Jump to content

మాడపాటి హనుమంతరావు

వికీపీడియా నుండి
మాడపాటి హనుమంతరావు
మాడపాటి హనుమంతరావు చిత్రపటం
జననంమాడపాటి హనుమంతరావు
జనవరి 22, 1885
కృష్ణా జిల్లా, నందిగామ తాలూకూ, పొక్కునూరు
మరణంనవంబరు 11, 1970
వృత్తిన్యాయవాది
ప్రసిద్ధికవి, రచయిత
పదవి పేరుఆంధ్ర పితామహుడు
మతంహిందూమతం
భార్య / భర్తఅన్నపూర్ణమ్మ
మాణిక్యమ్మ
పిల్లలులక్ష్మిబాయి
సుకుమార్
తండ్రివెంకటప్పయ్య
తల్లివెంకట సుబ్బమ్మ
Notes
ఆంధ్ర పితామహునిగా పేరుగాంచారు.

మాడపాటి హనుమంతరావు (జనవరి 22, 1885 - నవంబరు 11, 1970) ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి, విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు. తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు. అయితే నైజాం ప్రాంతంలో తర్వాతి తరం రాజకీయ నాయకత్వం ఏర్పడడానికి పునాదిగా వీరు చేసిన కృషి సార్థకమైనది. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వీరు 1885 జనవరి 22 (తారణ సంవత్సర మాఖ శుద్ధ షష్ఠి) న కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు. 1904 లో మాడపాటి వారికి తమ చిన మేనమామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. వీరిరువురికి లక్ష్మీబాయి అనే కుమార్తె జన్మించింది. దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మ అకాలమరణం చెందారు. తదనంతరం, 1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు. మాడపాటివారికి, మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు. 1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది. సుచేత, వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు, పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్టవశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు. శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.[1] 1951లో ఆయన హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958లో శాసనమండలి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

రచనారంగం

[మార్చు]

మాడపాటివారు మంచి కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు, ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'. మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త. రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించిన మాడపాటి హనుమంతరావు జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాలేదు. తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన తన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. పాత్రికేయునిగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.

ప్రజాసేవ

[మార్చు]

ఆంధ్రోద్యమం

[మార్చు]

తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభ ను నెలకొల్పారు. రాజకీయ రంగంలో మాడపాటి వారిది మితవాదధోరణి. ఆయన తోటి ప్రజాసేవకులతో పాటు ఆయన గురించి కూడా తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించడం, వాదించడం, నచ్చజెప్పడం వంటివే వారి రాజకీయ పరికరాలని, వారి ప్రజానాయకత్వంలో ఆందోళనలు, ఉద్యమాలు, వ్యతిరేకించడం వంటివి లేవని తర్వాతి తరం నేతలు పేర్కొన్నారు. అయితే కొందరు చరిత్రకారులు వారి పాత్ర గురించి తెలియజేస్తూ తర్వాతి తరం వారు అతివాదులై తీవ్రకృషిచేయడానికి వీరి మితవాద నాయకత్వమే పునాది అని, 1920ల్లో వీరు చేసిన కృషిని తర్వాతి వారు మితవాదమన్నా అప్పటికి అదే అతివాదమని వివరించారు. మాడపాటి హనుమంతరావును భిన్న రాజకీయ దృక్పథాలు, వేర్వేరు సిద్ధాంత ప్రాతిపాదికలు ఉన్నవారు కూడా గౌరవించేవారు. తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన తొలియత్నాలే కారణం కావడమే వారి పట్ల ఆ గౌరవానికి కారణం. ఆయన ఆంధ్రమహాసభకు పెద్దదిక్కువలె వ్యవహరించేవారు. నిజాం ప్రభుత్వ విధానాల కారణంగా తెలంగాణలో తెలుగుభాష దెబ్బతింటున్నప్పుడు ఆయన తెలుగుభాష, తెలుగు సంస్కృతి వికాసానికి ఎనలేని కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు.[2]
ఆంధ్రోద్యమాన్ని ఆరంభ దశ నుంచి ఓ మహోద్యమంగా మలిచేవరకూ సాగిన ఆయన జీవనపథంలో పలువురు తర్వాతి తరం మహానాయకుల్లో రాజకీయ నేతృత్వాన్ని ఆయనే మొదట ప్రోత్సహించారు. ఆంధ్రోద్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించారు. వారి చేతిలో తర్వాతి తరం తెలంగాణా పోరాట నాయకత్వం రూపుదిద్దుకున్నది అన్నా అతిశయోక్తికాదు.[3]


