భారతదేశంలో వైద్య విద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రలేసియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS) లో సుశ్రుతుని (800 BCE) విగ్రహం. ఇతను సుశ్రుత సంహిత రచయిత, శస్త్రచికిత్సకు పితామహుడూ అయిన భారతీయ వైద్యుడు.

భారతదేశంలో ఆధునిక వైద్యంలో వైద్యుడిగా పనిచెయ్యాలంటే కనీసావసరమైన డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS). ఆధునిక వైద్యంలో ఆయుర్వేదం (BAMS), యునాని (BUMS), సిద్ధ (BUMS), సిద్ధ(BSMS), హోమియోపతి (BHMS) కూడా భాగమే. భారతదేశంలో ఆధునిక వైద్యం చేసేందుకు అవసరమైన ప్రామాణిక డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS). ఐదున్నర-సంవత్సరాల గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తర్వాత సంపాదించే డిగ్రీ ఇది. సాధారణ సైన్స్ సబ్జెక్టులలో ఒక సంవత్సరం ప్రి-క్లినికల్ అధ్యయనాలు, మూడున్నర సంవత్సరాల పారాక్లినికల్, క్లినికల్ స్టడీస్‌తో దీని పాఠ్యప్రణాళిక కూడుకుని ఉంటుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు క్లినికల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ప్రారంభించే ముందు, విద్యార్థులు అనేక పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. వాటిలో చివరి దాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తారు. మెడికల్ స్పెషాలిటీలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం MBBS అయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు చదవాలి. ఇది చదివాక మాస్టర్ ఆఫ్ సర్జరీ గానీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ గానీ లభిస్తుంది. ఆ తరువాత మరో రెండు సంవత్సరాల చదువు పూర్తి చేస్తే మెడికల్ స్పెషలైజేషన్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పొందవచ్చు.

భారతదేశంలో బ్రిటిషు వారు ఆధునిక పాశ్చాత్య వైద్యాన్ని ప్రవేశపెట్టడానికి చాలా కాలం ముందు నుండే ఇక్కడ అనేక పురాతన వైద్య విధానాలు ఆచరణలో ఉన్నాయి. ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం (జీవిత శాస్త్రం). ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి అన్ని సాంప్రదాయ వ్యవస్థలు (వీటన్నిటినీ సమిష్టిగా ఆయుష్ (AYUSH) అని పిలుస్తారు). ఈ ఔషధాల రూపాలు భారతదేశంలోని ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలో ఆధునిక వైద్య విధానంతో పాటుగా కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ వైద్యులు అధికారికంగా దేశంలోని 29 రాష్ట్ర వైద్య మండళ్ళలో ఒకదాని నుండి లైసెన్సు పొందవలసి ఉంటుంది. సాంప్రదాయిక వ్యవస్థలలోని వృత్తిపరమైన డిగ్రీ ప్రోగ్రామ్‌లు కూడా ఇలాగే రూపొందించబడ్డాయి: బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదం, మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) వంటి డిగ్రీలు ఐదున్నర సంవత్సరాల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తర్వాత ఇస్తారు. డిగ్రీ పొందేందుకు వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత, చివరి ఒక-సంవత్సరం క్లినికల్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం అవసరం. మెడికల్ స్పెషాలిటీలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం BAMS, BHMS తర్వాత మూడు సంవత్సరాలు చదవాలి. ఈ చదువు పూర్తయ్యాక మాస్టర్ ఆఫ్ ఆయుర్వేద (BAMS MD/MS (AYU)), మాస్టర్ ఆఫ్ హోమియోపతి (BHMS MD(హోమియో)) డిగ్రీలు లభిస్తాయి. BAMS తరువాత మరో రెండు సంవత్సరాల పాటు చదివి మెడికల్ స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పొందవచ్చు.

ఆయుష్ వైద్య వ్యవస్థను CCIM (సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్), CCH (సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి) లు నియంత్రిస్తాయి. పాశ్చాత్య వైద్య వ్యవస్థను గతంలో MCI (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నియంత్రించేది. 2020 నుండి ఇది నేషనల్ మెడికల్ కమిషన్ నియంత్రణలో ఉంది.

