Jump to content

విశిష్టాద్వైతం

వికీపీడియా నుండి
(శ్రీవైష్ణవం నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Ramanujacharya.jpg
రామానుజాచార్యులు (1017–1137 CE),

విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.

బ్రాహ్మణులు విభాగాలు

[మార్చు]
  • శ్రీవైష్ణవులు - శ్రీవెంకటేశ్వర, విష్ణుమూర్తి ఆలయాల్లో పనిచేసే వారు
  • చాత్తాద శ్రీవైష్ణవులు - శ్రీరామానుజాచార్యులనే ఆద్యులుగా స్వీకరించిన తెంగలై శాఖీయ శ్రీవైష్ణవులు (మాల దాసులు మాదిగ దాసులు సైతం భాగము)
  • శైవులు -శివ, కేశవ ఆలయాల్లో పూజారులు
  • స్మార్తులు - శివ, కేశవ ఆలయాల్లో పూజారులు
  • కరణాలు (నియోగులు) - గ్రామాల్లో రెవెన్యూ పాలనలో ఉన్నవారు

జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.

విశిష్టాద్వైతం వైదిక మతంలోని త్రివిధ విశ్వాసాలలో ఒకటి. మిగిలినవి అద్వైతం, ద్వైతం. విశిష్టాద్వైతం రామానుజుడికి పూర్వం నుంచి ఉంది. ఐతే, రామానుజుడు విశిష్టాద్వైతాన్ని బహుళ వ్యాప్తిలోకి తెచ్చాడు. తిరుమల - తిరుపతి దేవస్థానం 1985లో ప్రచురించిన ‘‘హిందూమత ప్రవేశిక’’ గ్రంథంలో డాక్టర్‌ కె.సేతురామేశ్వర దత్త విశిష్టాద్వైతం గురించి ఇలా వ్రాశారు : ‘‘విశిష్టాద్వైత మతంలో చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు ఈ మువ్వురూ నిత్యులు. చిత్తు, అచిత్తు ఈశ్వరుని ప్రత్యేక గుణాలు (ధర్మాలు). ఈశ్వరునికి - ఈ ప్రకారాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ‘ప్రకారి’ ఆని పేరు. దేని సహాయం వల్ల దాని ఆధారం తెలుస్తుందో దానికి ‘ప్రకారం’ అని పేరు. ప్రకారి లేకుండా ప్రకారం ఉండదు. కాబట్టి చిదచిత్‌ విశిష్టుడైన బ్రహ్మం ఒకడే. ప్రకారం ప్రకారి సహజంగా భిన్నమైనవి. కాబట్టి వాటి స్వభావంలో భేదం ఉంది. అచిత్తు శుద్ధ సత్త్వం, మిశ్రసత్త్వం, సత్త్వశూన్యమని మూడు విధాలు. శుద్ధ సత్త్వం స్వయం ప్రకాశమైనది. దీనికి పరమపదమని పేరు. కాలం సత్త్వ శూన్యం, కాని ఆకాశం వలె నిత్యం. మిశ్ర సత్త్వం సత్త్వ, రజస్‌, తమో గుణాలకు లోనై, ప్రకృతి, మహాత్‌, అహంకారం, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు మొదలైన 24 తత్త్వాలుగా రూపొందుతుంది. జీవుల పురాతన కర్మను అనుసరించి అది జీవుల శరీరం, అహంకారం అవుతుంది. మమకార అజ్ఞానాల చేత దేహధారణ చేసిన జీవుల జనన మరణ పరంపరలకే సంసారమని పేరు. అవిద్య, కర్మల వలయంలో