జిబ్రాల్టర్ జలసంధి
జిబ్రాల్టర్ జలసంధి | |
---|---|
ప్రదేశం | అట్లాంటిక్ మహాసముద్రం – మధ్యధరా సముద్రం |
అక్షాంశ,రేఖాంశాలు | 35°58′N 5°29′W / 35.967°N 5.483°W |
రకం | జలసంధి |
ప్రవహించే దేశాలు | |
గరిష్ట లోతు | 900 మీటర్లు (2,953 అ.) |
జిబ్రాల్టర్ జలసంధి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రానికి కలిపే ఒక సన్నని జలసంధి.[1] ఐరోపా లోని ఐబీరియన్ ద్వీపకల్పాన్ని ఆఫ్రికాలోని మొరాకో నుండి ఇది వేరు చేస్తుంది. స్పెయిన్ లోని పాయింట్ మారోక్వి, మొరాకోలోని పాయింట్ సైర్స్ మధ్య, 13 కి.మీ. వెడల్పున్న ఈ జలసంధి రెండు ఖండాలనూ వేరు చేస్తోంది.[2] పడవలు ఈ జలసంధిని దాటడానికి 35 నిమిషాలు పడుతుంది. జలసంధి లోతు 300 నుండి 900 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి చారిత్రకంగా కూడా మంది ప్రాధాన్యత ఉంది. అనేక సంస్కృతులు, నాగరికతలు ఈ మార్గం గుండా వ్యాప్తి చెందాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన సైనిక పడవలు ప్రవాహ వేగాన్ని ఊతంగా చేసుకుని ఇంజన్లు ఆపేసి శత్రువులకు తెలియకుండా నిశ్శబ్దంగా ప్రయాణించేవి.
ఈ జలసంధి మొరాకో, స్పెయిన్, బ్రిటిష్ విదేశీ భూభాగమైన జిబ్రాల్టర్ ల ప్రాదేశిక జలాలలో ఉంది. అక్కడక్కడ స్పెయిన్, మొరాకో, బ్రిటన్ దేశాల సార్వభౌమాధికారం కొంత వివాదాస్పదం అయినప్పటికీ సముద్ర చట్టంపై ఐరాస ఒప్పందం (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ) ప్రకారం, విదేశీ నౌకలు, విమానాలు ఈ జిబ్రాల్టర్ జలసంధిని స్వేచ్ఛగా దాటవచ్చు. 1980 నుండి ఈ జలసంధి కింద సముద్ర గర్భంలో స్పెయిన్, మొరాకోల మధ్య రైల్వే లైను గురించి చర్చలు మొదలయ్యాయి కానీ అవి నేటికీ రూపు దాల్చలేదు.
స్థానం
[మార్చు]జలసంధికి ఉత్తరం వైపున స్పెయిన్, జిబ్రాల్టర్‌లు, దక్షిణాన మొరాకో, సియుటా (ఉత్తర ఆఫ్రికాలోని స్పానిష్ స్వయంప్రతిపత్త నగరం) ఉన్నాయి. దీని సరిహద్దులను పురాతన కాలంలో హెర్క్యులస్ స్తంభాలు అని పిలిచేవారు. ఈ జలసంధి ఉన్న స్థానం కారణంగా ఇది, ఆఫ్రికా నుండి ఐరోపాకు జరిగే అక్రమ వలసలకు మార్గంగా ఉపయోగపడుతోంది. [3]
పరిధి
[మార్చు]ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ జిబ్రాల్టర్ జలసంధి పరిమితులను ఈ క్రింది విధంగా నిర్వచించింది: [4]
పశ్చిమాన - కేప్ ట్రఫాల్గర్ నుండి కేప్ స్పార్టెల్‌ను కలిపే రేఖ.
తూర్పున - యూరోపా బిందువును పి. అల్మినాకు కలిపే రేఖ.
