Jump to content

సుబ్రహ్మణ్య భారతి

వికీపీడియా నుండి
చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి
జననం
సుబ్రహ్మణ్యన్

(1882-12-11)1882 డిసెంబరు 11
ఎట్టయపురం,
తూత్తుకుడి జిల్లా ,
భారతదేశం
మరణం1921 సెప్టెంబరు 12(1921-09-12) (వయసు 38)
మరణ కారణంసహజ మరణం
స్మారక చిహ్నంNo monuments
జాతీయతIndian
ఇతర పేర్లుభారతీయార్, సుబ్బయ్య, శక్తి దశన్, మహాకవి, ముందసు కవిగ్నర్
వృత్తిజర్నలిస్టు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్యోద్యమం, కవి, సంఘసంస్కర్త
గుర్తించదగిన సేవలు
పాంచాలి సప్తాహం, పప్పా పట్టు, కన్నన్‌ పట్టు, కుయిల్ పట్టు మొదలైనవి.
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం
జీవిత భాగస్వామిచెల్లమ్మ (m. 1896-1921; till his death)
పిల్లలుతంగమ్మల్ భారతి (b. 1904), శకుంతల భారతి (b. 1908)
తల్లిదండ్రులుచిన్నస్వామి సుబ్రహ్మణ్య అయ్యర్, లక్ష్మీ అమ్మల్
సంతకం

'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' (1882 డిసెంబరు 111921 సెప్టెంబరు 12) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. అతను అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి.[1]

అప్పటి తిరునల్వేలి జిల్లా(ప్రస్తుతం తూత్తుకుడిలో ఉంది)లోని ఎట్టాయపురంలో 1882లో జన్మించారు. అతను తొలుత  తిరునల్వేలిలోనూ, తర్వాత వారణాసిలోనూ విద్యాభ్యాసం చేసి, పాత్రికేయ రంగంలో  స్వదేశమిత్రన్,  ఇండియా  వంటి పలు పత్రికలకు  పనిచేశారు. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యునిగా జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. 1908లో భారతి విప్లవాత్మక కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీచేసింది, ఈ స్థితిగతులు అతను పాండిచ్చేరికి వలసపోయి జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరిచాయి. అతను అక్కడే 1918 వరకూ జీవించారు. భారతి రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగివున్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు.

జీవిత చరిత్ర

[మార్చు]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

భారతి చిన్నసామి సుబ్రహ్మణ్య అయ్యర్, లక్ష్మీ అమ్మాళ్ దంపతులకు సుబ్బయ్యగా 11 డిసెంబర్ 1882లో ఎట్టయపురం గ్రామంలో జన్మించారు.  తిరునల్వేలిలోని ఎం.డి.టి. హిందూ కళాశాల అన్న స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అత్యంత యుక్త వయసు నుంచి సంగీతం అభ్యసించడం ప్రారంభించారు, పదకొండవ యేటనే కవితలల్లడం నేర్చారు. విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి పేరిట "భారతి" అన్న బిరుదాన్ని ఆ సమయంలోనే అతను పొందారు. ఐదవ యేట తల్లిని, పదహారవ యేట తండ్రిని భారతి కోల్పోయారు. పద్నాలుగేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసున్న చెల్లమ్మతో వివాహమైంది. అతను తండ్రి అతను ఆంగ్ల విద్య అభ్యసించి, గణితంలో ప్రతిభ కనపరిచి, ఇంజనీర్ కావాలని ఆశించారు.[2][3] విశేషమైన పట్టుదల, కృషితో అతను 32 భాషలు (29 భారతీయ భాషలు, 3 విదేశీ భాషలు) నేర్చుకున్నారు.