కళాశాలలు

[మార్చు]

భారతీయ చట్టం ప్రకారం ఈ సంస్థలను నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించాలి [1] ఇలా ఆమోదించబడిన వైద్య కళాశాలల జాబితాను భారత ప్రభుత్వం వద్ద ఉంటుంది. [2] MBBS డిగ్రీలు లేని వ్యక్తులు కొందరు, వైద్యుల వలె ప్రాక్టీస్ చేస్తూంటారు. వారిని క్వాక్స్ అంటారు. నేషనల్ మెడికల్ కమీషన్ యాక్ట్ 2019 ప్రకారం, ఇలాంటి వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, INR 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. [3]

ప్రవేశాలు

[మార్చు]

గత కొన్నేళ్లుగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలను క్రమబద్ధీకరించారు. ప్రవేశాల ప్రక్రియలో పెద్దయెత్తున సంస్కరణలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. సాధారణంగా, ప్రవేశం కింది వాటిలో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది:

  1. కేంద్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలలో (NEET) సాధించిన మార్కులు
  2. 12 వ తరగతి బైపిసి ఫైనల్ పరీక్షల్లో కనీసం 50% (జనరల్ వర్గానికి) వచ్చి ఉండాలి.
  3. డొనేషన్/మేనేజిమెంటు ఆధారిత సీట్లు.

అదేవిధంగా పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలు. డిప్లొమాల (రెసిడెన్సీలు) కోసం కూడా కేంద్ర (NEET) స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు ప్రవేశానికి ఆధారం. కొన్ని సంస్థల్లో ఇంటర్వ్యూ కూడా అవసరం కావచ్చు. అయితే సబ్-స్పెషాలిటీ కోర్సుల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది.

ఈ డొనేషను ఆధారిత సీట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీల ద్వారా మెడికల్ సీట్ల అమ్మకానికి అధికారం ఇచ్చినట్లైంది. చదువుకు మార్గం చెల్లించే సామర్థ్యం తప్ప మెరిట్ కాదు అనే సూత్రాన్ని పరోక్షంగా అంగీకరించినట్లైంది. ఈ అక్రమ క్యాపిటేషన్ ఫీజులు ఎంబీబీఎస్ సీటుకు కోట్లలో ఉంటాయి. ఏదైనా మెడికల్ సీటు కోసం జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థి యూజీ కోర్సుల్లో సీటు పొందడానికి నీట్ యూజీలో కనీసం 50 పర్సంటైల్ స్కోర్ చేసి ఉండాలి. [4] కానీ కేరళ వంటి రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజ్‌మెంట్ సీట్లకు కూడా పోటీ ప్రవేశ పరీక్షలలో కనీస మార్కులు / ర్యాంకులు ఆవశ్యకం.

బహుళ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి, కనీస సామర్థ్యాన్ని నిర్ధారించడానికీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అవినీతిని నిర్మూలించే ఉద్దేశ్యంతోనూ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (BOGలు) తమ విజన్ 2015లో NTA-NEET-UG, NEET-PGలను ప్రతిపాదించారు. ఈ బోర్డును MCI రద్దు తర్వాత భారత ప్రభుత్వం నియమించింది. నీట్ పరీక్ష అనేది మెడికల్ కాలేజీలో ప్రవేశానికి ఏకైక మార్గం. [5] UG, PG కోర్సుల కోసం అమలు చేసిన NEET లోని అంశాలు విజన్ 2015 డాక్యుమెంట్‌లో ప్రతిపాదించిన వాటి కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, దాని ప్రధాన ప్రయోజనం మాత్రం అమలులో కొనసాగింది.