చరిత్ర
[మార్చు]ఈ ప్రాంతంలో మొదటి మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు 1,25,000 సంవత్సరాల క్రితం నాటి నియాండర్తళ్ళకు చెందినవి. జిబ్రాల్టర్ రాక్ ప్రపంచంలోని నియాండర్తల్ నివాసాల చివరి అవుట్‌పోస్ట్‌లలో ఒకటై ఉండవచ్చని భావిస్తున్నారు. 24,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వారి ఉనికికి ఆధారాలు ఉన్నాయి.[5] ఈ ప్రాంతంలో హోమో సేపియన్స్ నివాసం ఉన్నట్లు 40,000 సంవత్సరాల నాటి పురావస్తు ఆధారాలున్నాయి.
రెండు తీరాల మధ్య సాపేక్షంగా తక్కువ దూరం ఉండడం కారణంగా, చరిత్రలో వివిధ సమూహాలు, నాగరికతలూ త్వరగా సముద్రాన్ని దాటే బిందువుగా ఇది పనిచేసింది. ఇందులో రోమ్‌కు వ్యతిరేకంగా దండెత్తిన కార్తజీనియన్లు, హిస్పానియా, మౌరిటానియా ప్రావిన్సుల మధ్య ప్రయాణించిన రోమన్లు, 5వ శతాబ్దంలో జర్మనీ నుండి పశ్చిమ రోమ్ మీదుగా దక్షిణ దిశగా ఉత్తరాఫ్రికా వెళ్ళిన వాండల్‌లు ఇలా ప్రయాణించిన వారిలో ఉన్నారు. 8వ-11వ శతాబ్దాలలో మూర్‌లు, బెర్బర్‌లు 16వ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగల్‌లు కూడా ఈ మార్గంలో ప్రయాణించారు.
1492 నుండి, సముద్రాన్ని దాటి వచ్చే ఆక్రమణలకు తద్వారా వచ్చే సంస్కృతి భాషల ప్రవాహాలకూ వ్యతిరేకంగా ఈ జలసంధి ఒక అవరోధంగా వ్యవహరించి, ఒక నిర్దిష్ట సాంస్కృతిక పాత్రను పోషించింది. ఆ సంవత్సరంలో, జలసంధికి ఉత్తరాన ఉన్న చివరి ముస్లిం ప్రభుత్వాన్ని స్పానిష్ దళం పడగొట్టింది. అప్పటి నుండి జలసంధికి ఇరువైపులా రెండు విభిన్నమైన సంస్కృతులు అభివృద్ధి చెందాయి.
ఉత్తర భాగంలో, 1492లో చివరి ముస్లిం రాజ్యాన్ని బహిష్కరించినప్పటి నుండి క్రిస్టియన్-యూరోపియన్ సంస్కృతి, రొమాన్స్ స్పానిష్ భాష ఆధిపత్యం చెలాయించాయి. దక్షిణ భాగంలో సా.శ. 700 లలో ఉత్తర ఆఫ్రికా లోకి ముస్లిం-అరబిక్/మధ్యధరా ప్రాంతం ఇస్లాం వ్యాప్తి చెందినప్పటి నుండి అరబిక్ భాష ఆధిపత్యం చెలాయించింది. గత 500 సంవత్సరాలుగా, జలసంధి వలన కలిగిన చిన్నపాటి ప్రయాణ అవరోధం కంటే కూడా మతపరమైన, సాంస్కృతిక అసహనమే, ఈ రెండు సమూహాల మధ్య ఉన్న సాంస్కృతిక విభజనకు శక్తివంతంగా పని చేసింది.
చిన్నబ్రిటిషు భూభాగమైన జిబ్రాల్టర్ నగరం, ఈ జలసంధిలో కనిపించే మూడవ సాంస్కృతిక సమూహం. ఈ ఎన్‌క్లేవ్‌ను మొట్టమొదట 1704లో స్థాపించారు. అప్పటి నుండి మధ్యధరా సముద్రం లోపలికి, వెలుపలకీ సముద్ర మార్గాలపై నియంత్రణ కోసం బ్రిటన్ దీన్ని ఉపయోగించుకుంది.