భారతి చేతిరాత

వారణాసిలో నివసించినప్పుడు, భారతీయ తాత్త్వికత, జాతీయతల గురించి లోతుగా తెలుసుకున్నారు.  ఇది  అతను  దృక్పథాన్ని  విస్తృతం చేసింది, అతను సంస్కృతం,  హిందీఆంగ్ల  భాషలను  నేర్చుకున్నారు.  దీనితో పాటుగా అతను కట్టుబొట్టు మార్చుకున్నారు. తలపాగా చుట్టుకుని, గడ్డం పెంచుకుని, కోటు చొక్కా, పంచె కట్టుకోవడం ప్రారంభించారు. ఉద్యోగానికి అర్హత పరీక్షలో ప్రవేశ స్థాయిలో ఉత్తీర్ణుడైనా,1901లో ఎట్టాయపురం తిరిగి వచ్చి, ఎట్టాయపురం రాజా వద్ద ఆస్థాన కవిగా రెండు, మూడు సంవత్సరాలు పనిచేశారు.  1904లో ఆగస్టు నుంచి  నవంబరు వరకూ మదురైలో సేతుపతి  హైస్కూల్లో ఉద్యోగం  చేశారు.[3] ఈ కాలంలోనే బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందనేది అర్థం చేసుకుని పశ్చిమాన సాగుతున్న పాత్రికేయరంగ మార్పుల గురించి ఆసక్తి కనబరిచేవారు. భారతి 1904లో స్వదేశమిత్రన్ దిన పత్రికకు సహాయ సంపాదకునిగా చేరారు. 1905 డిసెంబరులో అతను కాశీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. స్వగ్రామానికి తిరిగివచ్చేప్పుడు దారిలో స్వామి వివేకానందుని ఆధ్యాత్మిక వారసురాలైన సోదరి నివేదితను కలిశారు. ఆమె భారతి స్త్రీల స్థితి, స్త్రీ విముక్తి అవసరాన్ని గుర్తించేలా ప్రభావితం చేశారు. అతను శక్తి స్వరూపిణి, మగవారితో కలిసి కొత్త ప్రపంచాన్ని నిర్మించేందుకు సహకారాన్ని అందించే సరిజోడైన నూతన మహిళను భవిష్య కాలానికి దర్శించారు. అలానే నివేదిత తనకు భారతమాత స్వరూపాన్ని చూపించారని భారతి పేర్కొన్నారు. సోదరి నివేదితను తన గురువుగా భావిస్తూ, ఆమెను ప్రస్తుతిస్తూ కృతులు రచించారు. దాదాభాయ్ నౌరోజీ నేతృత్వంలో సాగిన భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశం స్వరాజ్యాన్ని కాంక్షించి, బ్రిటీష్ వస్తువుల బహిష్కరణ కోరింది.[3]

1907 ఏప్రిల్ నాటికల్లా అతను తమిళ వారపత్రిక ఇండియా, ఆంగ్ల వార్తాపత్రిక బాల భారతంలకు ఎం.పి.టి.ఆచార్యతో కలిసి సంపాదకత్వం వహించసాగారు. ఈ కాలానికల్లా శిఖరాగ్రాన్ని అందుకున్న భారతి సృజనాత్మకతను వ్యక్తీకరించే సాధనాలుగా ఈ పత్రికలు ఉపకరించాయి. భారతి ఈ పత్రికల సంచికల్లో కవితలు ప్రచురిస్తూ వచ్చారు. కవితలు, పద్యాల నుంచి జాతీయవాద రచనల వరకూ, మనిషికీ, దైవానికి మధ్య ఉన్న సంబంధంపై చింతన నుంచి రష్యన్, ఫ్రెంచి విప్లవాలపై గీతాల వరకూ భారతి ఎంచుకున్న వస్తువులు ఎంతో భిన్నత్వం కలిగివుండేవి.[2]

భారతి 1907లో చారిత్రాత్మకమైన సూరత్ కాంగ్రెస్ లో వి.ఓ.చిదంబరం, మందయం శ్రీనివాచార్యర్ లతో పాటుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ లో అతివాదులైన తిలక్, అరబిందోలకు, మితవాదులతో కల విభజనలు తీవ్రతరం, సుస్పష్టం అయ్యాయి. కంచి వరదాచార్యర్, వి.ఓ.చిదంబరంలతో కలిసి సుబ్రహ్మణ్య భారతి తిలక్, అరబిందో పక్షాన్ని సమర్థించారు. తిలక్ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ సంఘర్షణ చేయడాన్ని బహిరంగంగా సమర్థించారు.[3]

1909 నాటి విజయ పత్రిక ముఖ పత్రం, మొదట్లో మద్రాసు నుంచి తర్వాత పాండిచ్చేరీ నుంచి ప్రచురితయ్యేది.

1908లో వి.ఓ.చిదంబరం పిళ్ళైకు వ్యతిరేకంగా బ్రిటీష్ వారు పెట్టిన కేసులో అతను సాక్ష్యం ఇచ్చారు. ఇదే సంవత్సరం ఇండియా పత్రిక అధినేతను మద్రాసులో అరెస్టు చేశారు. తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నందున భారతి ఫ్రెంచి పాలనలో ఉన్న పాండిచ్చేరికి తప్పించుకున్నారు.[4] పాండిచ్చేరి నుంచి అతను వారపత్రికలైన ఇండియా, తమిళ దినపత్రిక విజయ, ఆంగ్ల మాసపత్రిక బాల భారత, పాండిచ్చేరీ స్థానిక పత్రిక సూర్యోతయంలకు సంపాదకత్వం వహించి ప్రచురించారు. పత్రికలకు చందాలు, చెల్లింపులు, ఉత్తరాలు నిలిపివేయడం ద్వారా భారతి వెలువరించే పత్రికలను అణచివేయాలని బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇండియా, విజయ పత్రికలు రెంటినీ 1909లో బ్రిటీష్ ఇండియాలో నిషేధించారు.[3]

ప్రవాసంలో ఉండగా భారతికి అరబిందో, లజపత్ రాయ్, వి.వి.ఎస్. అయ్యర్ వంటి ఫ్రెంచ్ ఆశ్రయం పొందుతున్న ఇతర విప్లవ పక్ష నాయకుల్ని కలుసుకునే అవకాశం లభించింది. మొదట్లో ఆర్య జర్నల్, తర్వాత కర్మ యోగి పత్రికలను వెలువరించడంలో అరబిందోకు భారతి సహాయం అందించారు.[2] ఈ కాలంలోనే అతను వేద సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. అతను తన అత్యంత గొప్ప కృతుల్లో మూడు - కుయిల్ పాట్టు, పంచాలీ శబదం, కణ్ణన్ పాట్టులను ఈ దశలోనే రాశారు. వేద మంత్రాలను, పతంజలి యోగ సూత్రాలను, భగవద్గీతను తమిళంలోకి అనువదించారు.[3] కడలూర్ సమీపంలో బ్రిటీష్ ఇండియాలోకి 1918లో ప్రవేశించారు. వెనువెంటనే అతనును అరెస్టు చేశారు. కడలూరు కేంద్ర కారాగారంలో మూడు వారాల కస్టడీలో 20 నవంబరు నుంచి 14 డిసెంబరు వరకూ గడిపారు, అనీబిసెంట్, సి.పి.రామస్వామి అయ్యర్ కల్పించుకున్నాకా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దశలోనే అతను పేదరికంతో బాధపడుతూ అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత సంవత్సరంలో 1919న భారతి గాంధీని కలిశారు. 1920 సంవత్సరంలో స్వదేశమిత్రన్ పత్రికకు మద్రాసులో సంపాదకత్వం వహించసాగారు.[5]

చివరి కాలం, మరణం

[మార్చు]
ఎట్టయపురంలో భారతి జన్మించిన వారి పూర్వుల గృహం తమిళనాడు ప్రభుత్వం వారు తిరిగి పునరుద్ధరించి, ప్రజల సందర్శనార్థం తెరుస్తున్నారు.

