గాంధీ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ వైద్య కళాశాల
నినాదంతమసోమా జ్యోతిర్గమయ
రకంతృతీయ సంరక్షణ వైద్య కేంద్రం
స్థాపితం1954
వ్యవస్థాపకుడుసయ్యద్ నిజాముద్దీన్ అహ్మద్
ప్రధానాధ్యాపకుడుబి.ఎస్.వి.మంజుల[1]
స్థానంసికింద్రాబాద్, తెలంగాణ, భారతదేశం
అనుబంధాలుకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం


గాంధీ వైద్య కళాశాల (Gandhi Medical College) హైదరాబాదులోని ప్రసిద్ధి చెందిన ఒక వైద్య కళాశాల (Medical College). ఇక్కడ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం. వంటి కోర్సుల బోధన జరుగుతున్నది. ఇంకా నర్సింగ్, పెరామెడికల్ కోర్సులు కూడా చెప్పబడుతాయి. మొత్తం వైద్య రంగానికి చెందిన 37 డిగ్రీలు ఇక్కడ బోధనలో ఉన్నాయి. యేటా ఎం.బి.బి.ఎస్. కోర్సులో 150 మంది విద్యార్థులు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చేరతారు. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాఠాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాలున్నాయి. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

చరిత్ర

[మార్చు]

ఇది 1954 సెప్టెంబరు 14న "పీపుల్స్ మెడికల్ కాలేజి"గా ప్రారంభమైంది. అప్పటిలో ఇది హుమాయూన్ నగర్‌లో ప్రస్తుతం "సరోజినీదేవి కంటి ఆసుపత్రి" అన్న స్థలానికి సమీపంలో ఉండేది. వైద్య విద్యావసరాలకు ఉస్మానియా మెడికల్ కాలేజి చాలనందున ఇది ప్రాంభించారు. డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా 1954 మేనుండి 1956 జూలై వరకు పనిచేశాడు. 1955 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేత ఈ కళాశాల ప్రాంభోత్సవం జరిగింది. 1956 నాటికి కళాశాల ఆర్థికమైన ఇబ్బందులనెదుర్కోవడం వలన హైదరాబాదు ప్రభుత్వం ఈ కళాశాలను తన అధీనంలోకి తీసుకొంది. 1958లో కాలేజిని బషీర్‌బాగ్‌కు తరలించారు. 2003లో కాలేజిని మరల ముషీరాబాద్‌కు తరలించారు.

కాలేజి టీచింగ్ హాస్పిటల్ 1851లో ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రం (infirmary) గా మొదలయ్యింది. 7వ కింగ్ ఎడ్వర్డ్ పేరుమీద దీనికి KEM హాస్పిటల్ అని పేరు పెట్టారు. 1958లో దీని పేరును "గాంధీ హాస్పిటల్"గా మార్చారు.

యేటా ఈ హాస్పిటల్‌లో 80,000 మంది ఔట్‌పేషెంట్లు, 42,000 మంది ఇన్‌పేషెంటులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ 11,000 పెద్ద శస్త్ర చికిత్సలు, 15,000 చిన్న శస్త్ర చికిత్సలు జరుపుతున్నారు. హాస్పిటల్‌లో 27 డిపార్టుమెంటులున్నాయి.

1954-2003 మధ్యకాలంలో 6090 విద్యార్థులు వైద్యవిద్యలో జాయిన్ అయ్యారు. 1950-1960 దశకాలలో కాలేజి, హాస్పిటల్ అనుసంధానించబడ్డాయి. 1970 దశకంనుండి సూపర్-స్పెషాలిటీ విభాగాలలో (కార్డియాలజీ, కార్డియో ఠొరాయిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటివి) అభివృద్ధి అధికంగా ఉంది. దీనికి అనుబంధంగా నర్సింగ్ స్కూల్ కూడా ఉంది.

61 వార్షికోత్సవం

[మార్చు]

MONDAY, September 14, 2015 నేడు వార్షికోత్సవం అనగా సోమవారము, సెప్టెంబరు 14, 2015 గాంధీ మెడికల్ కళాశాల 61వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. అలూమిని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్‌రెడి, ్డ కార్యదర్శి డాక్టర్ లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ లింగయ్య నేతృత్వంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. దీనికి పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న మెడికల్ విద్యార్థులు హాజరుకానున్నారు.

పూర్వ విద్యార్థులలో ప్రముఖులు

[మార్చు]

కరోనా వైద్యం

[మార్చు]

గాంధీ ఆస్ప‌త్రిలో దాదాపు 84,187 మంది కొవిడ్ బాధితుల‌కు వైద్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత గాంధీ ఆస్ప‌త్రికి 176 కోట్ల మంజూరవవ్వగా 2021 డిసెంబరు నాటికి 100 కోట్ల ప‌నులు పూర్త‌య్యాయి. మిగిలిన నిధులతో గాంధీలో అత్యాధునిక‌మైన ప‌రిక‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావడంతోపాటూ, గాంధీ ఆవ‌ర‌ణ‌లో 200 ప‌డ‌క‌ల ఎంసీహెచ్ ఆస్ప‌త్రిని కూడా నిర్మించనున్నారు.[2]

సదుపాయాలు

[మార్చు]

2021, డిసెంబరు 11న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు గాంధీ ఆస్ప‌త్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను ప్రారంభించాడు.[3] తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రికి 6.5 కోట్ల‌తో కొత్త క్యాథ్ ల్యాబ్‌ను, 12.5 కోట్ల‌తో ఎంఆర్ఐ మిష‌న్‌ను మంజూరు చేసింది.