జూలై 1936లో స్పానిష్ తిరుగుబాటు తరువాత స్పానిష్ రిపబ్లికన్ నేవీ స్పానిష్ మొరాకో నుండి పెనిన్సులర్ స్పెయిన్‌కు ఆర్మీ ఆఫ్ ఆఫ్రికా దళాల రవాణాను అడ్డుకునేందుకు జిబ్రాల్టర్ జలసంధిని మూసేందుకు ప్రయత్నించింది. 1936 ఆగస్టు 5 న కాన్వాయ్ డి లా విక్టోరియా, ఈ దిగ్బంధనాన్ని ఛేదిస్తూ కనీసం 2,500 మంది సైనికులను జలసంధి మీదుగా తీసుకురాగలిగింది.[6]
ప్రసార, ప్రయాణాలు
[మార్చు]మధ్యధరా సముద్రం నుండి అట్లాంటిక్ వరకు ఈ జలసంధి ఒక ముఖ్యమైన నౌకా రవాణా మార్గం. జలసంధి గుండా స్పెయిన్, మొరాకోల మధ్య, అలాగే స్పెయిన్, సియుటాల మధ్య, జిబ్రాల్టర్ నుండి టాంజియర్ మధ్య ఫెర్రీలు ఉన్నాయి.
జలసంధి గుండా సొరంగం
[మార్చు]జలసంధి కింద సొరంగ నిర్మాణం గురించి స్పెయిన్, మొరాకోల మధ్య 1980లలో చర్చ ప్రారంభమైంది. 2003 డిసెంబరులో ఇరు దేశాలు జలసంధి మీదుగా తమ రైలు వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు సముద్రగర్భ రైలు సొరంగం నిర్మాణాన్ని అన్వేషించడానికి అంగీకరించాయి. రైలు గేజ్ 1,435 mమీ. (4 అ. 8.5 అం.) ఉంటుంది.[7] ప్రాజెక్ట్ ప్రణాళిక దశలో ఉన్నప్పుడే, స్పానిష్, మొరాకో అధికారులు దాన్ని చర్చించడానికి అప్పుడప్పుడూ సమావేశమయ్యారు [8] ఆ చర్చలు నిర్మాణాత్మకంగా ఏమీ జరగలేదు కానీ 2021 ఏప్రిల్‌లో కాసాబ్లాంకాలో ఉమ్మడి అంతర్ ప్రభుత్వ సమావేశం జరిపేందుకు రెండు దేశాల మంత్రులు అంగీకరించారు. సొరంగంపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఇది జరిగింది.[9] [10] అంతకుముందు, 2021 జనవరిలో, UK ప్రభుత్వం జిబ్రాల్టర్‌ను టాంజియర్స్‌తో అనుసంధానించడానికి ఒక సొరంగ నిర్మాణంపై ప్రణాళికలను అధ్యయనం చేసింది. 40 సంవత్సరాల చర్చల తర్వాత కూడా ముందుకు సాగని స్పానిష్-మొరాకో ప్రాజెక్టు స్థానంలో దీన్ని ప్రత్రిపాదించారు.[11]
ప్రత్యేక ప్రవాహ, తరంగ ధోరణులు
[మార్చు]జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని నేరుగా మధ్యధరా సముద్రానికి కలుపుతుంది. ఈ ప్రత్యక్ష అనుసంధానం వలన నిర్దిష్ట ప్రత్యేక ప్రవాహం, తరంగ ధోరణులు ఏర్పడతాయి. వివిధ ప్రాంతీయ, సార్వత్రిక బాష్పీభవన శక్తులు, నీటి ఉష్ణోగ్రతలు, అలల శక్తులు, గాలి శక్తుల పరస్పర చర్య కారణంగా ఈ ప్రత్యేక ధోరణులు ఏర్పడ్డాయి.