గ్రంథాలయోద్యమం

[మార్చు]

ఆయన గ్రంథాలయోద్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు. ఈ క్రమంలో ఆయన తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హనుమకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే. వీటిలో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా చారిత్రిక ప్రశస్తి పొందింది. గ్రంథాలయాల ద్వారానే చైతన్యాన్ని వ్యాప్తిచేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది.

విద్యారంగం

[మార్చు]

ఆయన ప్రజాసేవ విద్యారంగంలోనూ విస్తరించింది. భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు. బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఈనాటికీ హైదరాబాద్ నగరంలోని నారాయణగూడలో ప్రసిద్ధ పాఠశాల మనుగడలో ఉంది.

రాజకీయరంగం

[మార్చు]

రాజకీయ రంగంలో ప్రత్యక్ష కార్యాచరణ, క్రియాశీల రాజకీయం వంటివి మాడపాటి హనుమంతరావు ప్రముఖంగా చేపట్టలేదు. దీనికి ముఖ్యకారణం ఆయన ప్రజాజీవనంలో ప్రవేశించిన 20వ శతాబ్ది తొలి రెండు దశాబ్దాల నాటి హైదరాబాద్ రాజ్య స్థితిగతులే కారణం. అప్పటి పరిస్థితుల్లో హిందువులు నిర్వహించుకునే ప్రతి సభాసమావేశానికి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ అనుమతుల్లో కూడా రాజకీయాలు చర్చించకూడదన్న షరతు ప్రముఖంగా ఉండేది. అప్పటికి రాజకీయ కార్యకలాపాలపై ఉన్న నిషేధాన్ని ఎదిరించి నిలిచినవారు లేకపోలేదు. కానీ వారంతా అతికొద్ది సమయంలోనే రాజ్యబహిష్కరణ వంటి విధినిషేధాలకు గురయ్యారు. అప్పటి స్థితిగతుల గురించి ఒక్కమాటలో చెప్పాల్సివస్తే ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో రాజకీయాలకు తావుండేది కాదు.

ఈ నేపథ్యంలో మాడపాటి హనుమంతరావు అప్పటి స్థితికి అనుగుణంగా తన ప్రజాసేవా కార్యకలాపాలు మలుచుకున్నారు. అప్పటి ఆయన వ్యహరచన ఇలావుండేది: ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలి. ఈ ప్రణాళిక మొత్తం ఆనాటి స్థితిగతుల మూలంగా ఏర్పడింది. నిజానికి ఈ రాజకీయ కార్యకలాపాలకు తావులేని సాంస్కృతికోద్యమమే తదుపరి కాలంలో తెలంగాణాలో వెల్లువెత్తిన అన్నిరకాల ఉద్యమాలకు ముఖ్యభూమికగా నిలిచింది. ఆంధ్రోద్యమ ప్రభావంలో చదువుకున్న వారే తర్వాత నాయకులై ముందుండి నడిపారు.

మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. కాకుంటే ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు.[3]

విమర్శలు

[మార్చు]

1920ల్లో ఈ వ్యూహం సత్ఫలితాలు ఇచ్చినా తర్వాత దశాబ్దాలు గడుస్తున్నా, స్థితిగతులు మారుతున్నా మాడపాటి అదే మార్గంలో కొనసాగుతుండడంతో ఆయన వైఖరి తర్వాతి తరం నాయకుల విమర్శలకు లోనైంది. ఒకసారి రెడ్డి హాస్టల్ విద్యార్థులు సత్యాగ్రహం చేయగా పోలీసులు వారిని చిత్రహింసల పాలుచేశారు. ఆ సందర్భంలో స్టేట్ కాంగ్రెస్ పక్షాన సత్యాగ్రహం చేయమని మాడపాటి హనముంతరావుతో సహా బూర్గుల రామకృష్ణారావు, ముందుముల నరసింగరావు, కొండా వెంకట రంగారెడ్డి వంటి మితవాద నాయకులను ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆహ్వానించగా, "సత్యాగ్రహాలు చేసి జైళ్ళపాలై సంపాదన పాడుచేసుకోమని, కోర్టుల్లో తాము చేయగలిగిన పని ఏదైనా ఉంటే చెప్పమని" బదులిచ్చినట్టు ఆరుట్ల వ్రాశారు.