ఉన్న కొందరి పాపాలు వారి పుణ్యాల వల్ల నశిస్తాయి. వారు అప్పుడప్పుడు ముక్తికొరకు ఈశ్వరుని ప్రార్ధిస్తారు. ఈశ్వరానుగ్రహంతో లభించిన గురువు బోధనలతో శాస్త్రాలలోని సమ్యక్‌ జ్ఞానాన్ని పొందుతారు. నిత్య నైమిత్తిక కర్మలను- తమ దశను, స్థితిని అనుసరించి యథావిధిగా ఆచరిస్తూ శమం, దమం, తపస్సు, శౌచం, క్షమ, ఆర్జవం, భయం, అభయం, స్థానం, వివేకం, అహింస, దయ మొదలైన ఆధ్యాత్మిక గుణాలను సంపాదిస్తారు. ఈశ్వరుని శరణు పొంది భక్తి చేత శాస్త్రాన్ని మననం చేసికొంటూ, ఈశ్వర గుణాలను ధ్యానం చేస్తూ ఈశ్వర కృపతో అజ్ఞానాన్ని పోగొట్టుకొంటారు. వారు భక్తి యోగాన్ని అభ్యసించి దేహత్యాగ సమయంలో ప్రపత్తి వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల ముక్తిని పొందుతారు. కైవల్యం, ఈశ్వర ప్రాప్తి అని ముక్తి రెండు విధాలు. కైవల్యం అంటే ఆత్మ సాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానుభవం. పరమ పదంలో ఈశ్వరుని చేరి ఈశ్వర స్వరూపాన్ని, శాశ్వతానందాన్ని అనుభవించడం మరొకవిధమైన ముక్తి. ఈశ్వరుడు పరమ పదంలో ప్రత్యేకమైన దివ్యమంగళ స్వరూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన తన కృపకు పాత్రులైన తన ప్రియురాండ్రు శ్రీదేవి, భూదేవి, నీలాదేవుల తోనూ, నిత్య ముక్తులైన అనంత, గరుడ, విష్వక్సేనాది సూరులతోనూ, ముక్త జీవులతోనూ కలసి ఉంటాడు. ఇతర జీవులను కూడా కర్మవిముక్తులుగా చేసి వారిని తనతో సామ్యం కలవారినిగా చేస్తాడు. విశిష్టాద్వైత మతంలో విష్ణువు లేక నారాయణుడు లేక వాసుదేవుడు లేక వేంకటేశ్వరుడు పరబ్రహ్మ...’’ వావిళ్ళ సంస్థ 1931లో ప్రచురించిన శ్రీభగవద్గీతా మాహాత్మ్యం పీఠికలో శ్రీవావిళ్ళ వేంక టేశ్వరులు విశిష్టాద్వైతాన్ని ఇలా వివరించారు (ఆయన మాటల్లోనే) : ‘‘బ్రహ్మం నామరూప విభాగం చేయ శక్యంగాని సూక్ష్మచిదచిద్విశిష్ట చైతన్య రూపమైయుండి పిదప నామరూపవిభాగం గల స్థూల చిదచిద్విశిష్ట చైతన్యరూప మగుచున్నది. ఇట్లు సూక్ష్మ చిదచిద్వి శిష్టమునకును, స్థూల చిదచిద్వి శిష్టమునకును నైక్యము సిద్ధాంతిత మగుటచే దీనికి విశిష్టాద్వైతం అను పేరు, అన్వర్థ మగుచున్నది... ... శ్రీమన్నారాయణుడే పర తత్త్వం, అతడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, ఆది మధ్యాంతరహితుడు. మాయ అనెడి ప్రకృతిని మూలంగాగొని జగత్తును ఇచ్ఛామాత్రమున సృజించువాడు. ఇట్టి నారాయణుడు తప్ప అన్య దేవతలను వైష్ణవుడారాధింపరాదు.’’