ప్రవాహాల రాక, పోక
[మార్చు]ఈ జలసంధి ద్వారా నీరు దాదాపు నిరంతరాయంగా తూర్పు వైపు, పడమర వైపూ ప్రవహిస్తూంటుంది. ఎక్కువ ఉప్పదనం, ఎక్కువ సాంద్రత ఉండే జలాలు తక్కువ మొత్తంలో మధ్యధరా సముద్రం నుండి బయటికి, పశ్చిమంగా నిరంతరం ప్రవహిస్తూంటాయి. తక్కువ లవణీయత, తక్కువ సాంద్రత కలిగిన ఉపరితల జలాలు పెద్ద మొత్తంలో తూర్పు దిశగా మధ్యధరా సముద్రం లోకి నిరంతరం ప్రవహిస్తాయి. చంద్రుడు, సూర్యుల స్థానాలపై ఆధారపడి ఈ ప్రవాహ ధోరణులకు తాత్కాలికంగా అప్పుడప్పుడూ అంతరాయం కలుగుతూంటుంది. అయినప్పటికీ, మొత్తం మీద మధ్యధరా బేసిన్‌లో బాష్పీభవన రేటు దానిలో కలిసే నదులన్నిటి మిశ్రమ ప్రవాహం కంటే ఎక్కువగా ఉన్నందున, తూర్పు దిశగా వెళ్ళే నీటి ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది.[12] జలసంధికి పశ్చిమ చివరలో కమారినల్ సిల్ ఉంది. ఇది జలసంధిలో అత్యంత తక్కువ లోతున్న బిందువు. చల్లని, తక్కువ లవణీయత ఉన్న అట్లాంటిక్ నీరు, వెచ్చని మధ్యధరా జలాల మధ్య సమ్మేళనాన్ని ఇది నిరోధిస్తుంది.
మధ్యధరా జలాలు అట్లాంటిక్ జలాల కంటే ఎంత ఎక్కువ ఉప్పగా ఉంటాయంటే, అవి నిరంతరం వచ్చే అట్లాంటిక్ ప్రవాహం క్రిందకు పోయి, అడుగున ఒక పొరగా ఏర్పడతాయి. ఈ దిగువ నీటి పొర అట్లాంటిక్‌లోకి మధ్యధరా నుండి నిరంతరం ప్రవహిస్తూంటుంది. జలసంధికి అట్లాంటిక్ వైపున, దాదాపు 100 మీటర్ల లోతున ఉండే ఒక సాంద్రత సరిహద్దు మధ్యధరా ప్రవాహ జలాలను మిగిలిన వాటి నుండి వేరు చేస్తుంది. ఈ జలాలు కాంటినెంటల్ వాలు నుండి బయటకు, క్రిందికి ప్రవహిస్తూ అట్లాంటిక్ జలాలతో కలిసి లవణీయతను కోల్పోతాయి. మధ్యధరా నుండీ వచ్చే ప్రవాహాన్ని జలసంధికి పశ్చిమాన వేల కిలోమీటర్ల వరకు గుర్తించవచ్చు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, జర్మన్ U-బోట్‌లు మధ్యధరా సముద్రంలోకి ప్రవాహాలను ఉపయోగించుకుని, ఇంజన్లను ఆఫ్ చేసి శత్రువులు గుర్తించకుండా నిశ్శబ్దంగా ప్రయాణించేవి.[13] 1941 సెప్టెంబరు నుండి 1944 మే వరకు జర్మనీ, 62 యు-బోట్లను మధ్యధరా సముద్రంలోకి పంపగలిగింది. ఈ పడవలన్నీ బ్రిటిషు నియంత్రణలో ఉన్న జిబ్రాల్టర్ జలసంధిని దాటేవి. ఆ క్రమంలో తొమ్మిది U-బోట్లు అక్కడ మునిగిపోయాయి. మరో 10 దెబ్బతిన్న కారణంగా వాటిని నిలిపివేయవలసి వచ్చింది. దాటిన U-బోట్‌లలో ఏ ఒక్కటి కూడా అట్లాంటిక్ లోకి తిరిగి రాలేదు. అన్నిటినీ శత్రువులు ముంచివేసారు లేదా వారి వాటి సిబ్బందే ముంచేసారు.[14]