వ్యక్తిత్వం

[మార్చు]

మాడపాటి హనుమంతరావు దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత వంటివి కలిగిన వ్యక్తి. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం వల్ల ఆయన అజాతశత్రువుగా నిలిచారు. దేశసేవ చేసే ఉత్సాహంలో ఉద్రేకం పొందకూడదన్నది ఆయన అభిప్రాయం. వృత్తిరీత్యా తనను సంప్రదించవచ్చే క్లయింట్లు, రాజకీయరీత్యా సహచరులు మొదలుకొని అందరితోనూ ఆత్మీయంగా వ్యవహరించేవారు. ఈ లక్షణాలకు తోడు నాటి హైదరాబాద్ రాష్ట్రపు స్థితిగతుల్లోని అజ్ఞానాంధకారాన్ని చైతన్యంతో తొలగించే తొలి ప్రయత్నం చేసినవారు కావడంతో తన జీవితకాలంలో అపరిమితమైన గౌరవాన్ని పొందారు. రాజకీయాల్లో ఆయన మితవాది, అయినా ఆయన రాజకీయాదర్శాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా వారిని ఎంతగానో గౌరవించేవారంటే వారి వ్యక్తిత్వం వెల్లడవుతోంది.[3]

ప్రాచుర్యం

[మార్చు]

తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా మాడపాటి హనుమంతరావు గొప్ప ప్రాచుర్యం, గౌరవం పొందారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కుటీరం పేరిట నిర్మించుకున్న ఆయన ఇంటికి ఆంధ్రోద్యమ కాలంలో నాయకులు, విద్యార్థులు తరచుగా వస్తూండేవారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ పనిమీద వచ్చినప్పుడల్లా విద్యార్థులు, విద్యావంతులు తప్పనిసరిగా గోల్కొండ (ప్రతాపరెడ్డి ఇల్లుకు పెట్టుకున్న పేరు)లో సురవరం ప్రతాపరెడ్డిని, ఆంధ్రకుటీరంలో మాడపాటి వారిని ఒక ఆచారంలా సందర్శించుకునేవారు.[4] ఆ విషయం తెలంగాణ సాయుధ పోరాటం ముందు స్థితిగతులను ప్రతిబింబించేలా వ్రాసిన చారిత్రిక నవల చిల్లర దేవుళ్ళులో ప్రస్తావించబడింది. ఆ నవలలో రచయిత దాశరథి రంగాచార్యులు ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావును ఓ పాత్రగా మలిచి వారితో కథానాయకునికి నైజాంలోని తెలుగు దుస్థితి వివరింపజేస్తారు.[5]

పురస్కారాలు, గౌరవాలు

[మార్చు]

ఆయన తెలంగాణా రాజకీయరంగంలో వహించిన బాధ్యతలను పురస్కరించుకుని ఆంధ్రపితామహుడన్న బిరుదుతో వ్యవహిరిస్తూంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో, భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ బిరుదుతో గౌరవించాయి.

మరణం

[మార్చు]

మాడపాటి 1970, నవంబరు 11న తన 85వ ఏట కన్నుమూశారు.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ.
  2. రావి, నారాయణరెడ్డి. నా జీవితపథంలో.
  3. 3.0 3.1 3.2 గుమ్మన్నగారి, బాలశ్రీనివాసమూర్తి (జూన్ 2014). ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-9383652051.
  4. దాశరథి, కృష్ణమాచార్య. యాత్రాస్మృతి. p. 52.
  5. దాశరథి, రంగాచార్యులు. చిల్లరదేవుళ్ళు. హైదరాబాద్: విశాలాంధ్ర ప్రచురణాలయం.

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: