రథసప్తమి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రథ సప్తమి
Ratha Saptami
రథ సప్తమి Ratha Saptami
శరణ్యు, ఛాయ సమేత సూర్య దేవుడు
యితర పేర్లుసూర్య జయంతి, మాఘ సప్తమి
జరుపుకొనేవారుహిందువులు
ప్రారంభంమాఘ శుద్ధ సప్తమి
సంబంధిత పండుగశ్రీ సూర్యనారాయణస్వామి
ఆవృత్తిప్రతియేట

హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.

కాల నిర్ణయం

[మార్చు]

సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత ఆరాధించువారు భారతీయులు.

విధి విధానాలు

[మార్చు]

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.

మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.

వ్రతకథ

[మార్చు]

భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి.[1]

ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.

రథసప్తమీ వ్రతకథ యధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను.

" ఓ కృష్ణా ! రధసప్తమినాడు జేయవలసిన విధివిధానము ననుసరించి, భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి. అట్లు యెవ్వరికైననూ ప్రాప్తించినదా ? " అనాగా, కృష్ణుడిట్లు జవాబిచ్చెను.

కాంభోజదేశమున యశోవర్తియను చక్రవర్తి యుండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరు సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి అట్టి కర్మపరిపాకముయెందు వలన గల్గెనోతెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను. అట్లడిగిన రాజుతో " ఓరాజా! వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించ మిక్కిలి లోభులైయుండిరి. అందుచేత వీరిట్టి రోవములకు గురికావలసిన వారైరి వారి రోగనివారణకు రధసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. అ విధముగా నావ్రతము చూచినంత మాత్రమున దాని మాహాత్మ్యముచేవారి పాపములు పోవును. కాన, వ్యాదితో బాధపడువారిని గొని వచ్చి ఆ వ్రతవైభవము వారికి చూపవలెను. అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు అయ్యా! ఆ వ్రతమెట్లు చేయవలెనో దాని విధివిధానమును తెలుపు" డని ప్రార్ధించెను.

అందులకా బ్రాహ్మణుడు ' ఓరాజా ! ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆరధసప్తమి' అని పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపమూలూ హరించి. చక్రవర్తిత్వము గల్గును. ఆ వ్రతవిధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.

మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిధి దినమున గృహన్తు యీ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలోగాని, చెరువునందు గాని, నూతియందుగాని తెల్లని నువ్వులతో విధివిధానముగా స్నానమాచరించవలెను. ఇలవేలుపులకు , కులదేవతలకు, యిష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షితలతో శుభప్రాప్తికొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి, అతిధులతో సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆదినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆరాత్రి వేదపారగులగు విప్రులను పిలిపించి, సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి, సప్తమి తిధి రోజున నిరాహారుడై, భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము " ఓ జగన్నాధుడా ! నేను చేయబోవు ఈ రథసప్తమీ వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను " అని వుచ్చరించుచు, తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు, తాను, గృహమున నేలపైనా రాతి శయనించి జితేంద్రియుడై ఉండి , ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచియై ఉండవవలెను. ఒక దివ్యమైన సూర్యర్ధాన్ని దివ్యమాలికల్తోను, చిరుగంటలతోను, సర్వోపచారాలతోను తయారు చేసి సర్వాంగములును రత్నాలు, మణులుతో అలంకరించవలెను. బంగారుతోగాని, వెండితోగాని, గుర్రాలను, రధసారధినీ, రధమునూ తయారు చేసి మధ్యాహ్నవేళ స్నానాదికములచు నిర్విర్తించుకొనవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి - ప్రాజ్ఞులు సౌరసూక్తపారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను.

పిమ్మట తననిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రధమును స్థాపించవలెను. కుంకుమతోను, సుగంధద్రవ్యములతోను, పుష్పములతోను పూజించి రధమును పుష్పములతోను, దీపములతోను అలంకరించవలెను. అగరుధూపములుంచవలెను. రధమధ్యముననున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దానిఅవలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రధాన్నీ, రధసారధిని అందుగల సూర్యభగవానునీ పుష్ప, ధూప, గంధ, వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి యీ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను.

ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! భక్తి లేకున్నను, క్రియాశూన్యమయినను, నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము " పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్దించవలెను. ధనహీనుడయినను, విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రధము సారధి, గుర్రములు వివిధరకాల రంగులతో లిఖించిన బొమ్మలు, జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను. ఆరాత్రి జాగరణ చేసి, పురాణ శ్రావణ మంగళగీతాలతో మంగళవాయుధ్యాలతో పుణ్యకదలను వినవలెను. పిమ్మట రడ

బయలెదేరి సూర్య్ని మనస్సున ధ్యానమణేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతఃకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి, వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో, వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును. అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యధాశక్తి దానము నీయవలెను. ఈ రధమును తమ పురోహితులయిన గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆవిధంగా చెసినచో యెందుకు జగత్పతిగాకుండును ? కాన, సర్వయత్నముల చేత రధసప్తమి వ్రతమాచరించవలెను దానివల భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు, బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసికొందురు. ఈ రధసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును, అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి ననుభవించును."

కృష్ణుడు చెప్పుచున్నాడు :

ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వవిషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడుపదేశించినరీతిగా ఆచరించి సమస్తసౌఖ్యముల ననుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కధను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును ఈ విధముగా బంగారుతో చేయబడిన సారధి గుర్రాలతో గూడుకొనిన శ్రేష్ఠరధమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయ్దురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు.

ఇతి రధసప్తమీ వ్రతకధ సంపూర్ణం.

మూలాలు

[మార్చు]
  1. రథ సప్తమి, హిందువుల పండుగలు-పర్వములు, తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004, పేజీలు: 188-192.
"https://te.wikipedia.org/w/index.php?title=రథసప్తమి&oldid=4136597" నుండి వెలికితీశారు