మిస్సమ్మ (1955 సినిమా)
మిస్సమ్మ (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్వీ ప్రసాద్ |
---|---|
నిర్మాణం | నాగిరెడ్డి, చక్రపాణి |
రచన | చక్రపాణి |
చిత్రానువాదం | చక్రపాణి |
తారాగణం | నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | పింగళి నాగేంద్రరావు |
నిడివి | 181 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మిస్సమ్మ చిత్రం జనవరి 12 1955 న విడుదలైంది. ఇది ఒక అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రం. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని అతి పెద్ద హీరోలుగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించినది మహానటి సావిత్రి. ఇతర ముఖ్యపాత్రలలో ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు.
సావిత్రికి ఈ సినిమాతో చక్కని అభినేత్రిగా మంచి పేరు వచ్చింది. ఆమె ఇక చిత్ర పరిశ్రమలో తిరిగి చూడ లేదు. మిస్సమ్మ చిత్రము యొతిష్ బెనర్జీ అనే బెంగాలి రచయిత యొక్క "మన్మొయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి రచించగా ఎల్వీ ప్రసాదు దర్శకత్వంలో రూపొందిచబడింది.
ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నదగ్గ వాటిలో కొన్ని. ఆయన సాహిత్యమూ, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గార్ల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేసాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికీ తెలుగు వారిని అలరిస్తూ ఉన్నాయి. పి.లీల పాడిన కరుణించు మేరిమాత అనేపాట హృదయాలను తాకుతుంది.
సినిమా చిత్రీకరణ మద్రాసు (ప్రస్తుతం చెన్నై) చుట్టుపక్కల జరిగింది, 1954 డిసెంబరు నాటికల్లా చిత్రీకరణ పూర్తయింది. మిస్సమ్మ సినిమా 1955 జనవరి 12న తొలిసారి ప్రదర్శించారు, ఆపైన మరో రెండు రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు,, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి. 1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని హిందీలోకి మిస్ మేరీగా నిర్మించారు. మిస్ మేరీ ఎల్.వి.ప్రసాద్‌కి బాలీవుడ్‌లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది. 1991లో ముళ్ళపూడి వెంకటరమణ, రావికొండలరావు మిస్సమ్మ సినిమా కాన్సెప్టుని తిరగేసి, అడాప్ట్ చేసుకుని పెళ్ళిపుస్తకం కథ రాస్తే దాన్ని బాపు సినిమాగా తీశాడు, ఇదీ మంచి విజయం సాధించింది.
సినిమా కథ
[మార్చు]ఈ సినిమా కథ నిజానికి ఒక ఫార్సు. అంటే నిజంగా ఎక్కడా జరగడానికి వీలు లేనిది (కనీసం ఆ కాలంలో). అయినా చక్రపాణి కథన సామర్థ్యం ఆ విషయాన్ని అత్యంత సమర్థవంతంగా మరుగున పరచి ఆ లోపాన్ని ఎవరూ పట్టించుకోనీయకుండా చేసింది. చక్రపాణి ఈ సినిమాను "పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమా" అని ప్రచారం చేయించాడు.
యాభైయేళ్ళ కిందట ఒక పెళ్ళి కాని అమ్మాయి సరిగా పరిచయమైనా కాని ఒక పరాయి మగవాడికి భార్యగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం జరిగి ఉండునా? కానీ వాళ్ళిద్దరికీ (ఎమ్టీరావు, మిస్ మేరీ లకు) అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసి పోతుంది. కూటికోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను 'ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని' భయపెట్టి ఎమ్టీరావు తమ వెంట తీసుకెళతాడు.
అక్కడ నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో నడుపుతున్న బడికి సెక్రటరీ గానే గాక అందులోనే మాస్టారుగిరీ వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తానో డిటెక్టివుననే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికొదిలేసి, బర్రెను వెదుకుతూ తనూ గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బళ్ళోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమూ, వాళ్ళచేత ఆయుర్వేద మందులు నూరించడమూ మాత్రమే తెలిసిన వాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యా భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి, మారు పేర్లతో వచ్చిన వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు.
తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ ఏమోననే అనుమానం ఆ 'డిటెక్టివ్' రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు 'కూతురూ-అల్లుడూ' అని వరసలు కలిపేస్తాడు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా ఎమ్టీరావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటిదగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ "బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో" అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు ఎమ్టీరావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది.
