Jump to content

నరసింహావతారం

వికీపీడియా నుండి
(నృసింహావతారము నుండి దారిమార్పు చెందింది)
నరసింహావతారం
నరసింహావతారం
రక్షించే భగవంతుడు
దేవనాగరిनरसिंह
సంస్కృత అనువాదంNarasiṁha
అనుబంధంవిష్ణువు దశావతారాలలో నాల్గవది
నివాసంవైకుంఠం
ఆయుధములుచక్రం, గద, గోళ్ళు
భర్త / భార్యనారసింహి

నరసింహావతారం, శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారాన్ని వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శ్లోకం:

విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ||

ప్రార్థన శ్లోకం:

సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||

అవతార విశిష్టత

[మార్చు]

విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చును.

  • భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి.
  • సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.
  • హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నియంత్రణలు ఉన్నా, మరొక ఉపాయం సాధ్యమయ్యింది. చివరకు రాక్షస వధ తప్పలేదు.
  • భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు.

ఇంక ఈ అవతారాన్ని స్మరించడంలో తెలుగువారికి మరికొన్ని విశేషమైన వనరులు ఉన్నాయనవచ్చును.

జయ విజయుల శాపవృత్తాంతము

[మార్చు]

జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనకసనందనాది మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణుఫును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలుగానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.

ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలుగాను జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంచేత వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.

హిరణ్యాక్షుడు

[మార్చు]

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీవరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీమహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు.

హిరణ్యకశిపుడు

[మార్చు]

సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు. అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందరగిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి, తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవదానవమనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు. అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు.

ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు - "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టిననాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు.

ప్రహ్లాదుడు

[మార్చు]

ముఖ్య వ్యాసము: భక్త ప్రహ్లాదుడు

హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళారు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని నప్పగించాడు.

ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.

చదవనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ

అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్థించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.

చదువులలో మర్మం

[మార్చు]

ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్యకళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడు. ఆందుకు ప్రహ్లాదుడు

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కుటజములకు?
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్తమేరీతి నితరంబు జేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల?

విష్ణు భక్తి నాకు దైవయోగం వల్ల సహజంగా సంభవించింది. అని జవాబిచ్చాడు.

కోపించిన రాక్షస రాజుకు సర్దిచెప్పి, మరల వివిధోపాయాలలో బోధన చేస్తామని ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వెళ్ళారు గురువులు. అక్కడ మళ్ళీ ప్రహ్లాదునికి తమ విద్యలు నూరిపోసి, రాజువద్దకు తిరిగి తీసికొని వెళ్ళారు. రాజు తన కొడుకును ముద్దుచేసి - "గురువులే సంవిద్యాంశంబులు జెప్పిరో, విద్యా సారమెరుంగకోరెద, భవదీయోత్కర్షమున్ జూపవే ననుగన్న తండ్రీ" -అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు
నే చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! - అని చెప్పెను.

మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని బ్రతుకు వ్యర్ధము. విష్ణుని సేవించు దేహమే ప్రయోజనకరము. ఆ దేవదేవుని గూర్చి చెప్పేదే సత్యమైన చదువు. మాధవుని గూర్చి చెప్పేవాడే సరైన గురువు. హరిని చేరుమని చెప్పేవాడే ఉత్తముడైన తండ్రి." - అని వివరించాడు.

ఏడీ విష్ణువు?

[మార్చు]

హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.

క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.

ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా

కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు.

ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.

హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ ప్రభావంబుతోన్

ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం)

అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.

శ్రీ నరసింహావిర్భావం

[మార్చు]

బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "

ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.

ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.

భక్త పాలన

[మార్చు]
హిరణ్యాకశిపుని చంపుతున్న నరసింహ అవతారము

స్వామి ముఖం భీకరంగా కనపిస్తోంది. రక్తరంజితమైన వజ్రనఖాలు సంధ్యాకాలపు ఎర్రదనాన్ని సంతరించుకొన్నాయి. ప్రేవులను కంఠమాలికలుగా వేసుకొన్నాడు. జూలునుండి రక్తం కారుతోంది. ఆయన నిట్టూర్పులు పెనుగాలుల్లా ఉన్నాయి. దేవతలు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు. సకలదేవతలు స్తుతించి ప్రణతులు అర్పించారు.

మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు. శ్రీనారసింహస్వామి తన అభయ మంగళ దివ్య హస్తాన్ని ప్రహ్లాదుని తలపైనుంచి దీవించాడు. ప్రహ్లాదుడు పరవశించి పలువిధాల స్తుతించాడు. ప్రసన్నుడైన స్వామి ఏమయినా వరాన్ని కోరుకొమ్మన్నాడు.

"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు. "నాయనా. నిన్ను కొడుకుగా పొందినపుడే నీ తండ్రితో 21 తరాలు (తల్లివైపు 7 తరాలు, తండ్రివైపు 7 తరాలు, ప్రహ్లాదుని తరువాతి 7 తరాలు)పావనమైనాయి. నా స్పర్శతో నీ తండ్రి పునీతుడైనాడు. నీ తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజువుకా. నా యందు మనసు నిలిపి, విజ్ఞుల ఉపదేశాన్ని పొందుతూ పాలన చేయి" అని ఆశీర్వదించాడు స్వామి.

శంకరుడు, బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ధ్యానించేవారికి యమునిగురించిన భయముండదు" అన్నాడు బ్రహ్మ. శ్రీలక్ష్మీ సమేతుడై స్వామి వైకుంఠమునకరిగెను. బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని పూజలందుకొని తమలోకములకరిగిరి.

ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.

శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!

తెలుగులో శ్రీనృసింహ గాధలు

[మార్చు]

శ్రీనృసింహాలయాలు

[మార్చు]

ప్రార్థనలు

[మార్చు]

విశేషాలు

[మార్చు]
  • ప్రత్యేకించి ఆరోగ్యంకోసం నరసింహ స్వామిని ఆరాధించడం ఒక ఆచారం.
  • నరసింహాలయాలు ఉన్న కొండలను "వేదాద్రి" అని పిలవడం చాలాచోట్ల జరుగుతుంది.
  • మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ప్రహ్లాదుని అవతారమని కథ, భక్తుల విశ్వాసం
  • తెలుగునాట బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణిక నాటకాలలో "భక్త ప్రహ్లాద" ఒకటి. "భక్త ప్రహ్లాద" వంటి నాటకాలు వేసేప్పుడు నరసింహపాత్రధారిగా కాస్త చిన్న బాలుడిని తీసుకొంటారు (స్తంభంలో పట్టడానికి అనువుగా). నరసింహావిర్భావం సీనులో స్తంభం చీలి (ఉగ్రమూర్తిగా)స్వామి (పాత్రధారి) బయటకు రాగానే శాంతింపజేయడానికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం ఆనవాయితీ.
  • తెలంగాణాలో యాదగిరిగుట్ట చుట్టుప్రక్కల జిల్లాలలో "యాదగిరి" అనేది సర్వ సాధారణమైన పేరు. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో (అప్పల నరసింహస్వామి పేరుమీద) అప్పారావు, అప్పలరాజు, అప్పలసామి, అప్పలమ్మ, నరసరాజు, నరసమ్మ వంటివి సాధారణమైన పేర్లు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో (పానకాల నరసింహస్వామి పేరుమీద) పానకాలు పేరు పెట్టుకొంటారు. అలాగే నరసింహ, సింహ, నరహరి వంటి పదాలతో కూడిన పేర్లు అతిసాధారణం.
  • అన్నమయ్య కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని స్తుతించేవి అధికాధికం. తరువాత శ్రీనారసింహుని స్తుతించే కీర్తనలు కూడా చాలా ఉన్నాయి.
  • తెలుగు సినిమా పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. (సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహాద్రి, లక్ష్మీనరసింహా, నరసింహుడు, బొబ్బిలిసింహం )
  • చెంచులక్ష్మి సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]