ఖైదు నిర్బంధాల వల్ల అతను ఆరోగ్యం చెడిపోయింది. చివరకు 1920 నాటికి జనరల్ అమ్నెస్టీ భారతి కదలికలపై నియంత్రణను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీచేసినా అప్పటికే అతను ఆరోగ్యానికి హాని జరిగిపోయింది.  అతను  రోజూ ట్రిప్లికేన్  లోని  పార్థసారథి  ఆలయానికి  వెళ్ళి  అక్కడున్న  లావణ్య అన్న ఏనుగుకు  ఆహారం పెట్టేవారు.  ఒకరోజు  అలానే  ఆహారం  అందిస్తుండగా అనుకోని విధంగా ఏనుగు అతను  శరీరాన్ని  తొండంతో  ఎత్తి  పడేసింది. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడినా, ఆ గాయాలు, అనారోగ్యం కలిపి విషమించడంతో 1921 సెప్టెంబరు 12లో అర్థరాత్రి ఒంటిగంటకు అతను మరణించారు. భారతి ప్రజల కవిగా, గొప్ప జాతీయవాదిగా, సామాజిక దార్శినికునిగా పేరొందినా అతను అంత్యక్రియలకు కేవలం 12మందే హాజరయ్యారు. ఈరోడ్ లోని కరుంగళ్ పాళయం గ్రంథాలయంలో మానవుడు అమరుడన్న అంశంపై తన చివరి ప్రసంగాన్ని చేశారు.[6] చెన్నైలోని ట్రిప్లికేన్లో అతను నివాసంలోనే అతను ఆఖరి సంవత్సరాలు గడిపారు. ఆ ఇంటిని తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసి 1993లో పునరుద్ధరించి, భారతి ఇల్లం (భారతి ఇల్లు) అన్న పేరుతో స్మారక చిహ్నంగా మలిచింది.

రచనలు

[మార్చు]

ఆధునిక తమిళ సాహిత్యంలో మార్గదర్శకునిగా భారతిని భావిస్తూంటారు.[7] అంతకు మునుపు శతాబ్దిలోని తమిళ సాహిత్య పోకడలకు భిన్నంగా సామాన్యమైన పదాలు, ప్రాసలతో భారతి రచనలు చేశారు. భక్తి రచనల్లో కొత్త పోకడలు, ఆలోచనలు, శైలీ శిల్పాలను అనుసరించారు.[1] నొంది చిందు అనే ఛందస్సును అతను అనేక రచనల్లో ఉపయోగించారు, దీన్ని అంతకుముందు గోపాలకృష్ణ భారతియార్ వాడేవారు.[8]

భారతి కవిత్వంలో ప్రగతిశీలమైనన, సంస్కరణాత్మకమైన ఆదర్శాన్ని వ్యక్తీకరించారు. అనేక విధాలుగా ఆధునిక తమిళ సాహిత్యంలోకెల్లా అతను ఆలోచన, ఊహ, పద్యంలోని పటుత్వం కొత్తపుంతలు తొక్కాయి. ప్రాచీన, సమకాలీన అంశాల మేలుకలయికగా నిలిచే కవిత్వ శైలిలో భారతి అగ్రగామి. వేలాది కవితలను-భారత జాతీయ గీతాలు, ప్రణయ గీతాలు, బాలల కవితలు, ప్రకృతి గీతాలు, తమిళ భాష గొప్పతనాన్ని ఉగ్గడించే కవితలు, భారత స్వాతంత్ర్య పోరాట ప్రముఖులైన తిలక్, గాంధీ, లజపతిరాయ్ వంటివారిని ప్రస్తుతించే కవితలు వంటి విస్తారమైన, విభిన్నమైన అంశాలను స్వీకరించి అద్భుతమైన రీతిలో రాశారు. కొత్తగా ప్రాదుర్భవించిన రష్యా, బెల్జియంలపై కూడా పాటలు రాశారు. అతను రచనల్లో హిందూ దేవతలైన శక్తి, కాళి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు, కృష్ణుడు వంటివారినే కాక ఇతర మతదేవతలైన అల్లా, ఏసు వంటివారిని కూడా ప్రస్తుతించారు. లోతైన అతను ఉపమానాలను కోట్లాది తమిళ పాఠకులు చదువుకుని ఆనందించారు. అతనుకు అనేక భాషల్లో లోతైన ప్రవేశం ఉండడంతో, భారత జాతీయ, సంస్కరణ నాయకులైన అరబిందో, బాలగంగాధర తిలక్, స్వామి వివేకానంద వంటివారి ప్రసంగాలను అనువదించారు.[5]


భారతి రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగివున్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు.

తమిళం
பட்டினில் உடையும் பஞ்சினில் ஆடையும்
பண்ணி மலைகளென வீதி குவிப்போம்
கட்டித் திரவியங்கள் கொண்டு வருவார்
காசினி வணிகருக்கு அவை கொடுப்போம்

[తెలుగు అనువాదం]
పట్టు, పత్తిలతో మనం బట్టలు నేశాం
పర్వతాలంత పెద్ద రాశిలో నేశాం
అవి మనకు సంపద తెచ్చిపెట్టాయి
మనం వాటిని ఇవ్వడానికి ప్రపంచమంతటా వ్యాపారులు ఉండేవారు

"భారతీయులు విభజితమై ఉన్నా వారు ఒకే తల్లి పిల్లలు, విదేశీయులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది?" అని అతను అన్నారని ప్రసిద్ధి. కులాలు లేని నూతన, స్వేచ్ఛా భారతం గురించి 1910-1920 కాలంలో రాశారు. అతను భారతదేశానికి రక్షణ వ్యవస్థ నిర్మించుకోవడం, భారతదేశపు ఓడలు మహాసముద్రాల్లో ప్రయాణించడం, నిర్మాణ రంగంలోనూ, అందరికీ విద్య అందించడంలోనూ దేశం విజయం సాధించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే పద్ధతి పెరగాలని పిలుపునిచ్చారు, బెంగాల్ డెల్టాలోని మిగులు జలాలను అవసరమైన ప్రాంతాలకు పంపిణీ చేయడం గురించి అద్భుతమైన ఊహలు చేశారు. శ్రీలంకకు వారధి కట్టాలన్నారు.

భారతి ఆకలి బాధను నిర్మూలించాలని కూడా ఆశించారు. తని మనితనక్కు ఉనవు ఇల్లయెనిల్ ఎ జగత్తినల్ అళితిదువోం అన్న కవితను ఒక్క మనిషి తిండిలేక ఆకలితో బాధపడ్డా మనం (తమిళులు) ప్రపంచాన్ని నాశనం చేసినట్టే అని అనువదించవచ్చు.

మహ్హకవి భారతి దృష్టిలో తెలుగు సుందరమైన భాష; గానామకూల మయిన భాష. ఈ క్రింది గీతములో అతనుే అదే చెప్పారు.

విరియ గాచిన వెన్నెల రాత్రిలో
చేరదేశపు చెలులు వెంట రా
సుందరాంధ్ర పదమ్ము పాడుచున్
సింధునదిని పడవనడుపుచు నాడుదాం---

ఎక్కడి చేరదేశము! ఎక్కడి సింధునది! కన్యాకుమారినుండి కాశ్మీరము వరకును గల అఖండభారతము తనమాతృదేశమని భారతి విశ్వసించెను.అతను దృష్టిలో అతను తొలుత భారతీయుడు; ఆవల తమిళుడు. తేనెసోనలు జాలువారు తెలుగు పదమును పాడుచు సింధునదిలో నౌకా విహారము చేయువలెనట! ఎంత తీయని కల్పన మిది! ఇది భారతి అమృత హృదయమును ప్రవ్యక్త మొనర్చుచున్నది.

వానలేకున్న జీవిత వైభవమ్ము
మాసి పోజాలదే, పెక్కు మాటలేల?
మమత గొల్పెడి స్వాతంత్ర్య మమర కున్న
దేని కీ జన్మ దీనులమైన మనకు?

తిరువళ్ళువర్ తమిళ వేదకర్త! ఆ మహనీయునియందు భారతికి అపారమగుభక్తి. వానలేకున్న జీవిత వైభవము మాసిపోదనియు, అటులనే జన్మహక్కు అయిన స్వాతంత్ర్యము లేని మానవుడు దీనుడనియు ఆతని జీవితము వ్యర్ధమనియు భారతి తెలుపుచున్నాడు.