త్రిమతాలు

[మార్చు]

దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఇవన్నీ హిందూమతంలోని తాత్విక భేదాలు సూచించే సిద్ధాంతాలే. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.

వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తర మీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తుల నుండి ఉద్భవించింది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి. పెక్కు అనుయాయులు ఉన్నారు.

రామానుజాచార్యుడు

[మార్చు]

విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు సా.శ. 1017లో జన్మించాడు. 1049లో సన్యాసం స్వీకరించాడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన (సాధించిన) ముఖ్య ఉద్దేశాలు రెండు:

  • మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
  • రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు:

  • సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి వాటిని మానటమో మార్చటమో చేయటం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం.
  • దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
  • మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
  • ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు.

రామానుజాచార్యుడు 1137వ సంవత్సరంలో విష్ణుసాయుజ్యం పొందాడని కథనం. అనగా 120 సంవత్సరాల జీన కాలం. ఈ సంవత్సరంపై కొన్ని సందేహాలున్నాయి.

ప్రధాన సిద్ధాంతం

[మార్చు]

విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు. నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు. నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది. జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం. మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి. భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే.[1].

నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము. చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము. సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి. ప్రకృతి మూలంగానే ఈ జగత్తు అంతా సృజింపబడుతున్నది. శ్రీ మహావిష్ణువు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలు దాల్చుతాడు. వాసుదేవుడు తన భక్తులపట్ల వాత్సల్యంతో ఐదు మూర్తులుగా గోచరిస్తాడు. అవి

  1. అర్చావతారము - దేవాలయాలలోని ప్రతిమలు
  2. విభవావతారములు - రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు.
  3. వ్యూహావతారములు - వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు.
  4. సూక్ష్మావతారము - సంపూర్ణ షడ్గుణ సంపన్న పరబ్రహ్మము.
  5. అంతర్యామి - సకల జీవనాయకుడు.

భగవంతుని అనుగ్రహానికి భక్తి ప్రపత్తులు ముఖ్యం. అందుకు ఉపాసనా విధానాలు.

  1. అభిగమనము
  2. ఉపాదానము
  3. ఇజ్యము
  4. స్వాధ్యాయము
  5. యోగము

ముఖ్య విషయాలు

[మార్చు]

త్రిమతములలో ఒకటి. ఈ మతమునందు చిత్తు, అచిత్తు, ఈశ్వరుఁడు అని పదార్థములు మూఁడు.