కింది ఏజెన్సీలు ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. 2019లో వీటిని రద్దు చేసారు:

  • AIIMS ప్రవేశ పరీక్షలు – ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
  • నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
  • JIPMER ప్రవేశ పరీక్షలు – జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

2013లో MBBS, BDS కోర్సులలో ప్రవేశం కోసం NTA-NEET (అండర్ గ్రాడ్యుయేట్) ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహించింది. NEET-UG ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్టును (AIPMT), రాష్ట్రాలు, కళాశాలలు ఎవరికి వారే నిర్వహించుకునే పరీక్షలనూ రద్దు చేసి వాటి స్థానంలో అమల్లోకి వచ్చింది. అయితే, అనేక కళాశాలలు, సంస్థలు తమ MBBS, BDS కోర్టు నుండి స్టే ఆర్డర్‌ను తీసుకొని ప్రైవేటుగా పరీక్షలను నిర్వహించుకున్నాయి. అయినప్పటికీ, సాయుధ దళాల వైద్య కళాశాల, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వంటి అనేక ఇతర ప్రసిద్ధ సంస్థలు NEET-UG ఆధారంగానే విద్యార్థులను చేర్చుకున్నాయి. మొదటి పరీక్ష 2013 మే 5 న నిర్వహించారు. [6] జూన్ 5 న ఫలితాలను ప్రకటించారు. [7] భారతదేశంలో, MBBS సీటుకు అర్హత సాధించడానికి భారీ పోటీ ఉంది. NEET-UG 2013లో, 6,58,040 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 3,66,317 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 31,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. [8] [9]

2013 జూలై 18 న భారత సర్వోన్నత న్యాయస్థానం 2:1 నిర్ణయంతో నీట్ పరీక్షను రద్దు చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, 2013 ఆగస్టు లో సమీక్ష కోసం అప్పీలు చేసింది, 2016 మేలో భారత సర్వోన్నత న్యాయస్థానం అన్ని వైద్య పరీక్షలను రద్దు చేసింది. భారతదేశంలోని అన్ని వైద్య కళాశాలల్లోనూ ప్రవేశం పొందడానికి నీట్ (UG), NEET (PG) మాత్రమే ఏకైక మార్గంగా మారాయి. 2019 నుండి NEET పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్

[మార్చు]

అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు (రెసిడెన్సీలు), MD/MS పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులకూ ఒకే అర్హత/ప్రవేశ పరీక్ష NBE NEET (PG). పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం అమల్లో ఉన్న AIPGMEE పరీక్షను, అలాంటి రాష్ట్ర స్థాయి పరీక్షలనూ రద్దు చేసి వాటి స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. మొదటి NEET (PG)ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 2012 నవంబరు 23 నుండి డిసెంబరు 6 వరకు నిర్వహించింది, దీనిని టెస్టింగ్ విండోగా (నవంబరు 24, 25, 28, డిసెంబరు2 లు పరీక్ష జరగని రోజులు) సూచిస్తారు. దేశంలోని 50% ఆల్ ఇండియా కోటా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి AIIMS సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాంప్రదాయిక పెన్నూ పేపరు పరీక్షలా కాకుండా ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంది. మొత్తం 90,377 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. [10]

విదేశీయులకు ప్రవేశం

[మార్చు]

వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్ర్వాస భారతీయుల, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ (NRI) కోటాలతో పాటు, వైద్య విద్య కోసం సౌకర్యాలు సరిగా లేని అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం అనేక సీట్లను కేటాయించింది. ఈ రిజర్వ్‌డ్ సీట్ల యొక్క ఖచ్చితమైన సంఖ్య, దేశం-ఆధారిత కేటాయింపు ఏటా మారవచ్చు.

రిజర్వ్ చేసిన సీట్లలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు విదేశాలలో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా లేదా భారతదేశంలోని ఆయా దేశాల దౌత్య కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు లేదా హైకమిషన్లు మరింత సమాచారాన్ని అందిస్తాయి. అటువంటి ప్రాయోజిత అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుండి సాధారణంగా మినహాయింపు ఉంటుంది. [11] [12]

NRI కోటా ద్వారా సీట్లు తీసుకోవాలనుకునే విదేశీ పౌరులు కూడా NEET Archived 2022-05-20 at the Wayback Machine (కనీసం అన్ని ప్రభుత్వ కళాశాలలకు) పరీక్షలో అర్హత సాధించాలి. అర్హత ఉన్న NRI అభ్యర్థులందరి నుండి ఆ కోటాలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. [13] ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థుల ఫీజు విధానం కూడా భిన్నంగా ఉంటుంది.

