Jump to content

రవీష్ మల్హోత్రా

వికీపీడియా నుండి
ఎయిర్ కమోడోర్

రవీష్ మల్హోత్రా
జననం (1943-12-25) 1943 డిసెంబరు 25 (వయసు 80)
స్థితిRetired
జాతీయతభారతీయుడు
వృత్తిటెస్ట్ పైలట్
పురస్కారాలు కీర్తి చక్ర
సోవియట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఆఫ్ పీపుల్స్
అంతరిక్ష జీవితం
ఇంటర్‌కాస్మోస్ రీసెర్చ్ కాస్మోనాట్
ఎంపిక1982
అంతరిక్ష నౌకలుసోయుజ్ టి-11
Military career
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Air Force
సేవా కాలం1963 నుండి 1994 దాకా
ర్యాంకు ఎయిర్ కమోడోర్
సర్వీసు సంఖ్య7673 F(P)
జీవిత భాగస్వామి (లు)మిరా మల్హోత్రా

రవీష్ మల్హోత్రా (జననం 1943 డిసెంబరు 25, బ్రిటిష్ ఇండియాలోని లాహోర్‌లో) భారత వైమానిక దళంలో విశ్రాంత ఎయిర్ కమోడోర్. అతను బెంగళూరులోని పరీక్షా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్. ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌గా కూడా పనిచేసాడు.

1982లో, అతను సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్‌కాస్మోస్ ప్రోగ్రామ్‌లో అంతరిక్షయానం కోసం శిక్షణ పొందేందుకు ఎంపికయ్యాడు. మల్హోత్రా సోయుజ్ T-11 మిషన్‌లో సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్‌లో రాకేష్ శర్మకు బ్యాకప్‌గా పనిచేశాడు. ఇందులోనే మొదటిసారి ఒక భారతీయుడు (రాకేష్ శర్మ) అంతరిక్షంలోకి వెళ్ళాడు. రవీష్ శిక్షణ పొందాడు గానీ, అంతరిక్షానికి వెళ్లలేదు. మల్హోత్రాకు 1984లో సోవియట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఆఫ్ పీపుల్స్,[1] 1985లో కీర్తి చక్ర లభించాయి.[2]

సోయుజ్ T-11 లో అంతరిక్షానికి వెళ్ళే బృందంలో ఉన్నట్లయితే అతను ధరించి ఉండే ఛాతీ ప్యాచ్

జీవితం తొలినాళ్ళు

[మార్చు]

మల్హోత్రా 1943 డిసెంబరు 25 న బ్రిటిష్ ఇండియాలో పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్‌లో పంజాబీ హిందూ కుటుంబంలో మరో ముగ్గురు తోబుట్టువులతో పాటు జన్మించాడు.[3] అతని తల్లి రాజ్ మల్హోత్రా, తండ్రి SC మల్హోత్రా.[2] స్వాతంత్ర్యం తరువాత అతని కుటుంబం లాహోర్ నుండి ఢిల్లీకి మారింది.[3] వారి కుటుంబం కలకత్తాలో స్థిరపడింది. మల్హోత్రా కలకత్తాలోని సెయింట్ థామస్ స్కూల్లో చదువుకున్నాడు.[4]

కెరీర్

[మార్చు]

గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లో చేరాడు. తన కెరీర్ ఎంపికల గురించి మాట్లాడుతూ, తాను ఇండియన్ నేవీలో చేరాలని కోరుకున్నానని, బదులుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లోకి తీసుకున్నారనీ చెప్పాడు. ఎంపికల సమయంలో, అతని కంటి చూపు నేవీకి సరిపోదని, ఆ సమయంలో వైమానిక దళంలో క్యాడెట్ల కొరత ఉందని చెప్పబడింది.[3][5]