  • అందు చిత్తు అనఁగా ఆత్మ. ఆ ఆత్మ జ్ఞానేంద్రియ మనోబుద్ధి విలక్షణమై అజడమై ఆనందరూపమై నిత్యమై అణువై నిరవయమై నిర్వికారమై జ్ఞానాశ్రయమై ఈశ్వరునికి శేషమై ఉండునది. అజడము అనఁగా స్వయంప్రకాశము జ్ఞానాంతరాపేక్ష లేక తనకు తానే ప్రకాశించునది. అణువు అనఁగా అత్యల్ప పరిమాణము కలది. అట్టి పరిమాణము కలిగి ఒక్కచోట ఉన్నను శరీరము నందంతట సుఖదుఃఖానుభవము కలుగుట, దీపము ఒక్కచోటు ఉన్నను దానిప్రభ అంతట వ్యాపించునట్లు వ్యాపించునట్టి జ్ఞానముచే కలుగుచు ఉంది. శేషము అనఁగా లోపడినది. జ్ఞానాశ్రయము అనఁగా జ్ఞానమునకు ఆశ్రయమైనది. ఈజ్ఞానము ధర్మభూతము అని చెప్పఁబడును. ఇది సుషుప్తి మూర్ఛాదులయందు ప్రసరణము లేనందున ప్రకాశింపదు.
  • ఆత్మబద్ధుఁడు, ముక్తుఁడు, నిత్యుఁడు అని మూడుభేదములు కలవాఁడు. బద్ధుఁడు అనఁగా జననమరణాదిరూపసంసారమును అనుభవించెడి మన యాత్మ. ముక్తుఁడు అనఁగా భగవద్భక్తిచే సంసారము వదిలి మోక్షమును పొందిన యాత్మ. నిత్యుఁడు అనఁగా ఒకప్పుడును సంసార సంబంధములేని అనంత గరుడ విష్వక్సేనాదుల యాత్మ. ఈ ముత్తెఱంగులు కల ఆత్మలు ప్రత్యేకములు.
  • అచిత్తు అనఁగా జ్ఞానశూన్యమై వికారాస్పదమై ఉండునది. జలమునకు అగ్ని సంబంధముచేత వేడిమి కలుగునట్లు ఈ బద్ధాత్మకు అచిత్సంబంధముచేత అవిద్యాకర్మవాసనారుచులు కలుగుచు ఉన్నాయి. అవిద్య అనఁగా అహంకార మమకారములు. కర్మము పుణ్యపాపములు. వాసన కర్మములచేత కలిగెడు సంస్కారము. రుచి విషయములయందు ఇచ్ఛ. ఆత్మకు విషయభోగములును తత్సాధన ప్రవృత్తులును అచిత్సంసర్గముచేత కలుగుచు ఉన్నాయి. ఈశ్వరారాధన ప్రవృత్తియు తద్గుణానుభవములును తజ్జన్యపరమానందమును స్వాభావికములు.ఈ అచిత్తు శుద్ధసత్వము, మిశ్రసత్వము, సత్వశూన్యము అని మూఁడు విధములుకలది. అందు రజస్తమస్సులు కలియని కేవల సత్వగుణము కలది శుద్ధసత్వము. అది నిత్యమై జ్ఞానానందప్రకాశమై కేవల భగవదిచ్ఛ చేత గోపుర ప్రాకారాదిరూపముగా పరిణమించి అధోదేశమున ఎల్ల కలిగి ఊర్ధ్వభాగమునందును ప్రక్కలయందును ఎల్ల లేనిదిగా ఉండును. ఇది నిత్యవిభూతి అని పరమపదము అని చెప్పఁబడుచున్నది. మిశ్రసత్వము సత్వాదిగుణములు మూఁడును కలది. ఇది బద్ధుల జ్ఞానానందములచే కప్పుచు విపరీతజ్ఞానమును పుట్టించుచు, నిత్యమై మహదాది వికారముల పుట్టించునదియై ఈశ్వరునకు క్రీడాసాధనముగా ఉంది.
  • మఱియును ఈ అచిత్తు ప్రకృతి అని, అవిద్య అని, మాయ అని చెప్పఁబడుచు ఉంది. ఇది చతుర్వింశతి తత్వమయముగా ఉంది. అందు మొదటి తత్వము ప్రకృతి. దీనికి సత్వరజస్తమస్సులు గుణములు. ఇవి ప్రకృతికి సహజములై ప్రకృతిత్వావస్థయందు అప్రకాశములై కడమ అవస్థలయందు ప్రకాశములై ఉండును. సత్వము జ్ఞానసుఖములను వానియందు ఇచ్ఛను పుట్టించుచున్నది. రజస్సు రాగతృష్ణలయందు సంగమును పుట్టించుచున్నది. తమస్సు విపరీతజ్ఞానమును నిద్రాలస్యాదులను పుట్టించుచున్నది. ఈగుణములు ప్రకృతియందు సమములై ఉండినను ఈశ్వరునకు జగముల సృజియింప వలయునని ఇచ్ఛ కలుగఁగా వైషమ్యము పొందును. ఆవల ఆప్రకృతి నుండి మహత్తు అను తత్వము కలుచుచున్నది. అది సాత్వికము, రాజసము, తామసము అని మూఁడువిధములు కలది. అందుండి వైకారికము, తైజసము, భూతాది అని మూడు అహంకార తత్వములు కలుగుచున్నవి. వైకారికము అను సాత్వికాహంకారమువలన జ్ఞానకర్మేంద్రియములును, అంతరింద్రియమైన మనస్సును పుట్టుచున్నవి. భూతాది అనెడు తామసాహంకారమువలన శబ్దతన్మాత్ర పుట్టుచున్నది. అందుండి ఆకాశమును స్పర్శతన్మాత్రయును పుట్టుచున్నవి. ఆతన్మాత్రనుండి వాయువును రూపతన్మాత్రయు పుట్టుచున్నవి. ఆతన్మాత్రనుండి తేజమును రసతన్మాత్రయు పుట్టుచున్నవి. ఆతన్మాత్రనుండి అప్పును గంధతన్మాత్రయు పుట్టుచున్నవి. అతన్మాత్రనుండి పృథివి పుట్టుచున్నది. తన్మాత్రలు అనఁగా భూతముల సూక్ష్మావస్థలు. తైజసము అనెడి రాజసాహంకారము కడమ రెండు అహంకారములు కార్యముల పుట్టించుచున్నప్పుడు తోడుపడి ఉండును.