గ్రాడ్యుయేషను విద్య

[మార్చు]

MBBS కోర్సు బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అనాటమీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ వంటి ప్రాథమిక, ప్రీ, పారా-క్లినికల్ సబ్జెక్టులతో ప్రారంభమవుతుంది. విద్యార్ధులు ఏకకాలంలో వార్డులు, ఔట్-పేషెంట్ విభాగాలలో పనిచేస్తూ శిక్షణ పొందుతారు. అక్కడ వారు ఐదు సంవత్సరాల పాటు నిజమైన రోగులతో సంభాషిస్తారు. పాఠ్యప్రణాళికలో రోగ చరిత్ర తీసుకోవడం, పరీక్ష, అవకలన నిర్ధారణ, పూర్తి రోగి నిర్వహణ యొక్క ప్రామాణిక ప్రోటోకాల్‌లను రూపొందించడం భాగంగా ఉంటాయి. రోగికి ఏ పరిశోధనలు ఉపయోగపడతాయో, ఉత్తమమైన చికిత్స ఏమిటో నిర్ణయించడం విద్యార్థికి బోధిస్తారు. పాఠ్యప్రణాళికలో సమగ్రమైన ఆచరణాత్మక జ్ఞానం, ప్రామాణిక క్లినికల్ విధానాలను నిర్వహించే అభ్యాసం కూడా ఉంటాయి. ఈ కోర్సులో 12-నెలల పాటు జరిగే ఇంటర్న్‌షిప్ కూడా భాగం. దీనిలో విద్యార్థులు వివిధ స్పెషాలిటీల్లో పనిచేస్తారు. స్టాండర్డ్ క్లినికల్ కేర్‌తో పాటు, వార్డ్ మేనేజ్‌మెంట్, స్టాఫ్ మేనేజ్‌మెంట్, క్షుణ్ణమైన కౌన్సెలింగ్ నైపుణ్యాల గురించిన అనుభవం కూడా విద్యార్థులు పొందుతారు.

ప్రదానం చేసే డిగ్రీని "బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ" అంటారు. MBBS కోర్సుకు కనీస అవసరాలు '10+2' పరీక్షలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఆంగ్లంలో 50% మార్కులు. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులకు 40% వస్తే చాలు. నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంకును బట్టి దేశం లోని వివిధ కళాశాలల్లో ఈ కోర్సు లోకి ప్రవేశం ఉంటుంది.

ఆల్టర్నేటివ్ మెడిసిన్

[మార్చు]

ఆయుర్వేదం (A), యోగా & నేచురోపతి (Y), యునాని (U), సిద్ధ (S), హోమియోపతి (H) వైద్యాలన్నిటినీ సమిష్టిగా ప్రత్యామ్నాయ వైద్యం ఆయుష్ (AYUSH) - అంటారు. ఈ విభాగాల్లో ఇచ్చే డిగ్రీలు ఇలా ఉంటాయి.

  • BAMS, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. తరువాత MD
  • BHMS, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ & సర్జరీ. తరువాత MD
  • BNYS, బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి & యోగిక్ సైన్సెస్. తర్వాత MD [14]
  • BSMS, బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ aMD సర్జరీ. తరువాత MD
  • BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిన్ అండ్ సర్జరీ. తరువాత MD

ఇతర వైద్య సంబంధ గ్రాడ్యుయేట్ కోర్సులు

[మార్చు]