ఈవినింగ్ ఓపీ సేవ‌లు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవ‌ల జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం గాంధీ ఆసుప‌త్రిలో 2022 జూలై 25న ఈవినింగ్ ఓపీ సేవ‌లు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు ఓపీ సేవ‌లు అందుబాటులో ఉండగా, జ‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌న్, గైన‌కాల‌జీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ కు సంబంధించిన డాక్ట‌ర్లు అందుబాటులో ఉండి రోగుల‌ను ప‌రీక్షిస్తున్నారు. ఉదయం 7:30 నుంచే ఓపీ స్లిప్పుల పంపిణీ చేస్తుండగా, ఉదయం 9 నుంచి వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఓపీ సమయం కొనసాగుతున్నంత సేపు నమూనాల సేకరణ, రిపోర్టులు అందజేసే కౌంటర్లు పనిచేస్తున్నాయి.[4]

ఐఎస్‌వో గుర్తింపు

[మార్చు]

కంప్యూటరైజ్డ్‌ విధానంలో దవాఖానలో జరిగే రోజువారి కార్యకలాపాల్లో ప్రధానంగా రక్తదాన కేంద్రంలో ఈ-రక్తకోశ్‌, మందులను కొనుగోలు చేయడానికి ఈ-ఔషధి, సామగ్రి కొనుగోలు కోసం ఈ-ఉపకరణ్‌, బయటిరోగుల నమోదు వివరాలను సి-డాక్‌ లాంటి వెబ్‌సైట్‌లలో సమాచారం పొందుపరుస్తున్నారు. హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ గైడ్‌లైన్స్‌ రూపొందించి, అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ దవాఖానల విభాగంలో మొట్టమొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి ఐఎస్‌ఓ నుండి రెండు సర్టిఫికెట్లు లభించాయి.[5] ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఓ) ద్వారా టెరిటరి లెవెల్‌ పబ్లిక్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ విభాగంలో క్వాలిటీ మేనెజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎస్‌ఓ 9001:2015), ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ విభాగంలో (ఐఎస్‌ఓ 45001:2018) క్వాలిటీ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ఈ రెండు సర్టిఫికెట్లను అందజేసింది. ఈ సర్టిఫికెట్ల కాలపరిమితి 2026 వరకు ఉంటుంది.[6]

మదర్‌ & చైల్డ్‌ కేర్‌ సెంటర్‌

[మార్చు]

గర్భిణులు, ప్రసవించిన బాలింతలతోపాటు పుట్టిని బిడ్డలకు మెరుగైన సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు 52 కోట్ల వ్యయంతో నిర్మించిన 200 పడకల మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను, 2023 ఆగస్టు 20న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించాడు.[7] ఈ సెంటర్ లో 8 కోట్ల రూపాయలతో ఆధునిక వెంటిలేటర్లు, డయాలసిస్‌ యంత్రాలు, 2డి-ఎకో, వామర్లు, కోల్పోస్కోపి, ల్యాపరోస్కోపి తదితర వైద్య పరికరాలు ఏర్పాటుచేయబడ్డాయి. ప్రధానంగా గుండె, కిడ్నీ, కాలేయం, న్యూరో తదితర మల్టిపుల్‌ వ్యాధులతో బాధపడే తల్లులకు, పుట్టుకతోనే వచ్చే వివిధ రకాల సమస్యలతో బాధపడే శిశువులకు ఈ ‘మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌’ సెంటర్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించబడుతుంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Gandhi Medical College & Hospital". www.gandhimedicalcollege.ncgg.in (in ఇంగ్లీష్). Gandhi Medical College & Hospital, Secunderabad. Archived from the original on 2018-06-12. Retrieved 2018-04-29.
  2. "గాంధీలో సీటీ స్కాన్ సేవ‌లు ప్రారంభం.. త్వ‌ర‌లోనే క్యాథ్ ల్యాబ్‌ కూడా." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-11. Archived from the original on 2021-12-11. Retrieved 2021-12-27.
  3. "Ts News: కొవిడ్‌ సమయంలో.. ఆ ఘనత గాంధీ ఆస్పత్రికే దక్కింది: హరీశ్‌రావు". EENADU. Archived from the original on 2021-12-27. Retrieved 2021-12-27.
  4. telugu, NT News (2022-07-25). "గాంధీ ఆసుప‌త్రిలో ఈవినింగ్ ఓపీ సేవ‌లు ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-27.
  5. ABN (2023-08-21). "GANDHI HOSPITAL : గాంధీ ఆస్పత్రికి ఐఎస్‌వో గుర్తింపు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.
  6. telugu, NT News (2023-08-19). "మదర్‌ & చైల్డ్‌ కేర్‌ సెంటర్‌@గాంధీ ఆసుపత్రి.. 200 పడకలతో రేపే ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2023-08-24. Retrieved 2023-09-27.
  7. "Gandhi Hospital gets Mother and Child Health Centre". The New Indian Express. Archived from the original on 2023-10-31. Retrieved 2023-10-31.
  8. telugu, NT News (2023-08-19). "మదర్‌ & చైల్డ్‌ కేర్‌ సెంటర్‌@గాంధీ ఆసుపత్రి.. 200 పడకలతో రేపే ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2023-08-24. Retrieved 2023-10-31.

బయటి లింకులు

[మార్చు]