  • సత్వశూన్యము కాలము. ఇది ప్రకృతి పరిణామములకు ఎల్లహేతువై క్షణదినాది రూపముగా పరిణమించుచు నిత్యమై ఈశ్వరునకు క్రీడాపరికరమై శరీరభూతమై ఉండును. ఇది సర్వవ్యాపకము.
  • ఈశ్వరుడు నిఖిలహేయ ప్రత్యనీకుడై అనంతుడై జ్ఞానానందైక స్వరూపుఁడై జ్ఞానశక్త్యాదికల్యాణగుణ పరిపూర్ణుడై సకలజగముల సృష్టిస్థితిలయములకు కర్తయై చతుర్విధపురుషార్థప్రదుడై విలక్షణ విగ్రహముక్తుఁడై శ్రీ భూమి నీళానాయకుడై ఉండును. నిఖిలహేయప్రత్యనీకుఁడు అనగా అంధకారమునకు తేజమువలె వికారాది దోషములకు విరోధిగా ఉండువాఁడు. విలక్షణ విగ్రహమూర్తుఁడు అనఁగా అప్రాకృత దివ్యశరీరము కలవాఁడు. ఇతనికి సృష్ట్యాది వ్యాపారములకు ప్రయోజనము కేవలలీల.
  • ఈశ్వరుఁడు విచిత్రరూపముగా పరిణమించునట్టి ప్రకృతిని అధిష్ఠించి ఉండుటఁజేసి జగములకు ఉపాదానకారణము అని చెప్పబడును. అతనికి చిత్తును, అచిత్తును శరీరములు అని వేదములు చెప్పుచున్నవి. మన దేహములను ఆత్మ అధిష్ఠించి ఉండునట్లు, ఈశ్వరుఁడు ఆత్మలను శరీరాదులను అధిష్ఠించి ఉన్నాఁడు. ఆత్మకు ఆత్మ ఐనందున పరమాత్మ అని చెప్పబడుచున్నాడు.
  • ఈమతమునందు (మృత్తు ఘటాదిరూపముగ పరిణమింపఁగా ఆమృద్ఘటములకు నామభేదములు కాక వేరుభేదము లేనియట్లు) ఒక బ్రహ్మమే కార్యకారణాలను అధిష్ఠించి ఉండుటవలన కారణవిశిష్టబ్రహ్మమునకును కార్యవిశిష్ట బ్రహ్మముకును భేదములేదు. ఇదియే విశిష్టాద్వైతము అనఁబడుచున్నది. విశిష్టము అనఁగా కూడినది.
  • ఈశ్వరునకు పరవ్యూహవిభవాంతర్యామ్యర్చలు అని అయిదురూపములు ఉన్నాయి. పరము అన నిత్యవిభూతియందు శుద్ధసత్వమయమై ఉండునట్టి దివ్యమంగళవిగ్రహము. వ్యూహము అన సృష్టిస్థితిసంహారాద్యర్థమై ప్రతిగ్రహించిన సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధ రూపములు. విభవము రామకృష్ణాద్యవతారములు. అంతర్యామి అన జీవులలో ప్రవేశించి ఉండునదియు శుభాశ్రయమైన విగ్రహముతోడ వారికి ధ్యానముచేయతగి వారి హృదయకమలములయందు వాసము చేయునదియును అయిన రూపము. అర్చ అన ఆశ్రితులకు అభిమతములు అయిన ద్రవ్యములయందు మంత్రమూలముగా ఆవిర్భవించి ఉండునట్టి ఉనికి.
  • ఈమతమునందు సర్వపదార్థములును సత్యములు. కలలో కన్న అర్థములు సత్యములు. ఈశ్వరుఁడు ప్రాణుల యదృష్టానురూపముగా అస్థిరములైన పదార్థములను సృజించుచున్నాఁడు అని శ్రుతులు చెప్పుచున్నవి. సర్వజ్ఞానములును యథార్థములు.
  • బద్ధజీవుడు విషయవైరాగ్యాదుల చేత మోక్షేచ్ఛ కలిగి సదాచార్యునివలన వేదాంతార్థములను విని మననము చేసి వర్ణాశ్రమోచిత కర్మజ్ఞానములతో కూడిన నిధిధ్యాసనరూప భగవదుపాసనముచేత సంసారమువదలి అర్చిరాదిమార్గముగా పోయి నిత్యవిభూతికిని లీలావిభూతికిని నడుమను ఉండెడి విరజ అనునదిలో స్నానముచేసి దివ్యశరీరమును పొంది నిత్యవిభూతిని చేరి నిత్యముక్తులతోడ ఈశ్వరుని కల్యాణగుణములను అనుభవించుచు సర్వవిధకైంకర్యములను చేయుచు పునరావృత్తిలేని నిరతిశయానందమును అనుభవించుచున్నాడు.
  • ఇది వైష్ణవ విశిష్ణాద్వైతమత స్వరూపము. శైవమతము సహితము విశిష్టాద్వైతమేను. అందు సర్వము శివపరత్వము అని చెప్పుచున్నది. చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనుటకు బదులుగా పశువు, పాశము, పతి అని చెప్పబడుచున్నది. వైకుంఠమునకు బదులు కైలాసము మోక్షస్థానమై ఉండును.