పోస్ట్ గ్రాడ్యుయేషను విద్య

[మార్చు]
పోస్ట్ గ్రాడ్యుయేషను విద్య
విషయం డిగ్రీ డిప్లొమా
అనస్థీషియా MD / DNB DA
శరీర నిర్మాణ శాస్త్రం: MS /DNB/MSc(మెడికల్) వర్తించదు
బయోకెమిస్ట్రీ MD/DNB/MSc(మెడికల్) వర్తించదు
కమ్యూనిటీ మెడిసిన్/PSM MD/DNB DCM/DPH
డెర్మటాలజీ MD/DNB DDVL/DVD
డెంటల్ MDS
ENT MS/DNB DLO
కుటుంబ వైద్యం MD/DNB వర్తించదు
ఫోరెన్సిక్ మెడిసిన్ MS/DNB DFM
జనరల్ మెడిసిన్ MD/DNB వర్తించదు
సాధారణ శస్త్రచికిత్స MS/DNB వర్తించదు
మైక్రోబయాలజీ MD/DNB/MSc(మెడికల్) వర్తించదు
న్యూక్లియర్ మెడిసిన్ MD/DNB DRM
ఆర్థోపెడిక్స్ MS/DNB డి ఆర్థో
నేత్ర వైద్యం MS/DNB DO/DOMS
అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ MS/DNB DGO
పాలియేటివ్ మెడిసిన్ MD NA
పాథాలజీ MD/DNB డిసిపి
ఫార్మకాలజీ MD/DNB/MSc(మెడికల్), M.Pharm వర్తించదు
శరీరధర్మశాస్త్రం MD/DNB/MSc(మెడికల్) వర్తించదు
పీడియాట్రిక్స్ MD/DNB DCH
మనోరోగచికిత్స MD/DNB DPM
పల్మోనాలజీ MD/DNB DTCD
రేడియో రోగ నిర్ధారణ MD/DNB DMRD
రేడియోథెరపీ MD/DNB DMRT
ఉష్ణమండల MD DTMH
ఫిజియోథెరపీ MPT

అన్ని ప్రధాన కళాశాలల్లోనూ తమ ప్రోగ్రామ్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులున్నాయి. ఇక్కడ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D మెడికల్) మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS) మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.Sc మెడికల్) లేదా డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB) డిగ్రీలను ప్రదానం చేస్తారు. MD/MS డిగ్రీలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్న విశ్వవిద్యాలయాలు అందిస్తాయి. DNB డిగ్రీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రదానం చేస్తుంది, ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్వతంత్ర స్వయంప్రతిపత్త సంస్థ. వైద్య శాస్త్రం యొక్క వివిధ శాఖల్లో ఈ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. అవి: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, రేడియో డయాగ్నసిస్, రేడియోథెరపీ, ఈఎన్టీ, ప్రసూతి & గైనకాలజీ, నేత్ర వైద్య, అనస్థీషియా, పీడియాట్రిక్స్, కమ్యూనిటీ మెడిసిన్, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ మొదలైనవి. డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాల కాలవ్యవధి కాగా, డిప్లొమా కోర్సులు 2 సంవత్సరాల కాలవ్యవధి కలిగి ఉంటాయి. పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత, విద్యార్థులు DM లేదా DNB (డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్), లేదా MCh లేదా DNB (మాస్టర్ ఆఫ్ చిరుర్జరీ/సర్జరీ) అనే మూడేళ్ల కోర్సులను ఎంచుకుని ద్వారా తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులో మరింత సూపర్-స్పెషలైజేషను చెయ్యవచ్చు.

కార్డియాలజీ, నెఫ్రాలజీ, నియోనాటాలజీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, క్లినికల్ హెమటాలజీ (పాథాలజీ లేదా జనరల్ మెడిసిన్) మినహా న్యూరాలజీ, వగైరాల్లో స్పెషలైజేషను చెయ్యాలంటే MD లేదా DNB (జనరల్ మెడిసిన్ లేదా పీడియాట్రిక్స్) చేసి ఉండాలి. అలాగే, న్యూరోసర్జరీ, యూరాలజీ, కార్డియో-థొరాసిక్ & వాస్కులర్ సర్జరీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ మొదలైన వాటికి MS లేదా DNB (సాధారణ శస్త్రచికిత్స, ENT లేదా ఆర్థోపెడిక్ సర్జరీ) ప్రాథమిక అవసరం.

కుటుంబ వైద్యం ఇప్పుడు భారతదేశంలో ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. అనేక బోధనా ఆసుపత్రులు DNB (ఫ్యామిలీ మెడిసిన్)ను అందిస్తున్నాయి.

డాక్టోరల్, పోస్ట్ డాక్టరేట్

[మార్చు]

న్యూరో-రేడియాలజీ, న్యూరో లేదా కార్డియాక్ అనస్థీషియాలజీ మొదలైన వాటిలో పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.