NDA నుండి పట్టభద్రుడయ్యాక మల్హోత్రా, 1963లో అధికారిగా నియమితుడయ్యాడు. డి హావిలాండ్ వాంపైర్‌ను నడుపుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారి వాంపైర్ స్క్వాడ్రన్‌లో నియామకం పొందాడు. ఈ కాలంలో, అతన్ని కలకత్తా సమీపంలోని బరాక్‌పూర్‌లోని IAF స్థావరానికి పంపించారు. అతను డస్సాల్ట్ మిస్టేర్, HAL HF-24 మారుత్, సోవియట్ సుఖోయ్ ఎస్‌యు-22 వంటి ఇతర విమానాలను నడపడంలో అనుభవం సాధించాడు.[3]

బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ముందు ఆ దేశం భారత్‌పై దాడులను ప్రారంభించిన తర్వాత, 1971లో పాకిస్తాన్‌పై వైమానిక దాడులు చేసిన IAF ఫైటర్ స్క్వాడ్రన్‌లో మల్హోత్రా భాగం. అతను సుఖోయ్ ఎస్‌యు-22ని 17 సార్లు పాకిస్తానీ గగనతలంలో నడిపాడు.[3] అప్పటి పశ్చిమ పాకిస్తాన్‌లోని చాంబ్-జౌరియన్ సెక్టార్‌లో జరిగిన ఒక దాడిలో, అతని విమానం భారీ విమాన నిరోధక తుపాకీ కాల్పులను ఎదుర్కొంది. అయితే అతను భారతదేశంలోని తన వైమానిక స్థావరానికి క్షేమంగా తిరిగి వచ్చాడు.[5][6] బంగ్లాదేశ్ విముక్తితో యుద్ధం విజయవంతంగా ముగిసింది.[3][5]

ఇండో-సోవియట్ అంతరిక్ష కార్యక్రమం

[మార్చు]

యుద్ధం తర్వాత మల్హోత్రా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లోని US ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్‌కు ఎంపికయ్యాడు. ఆ తర్వాత భారత సోవియట్ల ఉమ్మడి కార్యక్రమమైన ఇండో-సోవియట్ అంతరిక్ష కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ సమయంలో, అతను బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లోను, తరువాత మాస్కోలోనూ పరీక్షలు తీసుకున్నాడు. చివరి పరీక్షల ఫలితంగా మల్హోత్రా, రాకేష్ శర్మ, మరో ఇద్దరు ఇతర క్యాడెట్‌లు 1982లో సోవియట్ యూనియన్ లోని ఇంటర్‌కాస్మోస్ ప్రోగ్రామ్‌లో అంతరిక్షయానం కోసం శిక్షణ పొందేందుకు ఎంపికయ్యారు.[3]

సోయుజ్ T-11 సిబ్బంది (1984). మల్హోత్రా పై వరుస మధ్యలో ఉన్నాడు.

మల్హోత్రా స్టార్ సిటీలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో రెండేళ్ల పాటు శిక్షణ పొందాడు.[3] ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇతర పరికరాల గుర్తులు చాలా వరకు రష్యన్‌లో ఉన్నందున శిక్షణ కూడా రష్యన్‌లోనే ఉండేది. అంతరిక్ష ప్రయాణానికి సన్నాహకంగా భౌతిక కండిషనింగ్‌తో పాటు, క్యాడెట్‌లు సిమ్యులేటర్‌లపై కూడా పనిచేశారు. అలాగే ఇల్యుషిన్ Il-76 విమానంలో ప్రయాణించారు. ఇందులో, ఒకేసారి సుమారు 50 సెకన్లపాటు, దాదాపు సున్నా గురుత్వాకర్షణ స్థితి, మైక్రోగ్రావిటీ స్థితుల అనుభవం లోకి వచ్చేవి. సోయుజ్ అంతరిక్ష నౌక క్యాప్సూల్స్ సముద్రంలో దిగుతుంది కాబట్టి, సముద్రంలో మనగలగడం, బయటపడడం కూడా శిక్షణలో భాగంగా ఉన్నాయి. శిక్షణా కార్యక్రమం ముగింపులో, మల్హోత్రా, శర్మలు 1984లో అంతరిక్షంలోకి పంపే మొదటి భారతీయుడి ఎంపికలో షార్ట్‌లిస్ట్ అయ్యారు. అంతరిక్షంలో యోగా ప్రభావాలను అధ్యయనం చేయడంతో పాటు ఇతర బయోమెడిసిన్, రిమోట్ సెన్సింగ్ ప్రయోగాలతో సహా బహుళ మిషన్ లక్ష్యాలపై ఇద్దరూ శిక్షణ పొందారు.[5][7][6] శర్మ అంతరిక్షంలోకి వెళ్లాలని, మల్హోత్రా నేలపైనే ఉండాలనే నిర్ణయాన్ని భారతదేశంలోని రక్షణ మంత్రిత్వ శాఖ శిక్షణ కార్యక్రమం మధ్యలోనే తీసుకుంది.[5] నిర్ణయం గురించి తర్వాత మాట్లాడుతూ మల్హోత్రా, "నేను నిరాశకు గురయ్యాను, కానీ దానికి సమాధానపడాల్సిందే, మిషన్‌తో ముందుకు సాగాల్సిందే" అని అన్నాడు. మిషన్ తర్వాత అతను శర్మతో మంచి సంబంధాలు కొనసాగించాడు.[3]