వివరణ

[మార్చు]

ఆచార్య రామానుజాచార్యుడు చిత్ (జీవులు), అచిత్ (జడము), ఈశ్వరుడు (పురుషోత్తముడు) అను మూడు పదార్ధములను ఒప్పుకొనుచున్నాడు.అనంత సంఖ్యాకులగు జీవులును, ఈజగత్తును కలసి ఈశ్వరుని శరీరము; ఈజీవజగద్యుక్తమగు శరీరమునకు ఈశ్వరుడె ఆత్మ.1.స్థూల సూక్ష్మ చేతనాచేతన, బ్రహ్మముల ఏకత్వము, 2.ద్వైతాద్వైత శ్రుతుల అవిరోధము 3. బ్రహ్మముయొక్క సగుణత్వ సవిశేషత్వ, విభుత్వములు 4. బ్రహ్మముయొక్క నిర్గుణత్వ నిర్విశేషఖంఢనము 5.జీవుని అనుత్వ, బ్రహ్మస్వభావత్వ, దాసత్వములు 6. జీవుని బంధకారణమగు అవిద్య 7. మోక్షోపాయమగు విద్య 8. భక్తియొక్క మోక్షకారణత్వ, శ్రేష్ఠతలు 9. బ్రహ్మైక్యనిరాసన 10. అనిర్వచ్నీయవాదఖంఢనము 11. జగత్తుయొక్క సత్యత్వస్థాపన, 12. జీవజగత్తుల ఈశ్వర శరీరత్వము అను విషయములు ఇందు ఆలోచింపబడినవి.

రామానుజమతమున పదార్ధములన్నియు ప్రమాణ ప్రమేయబేధముల రెండు విధములు.అందు ప్రమాణములు ప్రత్యక్ష, అనుమాన, శబ్దములని విభజింపబడినవి.ప్రమేయము ద్రవ్యద్రవ్యములని రెండు విధములు. ద్రవ్యము జడాజడములని రెండు విధములు. జడము ప్రకృతి కాలమను రెండు విధములు.ప్రకృతి చతుర్వింశతిత్త్వాత్మకము.కాలము భూత, భవిష్యత్, వర్తమాన రూపము.అజడములు ప్రాక్, ప్రత్యక్ అను రెండు రూపములు. ప్రత్యక్ జీవేశ్వర భెధముల ద్విరిధము. జెవులు నిత్య, బద్ధ, ముక్తులని మూడు విధములు. అందు బద్ధులు బుభుక్షు, ముముక్షు వులని రెండు విధములు. బుభుక్షులు అర్ధకామ పరులు, ధర్మకామ పరులని రెండు విధములు. ముముక్షువులు కైవల్య పరులు, మోక్షపరులుగా విభజింపబడుచున్నారు. భక్త, ప్రపన్న లని మోక్షపరులు రెండు తెగలు కలరు. ప్రపన్నలు మరల ఐకాంతికి, పరమైకాంతికిగా భేదముకలదు. పరమైకాంతికులు దృప్తులు, ఆర్యులు.ఈశ్వరుడు పర, వ్యూహ, విభు, అంతర్యామి, అర్చావతారమను ఐదు తెగలుగా విభజించాడు. పరుడు నారాయణుడు. వ్యూహము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధు లని చతుర్విధము, కేశవాదులు తదితర వ్యూహములు.మత్స్యాది, అవతారములు విభవములనబడెను. శ్రీరంగాది ఆలయములలో పూజింపబడు మూర్తివిశేషములు అర్చావతారములు. అద్రవ్యము సత్వ, రజః, తమః, శబ్ద, స్పర్స, రూప, రస, గంధ, సంయోగ, శాక్తులని పది విధములు.

  • ప్రమేయనిరుక్తి : యధావస్థిత వ్యవహారాను గునమగు జ్ఞానమే ప్రమేయమని నిర్వచించాడు. అనగా, అన్యధాజ్ఞాన, విపరీతజ్ఞాన రహితమని భావము.దీనికి సాధనమగునదియే ప్రమాణము. ఈప్రమాణము ప్రత్య్క్ష, అనుమాన, శబ్దములని మూడు విధములు. ప్రత్యక్ష నిర్వికల్ప, సవికల్పములని రెండు విధములు. ఈ రెండును విశిష్ట విషయకములు. నిర్విశేషమగు జ్ఞానము అసంభవము. స్మృతి, ప్రత్యభిజ్ఞ భావాంతర రూపమగు అభావజ్ఞానము, యోగజజ్ఞానము, ప్రత్యక్ష-అంతర్గతములు. భ్రమ, స్వప్నాది జ్ఞానములు కూడా జ్ఞానములే. కనుక, 'సర్వం జ్ఞానం సత్యం సవిశేషవిషయంచ'. ఉపమానము, అర్ధాపత్తులు అనుమానాంతర్గతములు. అపౌరుషేయము నిత్యము అగు వేదవ్యాక్యమే శబ్దప్రమాణము.