డాక్టోరల్/ఫెలోషిప్

[మార్చు]

పోస్ట్ డాక్టరేట్

[మార్చు]
  • పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు
  • పోస్ట్-డాక్టోరల్ డిగ్రీ

మేధో వలస

[మార్చు]

1960ల నుండి భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యులను సరఫరా చేసే వనరుగా ఉంటూ ఉంది. [15] 2000 సంవత్సరంలో వేసిన అంచనా ప్రకారం 20,315 మంది వైద్యులు, 22,786 మంది నర్సులు OECD దేశాలలో పని చేస్తున్నారు. [16] 2004 నాటికి ఇంగ్లీషు మాట్లాడే పాశ్చాత్య ప్రపంచంలో (US, UK, ఆస్ట్రేలియా, కెనడా కలిపి) 59,523 మంది భారతీయ సంతతికి చెందిన వైద్యులు పని చేస్తున్నారు. దీంతో వలస వెళ్ళే వైద్యులకు భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద వనరుగా మారింది. [17]

మూలాలు

[మార్చు]

https://neetcounseling.co.in/ Archived 2017-02-20 at the Wayback Machine

  1. "Medical Council of India: Home Page". Archived from the original on 2009-11-03. Retrieved 2022-01-14.
  2. "STATUS OF MEDICAL COLLEGES FOR ADMISSION FOR THE ACADEMIC SESSION 2007–08". mohfw.nic.in. Archived from the original on 1 సెప్టెంబరు 2006. Retrieved 19 March 2018.
  3. "NMC Act: Punishment for quackery enhanced up to one year imprisonment and fine of Rs. 5 lakh says Harsh Vardhan". Business Standard.
  4. Rao, Sujatha (26 June 2013). "Doctors by merit, not privilege". The Hindu. Archived from the original on 11 July 2013.
  5. Medical Council of India (March 2011). Prof S.K. Sarin (ed.). Vision 2015 (PDF). Medical Council of India. Archived from the original (PDF) on 17 July 2013. Retrieved 11 July 2013.
  6. "National Eligibility cum Entrance Test - NEET UG, 2013". Central Board of Secondary Education. Archived from the original on 2018-02-04. Retrieved 2022-01-14.
  7. "National Eligibility cum Entrance Test - NEET UG, 2013 Results". Central Board of Secondary Education.
  8. himanshu (5 June 2013). "CBSE NEET UG 2013 results announced, 3 lakh Students qualified but the irony is that the NEET UG 2013 has been quashed by supreme court bench headed by judje kabir almtas". One India. Archived from the original on 11 July 2013.
  9. himanshu (6 May 2013). "Medical entrance exam NEET UG 2013 held Smoothly". One India. Archived from the original on 11 July 2013.
  10. "NEET PG results out, counselling to follow". The Times of India. TNN. 18 May 2013. Archived from the original on 11 July 2013.
  11. "AIIMS: Admission Guidelines". AIIMS. Retrieved 11 July 2013.
  12. "BHU: ADMISSION PROCEDURES". Banaras Hindu University. Retrieved 11 July 2013.
  13. Bhalla, Sanjeev (10 July 2013). "NRI students into Medical Colleges". Hindustan Times. Archived from the original on 11 July 2013.
  14. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-22. Retrieved 2022-01-14.
  15. Potnuru, Basant (2017). "Aggregate availability of doctors in India: 2014–2030". Indian Journal of Public Health. 61 (3): 182–187. doi:10.4103/ijph.IJPH_143_16. PMID 28928301.
  16. Bhattacharjee, Ayona (2013). "Migration of Indian health professionals to selected European nations: The Case of Denmark, Netherlands, Norway, Sweden" (PDF). CARIM-India Research Report 2013/07. Archived from the original (PDF) on 2019-07-13. Retrieved 2022-01-14. Page 10.
  17. Mullan, Fitzhugh (2005). "The Metrics of the Physician Brain Drain". New England Journal of Medicine. 353 (17): 1810–1818. doi:10.1056/NEJMsa050004. PMID 16251537.