అయితే నాయుడి చిన్న కూతురు ఎమ్టీరావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయే సరికి ఎమ్టీరావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు "నువ్వు కాకపోతే మ అల్లుడికి (ఎమ్టీరావుకి) పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం." అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి, మేరీని కలిసి, ఎమ్టీరావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు.ఈ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది.
తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ యేమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒక నాటి అర్ధరాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి, ఆమె పడక మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎమ్టీరావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎమ్టీరావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి సుఖాంతమవుతుంది.
తారాగణం
[మార్చు]- ఎం. టి. రావు గా ఎన్. టి. రామారావు
- మేరీ/ మహాలక్ష్మి గా సావిత్రి
- ఎ. కె. రాజు గా అక్కినేని నాగేశ్వర రావు
- సీత గా జమున
- గోపాలం గా ఎస్. వి. రంగారావు
- ఋష్యేంద్రమణి
- దేవయ్య గా రేలంగి[1]
- డేవిడ్ గా రమణారెడ్డి
- వల్లూరి బాలకృష్ణ
మొదట్లో, మిస్సమ్మ పాత్రకు భానుమతిని నిర్ణయించి కొంత చిత్రాన్ని తీయటంకూడ జరిగినది. కాని, కొన్ని కారణాల వల్ల ఆపివెయ్యటం జరిగినది. తరువాత ఆమె స్థానంలో సావిత్రిని తీసుకొని మిస్సమ్మగా చిత్రం తీసారు.[2] ఈ విషయం హాసం పత్రికలో వ్రాయబడింది.
ఈ చిత్రంలొని గీతాలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే | పింగళి | ఏ.ఎం.రాజా | |
బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే | పింగళి నాగేంద్రరావు | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల, ఏ.ఎం.రాజా |
రావోయి చందమామ మా వింత గాథ వినుమా | పింగళి | ఏ. ఎం. రాజా, పి. లీల | |
బాలనురా మదనా | పింగళి | పి. సుశీల | |
ధర్మం చెయ్ బాబు, కానీ ధర్మం చెయ్ బాబు | పింగళి | రేలంగి | |
ఈ నవనవాభ్యుదయ | పింగళి | ఏ. ఎం. రాజా | |
కరుణించు మేరి మాత | పింగళి | పి. లీల | |
రాగ సుధారస | పింగళి | పి. లీల | |
తెలుసుకొనవె చెల్లి, అలా నడుచుకొనవె చెల్లీ | పింగళి | పి. లీల | |
తెలుసుకొనవె యువతి, అలా నడుచుకొనవె యువతీ | పింగళి | ఏ. ఎం. రాజా |
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెలరాజా, గానం. పి. లీల
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలె, గానం.ఎ.ఎం.రాజా
శ్రీజానకీదేవి సీమంతమలరే మహాలక్ష్మి సుందరవదనారము, గానం.బృందం
సా రి సరిమ నీ నీ స స (సంగీత శిక్షణ) గానం.అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
సీతారాం సీతారాం సీతారాం జై సీతారాం పైన పటారం, గానం.రేలంగి బృందం
ఇతర భాషలలో
[మార్చు]- ఈ చిత్రం తమిళంలో మిస్సియమ్మగా రూపొందినది. ఇందులోనూ సావిత్రే ముఖ్య పాత్ర పోషించింది.
- ఈ చిత్రాన్ని హిందీలో మీనాకుమారి మేరి పాత్ర పోషించగా "మిస్ మేరి"గా నిర్మించారు.
ఇతర వివరాలు
[మార్చు]ఈ చిత్రంలోని ఒక సన్నివేశం స్ఫూర్తితో మీకు మీరే మాకు మేమే సినిమా కథ రూపొందించడంతోపాటు, ఈ సినిమాలోని ఒక పాట మొదటి పదాలను సినిమా పేరుగా పెట్టారు.[3][4]
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
- ↑ "సాక్షి దిన పత్రిక". ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక: 10. మార్చి 28, 2010.
- ↑ ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020.
. 5.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
- 1955 తెలుగు సినిమాలు
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
- ఎన్టీఆర్ సినిమాలు
- సావిత్రి నటించిన సినిమాలు
- రమణారెడ్డి నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- రేలంగి నటించిన సినిమాలు
- ఒకే పేరు కలిగిన తెలుగు సినిమాలు
- హాస్య భరితమైన సినిమాలు
- జమున నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు
- ఋష్యేంద్రమణి నటించిన సినిమాలు