Jump to content

చక్రి

వికీపీడియా నుండి
చక్రధర్ జిల్లా
చక్రి (సంగీత దర్శకుడు)
జననం
చక్రధర్ జిల్లా

(1974-06-15)1974 జూన్ 15 [1]
మరణం2014 డిసెంబరు 15(2014-12-15) (వయసు 40)
జాతీయతభారతీయుడు
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000–2014
జీవిత భాగస్వామిశ్రావణి

చక్రి అలియాస్ చక్రధర్ జిల్లా (1974 జూన్ 15 - 2014 డిసెంబర్ 15) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు.

నేపధ్యము

[మార్చు]

ఇతడు జూన్ 15, 1974న వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో జన్మించాడు[1]. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో అత్యంత ప్రజాధారణ పొందినవి.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం విష్ణు మంచు, కేథరీన్ థెరీసా హీరోహీరోయిన్లుగా నటించిన ఎర్ర‌బస్సు.

స్వయంకృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లి చక్రి స్వస్థలం. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అబ్బడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పట్నుంచీ చక్రి బాగా పాడేవారు. కొడుకు మనోభీష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు. కంబాలపల్లిలో పదవ తరగతి వరకూ చదువుకున్న చక్రి... అక్కడే ఫ్లూట్ నేర్చుకున్నారు.

ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకూ మహబూబాబాద్‌లో చదువుతూ.. అక్కడే వయోలిన్, కర్ణాటక సంగీతం అభ్యసించారు. అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా... చక్రి సంగీత విభావరి ఉండాల్సిందే. చక్రి ట్రూప్ పేరు ‘సాహితీ కళాభారతి’. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు... కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా’ అనే పాటను చక్రి స్వయంగా రాసి, స్వరపరిచి ఆలపిస్తే... కాలేజ్ ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. చక్రి ప్రతిభను గమనించిన స్నేహితులందరు... ‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నీ పాట ఊళ్లల్లో జరిగే శుభకార్యాలకు పరిమితం కాకూడదు. తెలుగు సినీ సంగీతాన్ని శాసించే సత్తా నీలో ఉంది. నువ్వు హైదరాబాద్ వెళ్లు’ అంటూ బతిమాలారట. కానీ... చక్రి మాత్రం పెడచెవిన పెట్టాడు.

చక్రిని టీచర్‌గా చూడాలనేది తండ్రి ఆకాంక్ష. కానీ... చక్రికి మాత్రం ఉద్యోగాలపై ఆసక్తి ఉండేది కాదు. ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడలేను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసేవారు. 'ఏదైనా వ్యాపారం పెడితే.. తానే పదిమందికి పని ఇవ్వొచ్చు కదా!' అనుకొని... ఓ రెడీమెడ్ బట్టల దుకాణం పెట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే... చక్రి బట్టల దుకాణం పెట్టడం ఫ్రెండ్స్‌కి ఇష్టం లేదు. వాళ్లు మాత్రం చెవిలో జోరీగల్లా హైదరాబాద్ వెళ్లమని మొత్తుకుంటూనే ఉన్నారు. చివరకు హైదరాబాద్ బస్సెక్కారు చక్రి.

సంగీత దర్శకుడిగా సినీరంగ ప్రస్థానం

[మార్చు]

హైదరాబాద్ మహానగరం ఆయనకు అగమ్య గోచరంగా అనిపించింది. ఏం చేయాలో తెలీక ఫిలింనగర్ అంతా తిరిగారు. చివరకు పదివేలు ఖర్చు పెట్టి పండు వెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. దానికి పేరైతే వచ్చింది కానీ... డబ్బులు మాత్రం రాలలేదు. దాంతో చేసేది లేక భుక్తి కోసం ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేశారు. 'పండు వెన్నెల ' స్ఫూర్తితో... ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తుండేవారు చక్రి. అలా... మూడేళ్లల్లో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. చక్రి జీవితంలో మేలి మలుపు 'చిరునవ్వు ' మ్యూజిక్ ఆల్బమ్. సన ఆడియో వారు చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకంగా ఓ ఆల్బమ్ చేయాలనుకొని చక్రిని సంప్రదించారు. స్వతహాగా చిరంజీవి వీరాభిమాని అయిన చక్రి ఆ ఆల్బమ్ చేయడానికి అంగీకరించారు.