అంతర్గత తరంగాలు
[మార్చు]జలసంధిలో తరచూ అంతర్గత తరంగాలు (సాంద్రత సరిహద్దు పొర వద్ద ఏర్పడే తరంగాలు) ఉత్పత్తి అవుతూంటాయి. హైవేలో ట్రాఫిక్ విలీనమైన చోట్ల జరిగినట్లు, ఈ నీటి ప్రవాహం అవరోధాలను ఎదుర్కొని నెమ్మదిస్తుంది. ఎందుకంటే ఈ ప్రవాహాలు తప్పనిసరిగా కమరినల్ సిల్ మీదుగా వెళ్లాలి. పెద్ద టైడల్ ప్రవాహాలు జలసంధిలోకి ప్రవేశించినప్పుడూ, అధిక ఆటుపోట్లు సడలినప్పుడూ, కమరినల్ సిల్ వద్ద అంతర్గత అలలు ఉత్పన్నమై, తూర్పు వైపుగా వెళ్తాయి. ఈ తరంగాలు చాలా లోతు వరకు సంభవించినప్పటికీ, ఉపరితలం వద్ద మాత్రం ఒక్కోసారి దాదాపుగా కనిపించవు. ఇతర సమయాల్లో అవి ఉపగ్రహ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అంతర్గత తరంగాలు తూర్పు వైపు ప్రవహిస్తూనే ఉంటాయి తీరప్రాంతాల వద్ద వక్రీభవనం చెందుతాయి. వాటిని కొన్నిసార్లు 100 కి.మీ. (62 మై.; 54 nmi) వరకు గుర్తించవచ్చు.
ప్రాదేశిక జలాలు
[మార్చు]తూర్పు కొన మినహా జలసంధి అంతా స్పెయిన్, మొరాకోల ప్రాదేశిక జలాలలో ఉంది. జలసంధికి ఉత్తరం వైపున జిబ్రాల్టర్ చుట్టూ 3 నాటికల్ మైళ్ళ వరకు ఉన్న భాగాన్ని బ్రిటను తనదని చెబుతుంది. ఇక్కడ గరిష్టంగా 12 నాటికల్ మైళ్ళు ఉంటుంది కాబట్టి బ్రిటిష్ వాదన ప్రకారం, జలసంధిలో కొంత భాగం అంతర్జాతీయ జలాల్లో ఉంది. జిబ్రాల్టర్, దాని ప్రాదేశిక జలాల యాజమాన్యం స్పెయిన్ వివాదాస్పదం చేసింది. అదేవిధంగా, మొరాకో దక్షిణ తీరంలో సియుటాపై స్పానిష్ సార్వభౌమాధికారం వివాదాస్పదమైంది.[15] వివాదాస్పద ఇస్లా పెరెజిల్ వంటి అనేక ద్వీపాలు ఉన్నాయి. ఇవి తమవేనని మొరాకో, స్పెయిన్ రెండూ వాదిస్తున్నాయి.[16]
సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ప్రకారం, జలసంధి గుండా ప్రయాణించే నౌకలు చాలా ప్రాదేశిక జలాల్లో అనుమతించబడిన రవాణా మార్గంలో ప్రయాణిస్తాయి. కాబట్టి, నౌకలు, విమానాలూ జిబ్రాల్టర్ జలసంధిని దాటడానికి స్వేచ్ఛ ఉంది.[17] [18]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Strait | Meaning of Strait by Lexico". Lexico Dictionaries | English (in ఇంగ్లీష్). Archived from the original on 2020-11-28. Retrieved 2020-04-28.