శంకర మతమున జ్ఞానము నిరపేక్షము. రామానుజుమతమున అపేక్షికము. అద్వైతుల జ్ఞానము స్వప్రకాశము, నిర్విశేషము. ఈ జ్ఞానము ప్రత్యగాత్మ స్వరూపము. రామానుజుమతమున జ్ఞానము సవిశేష విషయకము, నిర్విశేషవస్తుజ్ఞానము అసంభవము. నిర్విశేషవస్తువే జ్ఞానస్వరూపమని శాంకరమతము.

  • అధికారి- కర్మఫలా నిత్యజ్ఞానమును బడసినవాడే బ్రహ్మ జిజ్ఞాసకు అధికారి. ధర్మానుష్ఠానానంతరము మోక్షేచ్చ. జ్ఞానకర్మలకు కార్యకారణ భావమున్నది. నిష్కామకర్మ వలన చిత్త శుద్ధి లభించును, పిదప జ్ఞానోదయమగును. కర్మజ్ఞానము లేకున్న బ్ర్మహ్మజిజ్ఞాసకు అధికారములేదు. ఈ జ్ఞానము సర్వాశ్రమ ధర్మాపేక్షము. శాంకర మతమున కర్మమీమాంస, బ్రహ్మ మీమాంసలు వేర్వేరు శాస్త్రములు. కర్మ జ్ఞానము లేకున్నను, సాధన చతుష్టయ సంపన్నుడైన, బ్రహ్మజ్ఞానాధికారము. కర్మలు చిత్త సుద్ధి కలిగించి, పారంపర్యముగ మోక్షకారణమగుచున్నవే కాని, సాక్షాత్కారణములు కావు. జ్ఞానమే మోక్షకారణము. ఈ భేదమువలన విశిష్టాద్వైతులు జ్ఞాన-కర్మసముచ్చయవాదులని, అద్వైతులు కేవలజ్ఞానవాదులని చెప్పబడుచున్నారు.
  • విషయము- స్థూల సూక్ష్మ చేతనాచేతన విశిష్టమగు బ్రహ్మమే రామానుజదర్శన విషయము. ఆ బ్రహ్మమే పురుషోత్తముడనబడు నారాయణుడు.ఈ బ్రహ్మము శబ్దగమ్యమని చెప్పబడుటవలన, నిర్విశేషము కాజాలదు.
  • సంబధము- రామానుజుడు శాస్త్రమును ప్రతిపాదకమగును, పురుషోత్తముని ప్రతిపాద్యమగును పేర్కొనుచున్నాడు. కేవలము శాస్త్రప్రమాణము వలననే బ్రహ్మమును మనము గ్రహింప వలెను. బ్రహ్మము సశరీరియా లేక అశరీరియా? ఇటువంటి ప్రశ్నలకి వేదమే ప్రమాణమని నిర్వచించాడు.
  • ప్రయోజనము - అవిద్యా నివృత్తియే ప్రయోజనము అని నిర్వచించాడు. ఉపాసనా బలమున బ్రహ్మ సాక్షాత్కారమైన జీవుని అవిద్య తొలగును. ముక్తుడు, ఈశ్వరదాసత్వరూపమున వెలయుచు, అపారమగు లీలానందమున ఆస్వాదించును.

పై నాలుగింటిని అనుబంధ చతుష్టయములుగా నిర్వచించెను.

