఘటనలను చౌదరి వలీ మొహమ్మద్ తరువాత గుర్తుచేసుకున్నారు.
ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాల్లో చోటు దక్కించుకోలేదని బౌమన్ అంటారు.

ఫొటో సోర్స్, Private collection
"డన్‌కర్క్ నుంచి ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు.. ఎక్కడ చూసినా మంటలే. డన్‌కర్క్ మొత్తం తగలబడిపోయింది. మేము ఎక్కాల్సిన ఓడ మునిగిపోయింది. బీచ్ ఒడ్డుకు చేరుకున్నాకే మాకు ఆ సంగతి తెలిసింది. వెంటనే మళ్లీ వెనక్కి పరిగెత్తి చెట్లచాటున దాక్కున్నాం" అంటూ వలీ మొహమ్మద్ గుర్తుచేసుకున్నారు.
రెండు రోజుల తరువాత వలీ మొహమ్మద్ బృందాన్ని అక్కడి నుంచి తరలించారు.
మరో సైనికుడు జెమదార్ మౌలా దాద్ ఖాన్, తన బృందాన్ని, వెంట ఉన్న జంతువులను రక్షించడంలో "గొప్ప ధైర్యసాహసాలను, నిగ్రహాన్ని, సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యాన్ని" ప్రదర్శించారనే ప్రశంసలు అందుకొన్నారు.
"ఎంతమంది భారత సైనికులు అక్కడకు వెళ్లారన్నది ముఖ్యం కాదు. బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా, వారికి మద్దతు ఇచ్చేందుకు భారతదేశం నుంచి వారు తరలివెళ్లారు. తలపాగాలు ధరించి, తమతో పాటు ఒక మౌల్వీని కూడా తీసుకుని వెళ్లారు. అదీ ముఖ్యం. ప్రపంచాన్ని వారు చూసిన విధానం ఇక్కడ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది" అని బౌమన్ వ్యాఖ్యానించారు.
దాదాపు 1940 సంవత్సరం మొత్తం వీరంతా ఉత్తర ఫ్రాన్స్‌లోని లీల్ నగరానికి ఉత్తరాన ఉన్న ఒక గ్రామంలో గడిపారు. భయంకరమైన చలిలో వ్యాయామాలు చేస్తూ, తమ జంతువులను కాపు కాస్తూ గడిపారు. అక్కడి గ్రామస్థులతో స్నేహం చేసి, "వారాంతాలలో తమ గారడీ విద్యతో, భాంగ్రా నృత్యంతో వారిని అలరిస్తూ" కాలక్షేపం చేశారు.
1940 మే నెలలో జర్మన్లు ఫ్రాన్స్‌పై దాడి చేసిన తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.
"అప్పటివరకు క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్న మిత్రరాజ్యాల సైనిక దళాలు రెండు వారాల్లోనే సముద్రతీరాన చెల్లాచెదురైపోయాయి."
భారత సైనికులు డోవర్ చేరుకోగానే పంజాబీ జానపద సంగీతం ఆలపించడం మొదలు పెట్టారు. "దానికి బ్రిటిష్ సైనికులు కూడా నృత్యం చేశారు" అని బౌమన్ రాశారు.
బ్రిటిష్ ప్రజలు వారిని హృదయానికి హత్తుకున్నారు. తమ ఇళ్లల్లోకి, మనసుల్లోకి సాదరంగా ఆహ్వానించారు. భారత దళానికి ప్రతీకగా సైనికుల బొమ్మలను కూడా తయారుచేశారు.
భారతదేశం విడిచిపెట్టినప్పటి నుంచి వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. బ్రిటన్, ఫ్రాన్స్‌లలోని పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ, యుద్ధం ముగిసిన తరువాత స్వదేశానికి చేరుకునేవరకు వారి జీవితాల్లో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి.
కొందరిని జర్మన్ సైన్యం బంధించి ఫ్రాన్, జర్మన్, ఇటలీ, పోలండ్ యుద్ధ క్యాంపు జైళ్లల్లో పెట్టింది.

ఫొటో సోర్స్, HULTON DEUTSCH/GETTY IMAGES
చరిత్ర వీరిని ఎందుకు మర్చిపోయింది?
ఇంత కథ ఉన్న వీరిని చరిత్ర ఎలా మర్చిపోయింది? పుస్తకాల్లో, సినిమాల్లో ఎక్కడా ఎందుకు కనిపించలేదు?
భారత సైనికులు ప్రధానంగా సామాగ్రిని సరఫరా చేసే పనిలో పాలుపంచుకున్నారు తప్పితే ముందుండి యుద్ధం చేయలేదు. ఇలా మద్దతుగా నిలిచే దళాలను గుర్తుపెట్టుకోవడం అరుదైన విషయమేనని బౌమన్ అంటారు. వారి గాథలు చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కకపోవడానికి ఇది ఒక కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
"ప్రజలు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు, ఎవరిని మర్చిపోతారనేది చెప్పడం చాలా కష్టం. వీరి కథలను చరిత్ర మర్చిపోవడానికి అన్ని కారణాలనూ వెతకలేం" అని బౌమన్ తన పుస్తకంలో రాశారు.
"యుద్ధం తరువాత యూరప్‌లో, భారతదేశంలో కూడా పరిస్థితులు చాలా మారిపోయాయి. యూరప్‌లో భౌతిక పునర్నిర్మాణం, కొత్త సొసైటీలను నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. దృష్టి అంతా భవిష్యత్తుపైనే కేంద్రీకరించారు. యుద్ధ వివరాలు, చరిత్ర కొద్దిమంది ద్వారానే బయటకు వచ్చాయి. అదీ, తెల్ల ముఖాలు, నాగరిక నేపథ్యాల నుంచి వచ్చినవారు చెప్పిన కథలే చరిత్రపుటల్లోకి ఎక్కాయి."
"భారతదేశంలో స్వతంత్రపోరాటం, తరువాత జరిగిన దేశ విభజన మీదకి చరిత్రకారుల దృష్టి వెళ్లిపోయింది. చరిత్ర నిరంతరం ముందుకు సాగుతూ, విస్తరిస్తూ ఉంటుంది" అని బౌమన్ వివరించారు.
(సుధా జీ తిలక్ ఒక జర్నలిస్టు. టెంపుల్ టేల్స్: సీక్రెట్స్ అండ్ స్టోరీస్ ఫ్రం ఇండియాస్ సేక్రెడ్ ప్లేసెస్" పుస్తక రచయిత.)
ఇవి కూడా చదవండి:
- తమిళనాడులో అశోకుడి కంటే ముందే అక్షరాస్యత.. 3200 ఏళ్ల కిందటే వరి సాగు, పట్టణ నాగరికత - పరిశోధన
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- దేశ చరిత్రను చెరిపేయడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తోందా?
- '9/11 దాడుల సూత్రధారి ఎఫ్‌బీఐ నుంచి ముందే ఎలా తప్పించుకున్నాడు’
- నాదిర్ షా: భారతదేశం నుంచి ఎన్ని లక్షల కోట్ల సంపదను దోచుకున్నారు? కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- చింగ్ షి: ఒక సెక్స్ వర్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగల ముఠాకు నాయకురాలు ఎలా అయ్యారు?
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- సరస్సు అడుగున బయటపడిన గ్రామం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)