వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 03వ వారం
అసోం ("అస్సాం") ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని డిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి మరియు చాచర్ కొండలు మరియు దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణముగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.
అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన కాజీరంగా జాతీయ వనము. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది.
అస్సామీ ఆచార వ్యవహారాలలో గమోసా కు ఒక విశిష్టమైన స్థానముంది. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారపు గుడ్డ. మూడు ప్రక్కల ఎరుపుగాని, వేరే రంగులో గాని అంచు ఉంటుంది. నాలుగవ ప్రక్క అల్లిక అంచుగా ఉంటుంది. గమోసాను ఎన్నో విధాలుగా వాడుతారు. రైతులు మొలగుడ్డగా వాడుతారు. బిహూ నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలగుడ్డగా వాడుతారు. ప్రార్ధనా సమయంలో మెడలో వేసుకొంటారు. సమాజంలో ఉన్నతిని తెలుపుకొనే విధంగా భుజాన వేసుకొంటారు. బిహు పండుగకు పెద్దవారికి గమోసాలు సమర్పించుకోవడం ఆనవాయితీ. ఏదయినా భక్తిగా, ఆదరంగా భావించే వస్తువును నేలమీద పెట్టరు. ముందుగా గమోసా పరచి, దానిపై ఉంచుతారు. అన్ని మతాలువారూ గమోసాను ఇదే ఆదరంతో దైనందిన జీవితంలో వాడుతారు
.....పూర్తివ్యాసం: పాతవి