ఎం.మల్లికార్జునరావు
మంగళగిరి మల్లికార్జునరావు | |
---|---|
జననం | ఎం.మల్లికార్జునరావు 1923 మురికిపూడి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు |
తండ్రి | కె.నాగమణి |
తల్లి | శ్రీరంజని |
ఎం.మల్లికార్జునరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు ప్రముఖనటి శ్రీరంజని (సీనియర్) కుమారుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఎం.మల్లికార్జునరావు 1923లో గుంటూరు జిల్లా, మురికిపూడి గ్రామంలో శ్రీరంజని, కె.నాగమణి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను నరసారావుపేటలో ఉన్నత విద్యను గుంటూరులో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో పూర్తి చేశాడు. ఇతడు గుంటూరు హిందూ కాలేజీలో చదివినప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఇతని సహాధ్యాయి. అదే సమయంలో ఎ.సి.కాలేజీలో నందమూరి తారకరామారావు, కొంగర జగ్గయ్య, కె.వి.ఎస్.శర్మ మొదలైన వారు చదివేవారు. ప్రతి యేటా జరిగే అంతర్ కళాశాల నాటకపోటీలలో ఈ యువకళాకారులు అందరూ కలిసి నాటకాలు వేసేవారు. "నాయకురాలు" నాటకంలో ఎన్.టి.ఆర్. నలగామరాజు పాత్ర ధరించగా, ఇతడు బాలచంద్రుని వేషం వేశాడు. ఈ నాటకాన్ని మాధవపెద్ది గోఖలే దర్శకత్వం వహించాడు. ఇంకా ఇతడు విద్యార్థి దశలోనే వసంతసేన, పిచ్చిరాజు, విప్లవం వంటి నాటకాలలో అనేక పాత్రలను ధరించాడు. హిస్ట్రానిక్స్ సొసైటీ సెక్రెటరీగా అనేక సేవలను అందజేశాడు.[1]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]తన తల్లి శ్రీరంజని (సీనియర్) ను సినిమా రంగానికి పరిచయం చేసిన పి.పుల్లయ్యనే ఇతడిని గొల్లభామ సినిమాలో కథానాయకి కొడుకు పాత్రలో నటుడిగా తొలి అవకాశం ఇచ్చాడు. కె.వి.రెడ్డి ఇతడిని నాగిరెడ్డి, చక్రపాణిలకు పరిచయం చేయడంతో విజయా సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్‌గా తీసుకోబడ్డాడు. పెళ్ళిచేసిచూడు సినిమాలో ఎల్.వి.ప్రసాద్ క్రింద సహాయదర్శకునిగా ఇతనికి తొలి అవకాశం వచ్చింది. తరువాత ఆ సంస్థలో చంద్రహారం సినిమా వరకూ అన్ని చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అలాగే అమరసందేశం సినిమాలో ఆదుర్తి సుబ్బారావు వద్ద, పెంకి పెళ్ళాం సినిమాలో కమలాకర కామేశ్వరరావు వద్ద, సతీ అనసూయ చిత్రంలో కడారు నాగభూషణం వద్ద, రక్త సంబంధం సినిమాలో వి.మధుసూధనరావు వద్ద పనిచేశాడు. చిత్రపరిశ్రమలోని అన్ని శాఖలలోను పనిచేసి మెలకువలను తెలుసుకున్నాడు. తన తల్లి పేరుమీద స్థాపించిన ఎస్.ఆర్.మూవీస్ పతాకం మీద నిర్మించిన ప్రమీలార్జునీయం సినిమా ద్వారా ఇతడు దర్శకునిగా పరిచయమయ్యాడు.
చిత్రాల జాబితా
[మార్చు]- దర్శకుడిగా:
- తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987)
- రగిలే హృదయాలు (1980)
- దొంగల దోపిడీ (1978)
- మనుషులు చేసిన దొంగలు (1977)
- బంధంగల్ బంధంగల్ (1976) (మలయాళం)
- రక్త సంబంధాలు (1975)
- పట్టాభిషేకం (1974)
- కండవరుండో (1972) (మలయాళం)
- కోడలు పిల్ల (1972)
- బందిపోటు భీమన్న (1969)
- చెల్లెలి కోసం (1968)
- గూఢచారి 116 (1967)
- అందరికి మొనగాడు (1971)
- ముహూర్త బలం (1969)
- ప్రమీలార్జునీయం (1965)
- నిర్మాతగా:
- సితార (1980)
- రచయితగా:
- చెల్లెలి కోసం (రచయిత)
- ప్రమీలార్జునీయం (స్క్రీన్ ప్లే)