కొండ ప్రాంతాల్లో రైల్వే లైన్లకు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలైన్ మంచి ఉదాహరణ . ప్రమాదకరమైన, ఎత్త్తెన కొండప్రాంతాల్లో సాఫీగా రైల్లో ప్రయాణించడానికి 1881లోనే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే గొప్ప సాంకేతిక ప్రయోగం చేసి విజయవంతమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రైలుకు మంచి గుర్తింపు, ఆదరణ లభించాయి. ఈస్ట్రన్ బెంగాల్ రైల్వే ముందు ఈ రైల్వే నిర్మాణానికి వెనకడుగు వేసినా ఆ సంస్థకు చెందిన ఫ్రాంక్లిన్ ఆసక్తితో రైలు నిర్మాణానికి పూనుకుని పూర్తిచేశారు. ఈ రైల్వే లైను గేజ్ 2 అడుగులు మాత్రమే ఉంటుంది. స్టీమ్ ఇంజన్‌తో నడుస్తుంది. డార్జిలింగ్ పరిసర ప్రాంతాలను కలుపుతూ ఎత్త్తెన పర్వత శ్రేణుల్లో ఏర్పాటు చేసిన ఈ రైల్వే ఎంతో విజయవంతమైంది. 7,407 అడుగుల ఎత్తులోని ఘూమ్ రైల్వే స్టేషను ఈ రైలు చేరుకునే అత్యంత ఎత్త్తెన ప్రదేశం. ఈ రైలును యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. స్థానికులు బొమ్మ రైలు (టాయ్ ట్రైన్) గా పిలుచుకునే ఇందులో ప్రయాణం అద్భుతం. అందమైన పర్వత ప్రాంతం, చల్లని గాలుల మధ్య రైలు ప్రయాణం ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమని పర్యాటకులు పేర్కొంటారు. న్యూజల్‌పాయ్ గురి నుంచి డార్జిలింగ్ వరకు సాగే ఈ ప్రయాణం పర్యాటకుల మంచి అనుభూతిని మిగుల్చుతుంది.