చిరంజీవి పాత పాటలనే రీమిక్స్ చేసి, ఆల్బమ్ చేయాలనేది సన ఆడియో వారి ఆలోచన. అయితే... చక్రి మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తానే స్వయంగా రాసి, స్వరపరుస్తానని చెప్పి, 8 పాటలతో 'చిరునవ్వు ' ఆల్బమ్‌ని రూపొందించారు. ఆ ఆల్బమ్ విన్న చిరంజీవి... చక్రిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ అల్బమ్‌లోని పాటల్ని చల్లగాలి అనే కలంపేరుతో చక్రే రాశారు. చక్రి మంచి గీత రచయిత కూడా. చిరునవ్వు పుణ్యమా అని చక్రికి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అరంగేట్రం పెద్ద సినిమాతో చేయాలనుకున్న చక్రి.. చిన్న సినిమా ఆవకాశాలన్ని తోసిపుచ్చారు. తప్పక ఒప్పుకున్న రెండు మూడు చిన్న సినిమాలు విడుదలకు నోచుకోలేదు. చివరకు పూరి జగన్నాథ్ బాచి (2000) చిత్రంతో సంగీత దర్శకునిగా చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకుగా చేయకుండానే సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది.

ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు. అంత‌కు ముందే పిల్లలు కాదు పిడుగులు చిత్రంలో ఒక పాటకు సంగీతం అందించారు. దేనికైనా రెడీ చిత్రంలోనూ 3 పాటలకు చ‌క్రి సంగీతం అందించారు.సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా చక్రి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా చక్రి తన కెరీర్‌ను ప్రారంభించారు. సింహా సినిమాకు చక్రి నంది అవార్డు అందుకున్నారు. చక్రి సంగీతం అందించిన చివరి చిత్రం ఎర్రబస్సు.

ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి. సత్యం, శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదారి, నేనింతే, మస్కా, సరదాగా కాసేపు, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి, భగీరథ, ఢీ, రంగ ది దొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. చిన్న వయస్సులోనే చక్రి పలు హిట్‌సాంగ్స్ అందించారు. కొత్త గాయనీ, గాయకులు ఎంతో మందిని చక్రి టాలివుడ్‌కు పరిచయం చేశారు. శ్రీమన్నారాయణ, జై బోలో తెలంగాణ సినిమాలకు చక్రి సంగీతం అందించారు.

గాయకుడు , నటుడి గా

[మార్చు]

బాచి సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ మినహా ఆ సినిమా ప్రభావం ఆ చిత్ర సాంకేతిక నిపుణులందరిపై పడింది. దాంతో పూరీ తదుపరి చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంకి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకోవద్దని నిర్మాత పట్టుబట్టారు. దాంతో పూరీ... నిర్మాతను వదిలాడు కానీ... చక్రిని వదల్లేదు. అదే కథతో మరో నిర్మాతకు సినిమా చేసిపెట్టాడు. అందుకే... చివరి శ్వాస విడిచే వరకూ పూరి జగన్నాథ్‌ని దైవంగా భావించారు చక్రి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే.

వంశీ- ఇళయరాజా కాంబినేషన్‌ని ఇష్టపడని శ్రోతలుండరు. వంశీ అభిరుచికి తగ్గట్టుగా ఇళయరాజా మాత్రమే సంగీతం అందించగలరనేది చాలామంది అభిప్రాయం. అయితే... ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో ఆ అభిప్రాయం తప్పని నిరూపించారు చక్రి. 'వెన్నెల్లో హాయ్.. హాయ్... మల్లెల్లో హాయ్... హాయ్..' అంటూ సంగీత ప్రియులను వెన్నెల్లో ఓలలాడించేశారు. వంశీ-చక్రి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలూ మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్లే కావడం విశేషం. ముఖ్యంగా గోపి గోపిక గోదావరి చిత్రంలోని 'నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటే... ప్రాణం విలవిల ' పాటైతే... మొబైళ్లలో కాలర్‌ట్యూన్‌గా మోత మోగించింది.

గాయకునిగా కూడా దాదాపు 150 పాటలు పాడారు చక్రి. సత్యం సినిమా కోసం ఆయన పాడిన 'ఓ మగువా నీతో స్నేహం కోసం... ' పాటకు గాయకునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోగా, సింహాకి సంగీత దర్శకునిగా నంది అవార్డు అందుకున్నారు చక్రి. సత్యం, ఎవడైతే నాకేంటి, రంగ ది దొంగ.. తదితర చిత్రాల్లో నటించారు కూడా

సేవా కార్యక్రమాలు

[మార్చు]

చక్రి తండ్రి వెంకటనారాయణకు దేశభక్తి, దైవభక్తి మెండు. ఆ విషయంలో కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గరు చక్రి. తన పుట్టిన రోజైన 'జూన్ 15 'ను వివిధ సేవాకార్యక్రమాలతో జరుపుకునేవారు. రక్తదానాలు, అన్నదానాలు, పండ్ల పంపిణీ... ఇలా అభిమానుల హడావిడీ ఆ రోజున అంతా ఇంతా ఉండదు.