  • బ్రహ్మము- ఏవంగుణ విశిష్టుడగు ఈశ్వరునికి అద్వైతవాదమున చోటున్నది కాని, ఈయన పర బ్రహ్మకాదు. ఈ గుణములలో కొన్నింటిని వారు, బ్రహ్మముయొక్క తటస్థలక్షణముగ అంగీకరించారు. పర- బ్రహ్మమును ఆశ్రయించి పెంపొందిన వివర్తము. అద్వైతులకు ఈశ్వరుడుకూడా మాయాంతర్గతుడు, జీవుల వలే బద్ధుడు కాడు, మాయాధీశుడు. నిర్గుణ బ్రహ్మము యొక్క ప్రతిబింబము.పారమార్ధిక దశయందు, శాస్త్రమువలే, ఈయన ఉనికి కూడా విలోపమందును.
  • ఈశ్వరుడు-పరుడు - రామానుజుని ఈశ్వరుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, ఆర్చాభెదముల పమచ విధముల వెలయుచున్నాడు. శంఖ, చక్ర, గదా, పద్మధారి- చతుర్భుజుడు, కిరీటాదిభూషణ భూషితుడై, వైకుంఠవాసియగు నారాయణుడే ఈశ్వరుడు, పరుడు.
  • వ్యూహము - ఈయనయే సృష్ట్యాది నిమిత్తము వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను వ్యూహరూపమున వెలయుచున్నాడు. వాసుదేవుడు షడ్గుణ పరిపూర్ణుడు. సంకర్షుణుడు జ్ఞానబలయుక్తుడు. ప్రద్యుమ్నుడు ఐశ్వర్య వీర్యయతుడు. అనిరుద్ధుడు వీర్య, శక్తి యుక్తుడు.
  • జీవుడు - జీవుడు బ్రహ్మముయొక్క శరీరము. కాని అణుపరిమాణ యుక్తుడు. బ్రహ్మము, జీవులకు సజాతీయ, విజాతీయ భేదములు లేవు, స్వగత భెదమున్నది. జీవులు బద్ధ, ముక్త, నిత్యులని మూడు విధములుగ చెప్పబడుచున్నారు. సంసార నివృత్తిని పొదనివారు బద్ధులు, దేవ, మనుష్య, తిర్యక్, స్థావరములుగాగల జీవులదరు బద్ధులే.
  • సాధన - ధ్యానము, ఉపాసనలను ముక్తిసాధనాలుగ గ్రహించాడు. భక్తియే మోక్షోపాయము, జ్ఞానము కాదు. బంధము పారమార్ధికమగుట వలన, పరమమపురుషుని ప్రసాదమువలననే తొలగును. వేదనా, ధ్యాస ఉపాసనాశబ్దవాచ్యమగు నదియే భక్తియగును, దాని స్వరూపము తైలధారనుబోలు ధ్రువానుస్మృతి. ఇయ్యది, ఆశ్రయాది త్రివిధ దోషరహితమైన ఆహార శుద్ధ్యాదులవలన విశిద్ధతను పొందినవాని పక్షమున ప్రత్యక్షమూ పరణమించును.
  • ప్రపత్తి - ప్రతికూల విర్జనమును, అనుకూల సంకల్పపూర్వకమును, సర్వతోభావమును నగు ఆత్మసమర్పణయే ప్రపత్తి అనబడు న్యాసవిద్య.
  • ఉత్క్రాంతి-ముక్తి - ప్రాకృత దేహము తొలగి, అప్రాకృత దేహమున వైకుంఠమున కరిగి సమానభోగమును, బ్రహ్మామును, నారాయణుని ఆశ్రయించుటయే ముక్తి.ముక్తికి అర్హుడగు జీవుడు సుక్ర్తములను హితులకును, దుష్కృతములను శత్రువులకును, సంపదను దాయాదులకును వదలి వాక్కును మనస్సునను, మనస్సును హృదయమున నిలిపి, ముక్తిద్వారమగు సుషుమ్నానాడి యందు ప్రవేశించి, బ్రహ్మరంధ్రద్వారమున నిర్గతుడగును. పిదప సూర్య కిరణములను ఆశ్రయించి దిన, పక్ష, ఉత్తరాయణ, సంవత్సరాభిమానులగు దేవతల మార్గమున సత్కరింపబడి, సూర్యమండలమును భెదించుకొని కరుగును. అట, చంద్ర, విద్యుత్, వరుణ, ఇంద్ర, ప్రజాపతులను ఆతివాహిక -ప్రధప్రదర్శకుల సాయమును బడసి క్రమముగ విరజానాదిని చేరుకొనును. అట, సూక్ష్మ శరీరమును పరిత్యజించి దివ్య దేహమును బడసి ఇంద్ర ప్రజాపతులను ద్వారపాలకుల ఆదేశమున వైకుంఠమును ప్రవేశించి ఐరమ్మదమను సరోవరమును, సోమసవనమను అశ్శ్వత్థ వృక్షమును గాంచి అప్సరసలచే అభినందితుడగును. పిదప అనంత, గరుడ, విష్వక్సేనులకును, అచార్యులకును ప్రణమిల్లి భగవత్పర్యంక సమీపమునకు పోవును. ఆ పర్యంకమున ధర్మ పీఠమున, ఆసీనుడైయున్న నారాయణుడికి దాస్యానంద అనుభవమును పొందును. ఈ నిర్గమనమును ఉత్క్రాంతి లేదా గతి అనబడును.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. శ్రీ కైవల్య సారథి విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)

బయటి లింకులు

[మార్చు]