సోవియట్ యూనియన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత [2] మల్హోత్రాకు 1984లో సోవియట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఆఫ్ పీపుల్స్, 1985లో కీర్తి చక్ర లభించాయి.[1]

తర్వాత కెరీర్

[మార్చు]

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను భారత రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితుడయ్యాడు. అతను 1995లో వైమానిక దళం నుండి ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నాడు.[3]

మల్హోత్రా ప్రైవేట్ రంగంలోకి ప్రవేశించి, డైనమాటిక్ ఏరోస్పేస్ అనే ఏరోస్పేస్ తయారీ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ బోయింగ్, ఎయిర్‌బస్, బెల్ హెలికాప్టర్‌ తదితర సంస్థలకు విడిభాగాలను తయారు చేస్తుంది. అతను 75 సంవత్సరాల వయస్సులో కంపెనీ నుండి పదవీ విరమణ చేసాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మల్హోత్రా మనస్తత్వవేత్త అయిన మీరా మల్హోత్రాను వివాహం చేసుకున్నారు.[8][9] ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.[8] 2021 నాటికి అతను బెంగళూరులో నివసిస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Soviets, Indian end nine-day space trip". news.google.com. Eugene Register-Guard. 12 April 1984. Archived from the original on 28 August 2022. Retrieved 2020-05-13.
  2. 2.0 2.1 2.2 "Gallantry Awards | Ministry of Defence, Government of India". gallantryawards.gov.in. Archived from the original on 28 August 2022. Retrieved 2022-08-27.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 Abraham, Rohan. "'Rakesh Sharma or Ravish Malhotra? Only one of us would go up into space'". The Economic Times. Archived from the original on 30 December 2021. Retrieved 2021-12-30.
  4. Abraham, Rohan (2019-07-23). "'Rakesh Sharma or Ravish Malhotra? Only one of us would go up into space'". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2023-12-01.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Dev, Arun (2018-08-31). "Meet Ravish Malhotra, Who Almost Became the 1st Indian in Space". TheQuint (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2021. Retrieved 2021-12-30.
  6. 6.0 6.1 Burgess, Colin (19 November 2015). Interkosmos : the Eastern Bloc's early space program. Springer. ISBN 978-3-319-24163-0. OCLC 932169214. Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
  7. Krishnaswamy, Murali N. (2014-06-09). "Reminiscences of a space odyssey". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 27 August 2022. Retrieved 2022-08-27.
  8. 8.0 8.1 Burgess, Colin; Vis, Bert (2015-11-19). Interkosmos: The Eastern Bloc's Early Space Program (in ఇంగ్లీష్). Springer. ISBN 978-3-319-24163-0. Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
  9. Rau, V. N. Sadasiva; Sreedharan, S. Essays For College Level & Competitive Exam (in ఇంగ్లీష్). Sura Books. ISBN 978-81-7254-090-6. Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.