చక్రి సంగీత దర్శకత్వంలో అమిత ప్రజాదరణ పొందిన కొన్ని పాటలు

[మార్చు]
పాట చిత్రం రచన పాడిన వారు
మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం హరిహరన్, కౌసల్య
వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చక్రి
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల గోపి గోపిక గోదావరి

చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

డిసెంబ‌ర్14 రాత్రి చక్రికి గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో 2014, డిసెంబర్ 15 న తుదిశ్వాస విడిచారు[1]

సినీరంగ ప్రముఖుల సంతాపం[3]

[మార్చు]
  • చక్రి నా బిడ్డ లాంటివాడు. నాకు చాలా నచ్చిన వ్యక్తి. భవిష్యత్తులో అతనితో చాలా సినిమాలు చేయాలనుకున్నాను. ఇంత చిన్న వయసులో ఆయన మరణం నన్నెంతో కలచివేసింది. దాసరి నారాయణరావు, దర్శక - నిర్మాత
  • చక్రి సంగీతానికి అభిమానిని నేను. మనిషిలాగే అతని మనసు కూడా భారీ. నా తమ్ముడు లాంటి చక్రి ఇలా హఠాన్మరణం చెందడం బాధగా ఉంది. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన చక్రి మరణం కళాకారులకూ, కళాభిమానులకూ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నందమూరి బాలకృష్ణ, సినీ హీరో
  • తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు చక్రి. స్వయంకృషితో ఎదిగిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. నేడు నిజంగా దుర్దినం. ఈ బాధను తట్టుకునే శక్తిని చక్రి కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. డి.సురేశ్‌బాబు, నిర్మాత
  • స్నేహానికి విలువిచ్చే గొప్ప వ్యక్తి చక్రి. వాణిజ్య చిత్రాలతో పాటు, విప్లవ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారాయన. చక్రి మరణం యావత్ సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆర్.నారాయణమూర్తి, నటుడు, దర్శకుడు
  • గత రాత్రి ఆఫీసు నుంచి తను ఇంటికెళ్లే ముందు ‘ఎందుకో జగన్ అన్నయ్యను చూడాలని ఉందిరా’ అని ఆఫీస్‌బాయ్‌తో అన్నాడట చక్రి. అది తెలిసి నా మనసు భారమైంది. నా తమ్ముణ్ణి కోల్పోయాను. నిజంగా చాలా బాధగా ఉంది. నా సినిమాతోనే తన కెరీర్ మొదలైంది. నా ప్రతి సినిమాకూ అద్భుతమైన సంగీతం అందించాడు చక్రి. పూరి జగన్నాథ్, దర్శక - నిర్మాత
  • చక్రి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయన ప్రతిభను తెలుగు చిత్రసీమ సరిగ్గా వినియోగించుకోలేదనే అనాలి. స్నేహానికి ప్రాణమిచ్చే అలాంటి మంచి మనిషి మరణం తెలంగాణ సినిమాకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకూ తీరని లోటు. ఎన్.శంకర్, ‘జై బోలో తెలంగాణ’ దర్శకుడు
  • చెడ్డవాళ్లు కూడా చనిపోయాక మంచి వాళ్లయిపోతారు. కానీ, బతికుండగానే చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్న మా చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైవీఎస్ చౌదరి, దర్శక - నిర్మాత
  • జగమంత కుటుంబాన్ని సంపాదించుకొని ఏకాకిలా వెళ్లిపోయాడు చక్రి. తను దూరమైనా తన పాట మాత్రం ఎప్పుడూ బతికే ఉంటుంది. సుద్దాల అశోక్‌తేజ, సినీ గీత రచయిత

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 http://www.thehindu.com/entertainment/music-director-chakri-dies-of-heart-attack/article6693264.ece
  2. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.
  3. http://english.tupaki.com/enews/view/Celebrities-words-on-Chakri-death/84527[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చక్రి&oldid=3912816" నుండి వెలికితీశారు