- ↑ "Strait of Gibraltar | channel". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-10-24.
- ↑ "Migration Information Source – The Merits and Limitations of Spain's High-Tech Border Control". Migrationinformation.org. Retrieved 2011-07-15.
- ↑ "Limits of Oceans and Seas, 3rd edition" (PDF). International Hydrographic Organization. 1953. Retrieved 28 December 2020.
- ↑ (October 2008). "Last of the Neanderthals". Archived 2008-09-18 at the Wayback Machine
- ↑ Antony Beevor (2006). The Battle for Spain. Orion. ISBN 978-0-7538-2165-7.
- ↑ "Europe-Africa rail tunnel agreed". BBC News.
- ↑ "Tunnel to Connect Morocco with Europe". bluedoorhotel.com. February 17, 2012. Archived from the original on 2012-11-04.
- ↑ "Strait of Gibraltar underwater railway tunnel project coming back to life". Construction Review Online. 15 August 2021. Retrieved 6 October 2021.
- ↑ "Morocco, Spain discuss revival of fixed link project via Gibraltar Strait". THE NORTH AFRICA POST. 22 April 2021. Retrieved 6 October 2021.
- ↑ Alaoui, Mohamed (9 January 2021). "British-Moroccan undersea tunnel would connect Africa to Europe". The Arab Weekly. Retrieved 6 October 2021.
- ↑ (2010-10-12). "Estimation of the Atlantic inflow through the Strait of Gibraltar from climatological and in situ data".
- ↑ Paterson, Lawrence. U-Boats in the Mediterranean 1941–1944. Chatham Publishing, 2007, pp. 19 and 182. ISBN 9781861762900
- ↑ "U-boat war in the Mediterranean". uboat.net. Retrieved 2011-07-15.
- ↑ Víctor Luis Gutiérrez Castillo (April 2011). The Delimitation of the Spanish Marine Waters in the Strait of Gibraltar (PDF) (Report). Spanish Institute for Strategic Studies. Retrieved 5 July 2019.
- ↑ Tremlett, Giles, "Moroccans seize Parsley Island and leave a bitter taste in Spanish mouths", in The Guardian, 13 July 2002.
- ↑ Víctor Luis Gutiérrez Castillo (April 2011). The Delimitation of the Spanish Marine Waters in the Strait of Gibraltar (PDF) (Report). Spanish Institute for Strategic Studies. Retrieved 5 July 2019.
- ↑ Donald R Rothwell (2009). "Gibraltar, Strait of". Oxford Public International Law. Oxford University Press. doi:10.1093/law:epil/9780199231690/e1172. ISBN 9780199231690. Retrieved 6 July 2019.
బాహ్యలంకెలు
[మార్చు]- Climate Control Requires a Dam at the Strait of Gibraltar Archived 2009-02-22 at the Wayback Machine—American Geophysical Union, 1997. Accessed 26 February 2006. Gone 12 February 2010. Dam design at http://www.agu.org/sci_soc/eosrjohnsonf3.gif Archived 2012-09-26 at the Wayback Machine Building the dam and letting the Mediterranean Sea completely evaporate would raise Sea Level 15 meters over 1,000 years. Evaporating the first 100 meters or so would raise Sea Level 1 meter in about 100 years.
- Project for a Europe-Africa permanent link through the Strait of Gibraltar—United Nations Economic and Social Council, 2001. Accessed 26 February 2006.
- Estudios Geográficos del Estrecho de Gibraltar—La Universidad de Tetuán and La Universidad de Sevilla. Accessed 26 February 2006. (in Spanish)
- "Solitons, Strait of Gibraltar". NASA Earth Observatory. Archived from the original on 2004-08-17. Retrieved 2006-05-24.
- "Internal Waves, Strait of Gibraltar". NASA Earth Observatory. Archived from the original on 2001-06-20. Retrieved 2006-05-24.
- Old maps of the Strait of Gibraltar, Eran Laor Cartographic Collection, The National Library of Israel