భార్తిని కొందరు విప్లవకవిగా వర్ణింతురు; మరికొదరు గేయకవిగా అభివర్ణింతురు. కానీ సూక్షముగా పరిశీలించినచో, అతను రచనలలో ప్రధానముగా కానవచ్చుచున్నది భక్తితత్వమని స్ఫురించును. పరాశాక్తి గూర్చియు, కృష్ణుని (కణ్ణన్) గూర్చియు అతను సంతరించిన గేయము లిందుకు తార్కాణములు. దేశాభక్తితో పాటు, దైవభక్తి కూడా అలవరించుకోవలెనని భారతి పెక్కు గీతములలో పేర్కొనెను. జ్ఞానపధ మను వచన రచనలో అతను తాత్వికభావము లెట్టివో మనము గ్రహింపవచ్చును.

తిరునల్వేలి మండలము లోని ఎట్టయాపురమున జన్మించిన భారతి తెలుగును పొగడుటలో ఆశ్చర్యములేదు.తెలుగు భాషా పోషకులు ఎట్టయాపుర సంస్థానాధీశులు! వారు హూణాంధ్ర ద్రవిడ భాషా విశారదులు. కవిత్రయమువారి మహాభారతమును తమిళమున చేయించి ముద్రించిన సహృదయులు వారు.

1917 సం. జూను మొదటి తేదీన నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభను గురుంచి శక్తి దాసన్ అను మారుపేరున భారతి తమిళమున ప్రశస్తమగు వ్యాసమును వ్రాసెను.అందులో తెలుగువారి న్యాయ పరిపాలనమును కొనియాడెను.

చంద్రిక అను కథలో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారిని భారతి ప్రస్తుతించెను. అటులనే పోతన కవివరేణ్యుని సిల కవియరశర్ అను వ్యాసమున ప్రశంసించెను. ఈ వ్యాసమును భారతి కాళిదాసన్ అను మారుపేరున 1916 సం. జూలై 10 న వ్రాసెను. అందులో పోతన్నతో పాటు తమిళ సాహిత్యమున మణిదీపక వెలిగించిన మహనీయుడు కంబమహాకవియు, తిరువళ్ళువరు, తమిళ పంచకావ్యములలో తలమానిక మనదగిన సిలప్పదికార మాహాకావ్యమును సంతరించిన ఇళంగో పూజ్యపాదులను ప్రస్తుతింపబడిరి. ఈమువ్వురు భారతికి ఆరాధ్యదైవతమలు!

కంబకవిని గూర్చి ఒకచోట కవితకు వాసికెక్కిన తమిళనాడు- కీర్తికంబడు ప్రభవించిన తమిళనాడు-- అని భారతి పేర్కొనెను. ఇట్టి తమిళ మహాకవుల సరసన తెనుగు పోతన్నను చేర్చి ఆసహజకవిని స్తుతించెను.

సంగీతసార్వభౌముడు త్యాగయ్యకు కుడా భారతి జోహారులర్పించెను.ఒక్క మాటలో తెలుగుభాష యన్నను, తెలుగు వారన్నను భారతికి అపారగౌరవము అని తెలియుచున్నది.

భావాలు

[మార్చు]

స్త్రీవాదంపై భారతి

[మార్చు]

స్త్రీలు రాజకీయాల్లో భాగస్వాములు కావాలని ప్రబోధిస్తూ, ఉద్యమించినవారిలో మొట్టమొదటి సంస్కర్తగా భారతిని భావిస్తారు. భారతి స్త్రీల హక్కుల గురించి, వారి విద్య గురించి విస్తృత స్థాయిలో చింతన చేశారు. సమాజానికి సైన్యంలా ఆధునిక భారతీయ మహిళను అతను దర్శించారు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులేనని భావిస్తే ప్రపంచం వైజ్ఞానికంగా, మేధాపరంగా సమున్నతంగా విలసిల్లుతుందని భారతి భావించారు. స్త్రీల హక్కులకు భంగం కలిగించేలా మాట్లాడిన శాస్త్రాలను, ఆచారాలను అతను ఖండించారు. అతను భావాల్లో చాలావరకూ ఆధునిక కాలానికి కూడా ప్రాసంగికంగా, సమకాలీనంగా నిలవడం విశేషం.[9]

కుల వ్యవస్థపై భారతి

[మార్చు]

హిందూ సమాజంలోని కుల వ్యవస్థకు కూడా భారతి వ్యతిరేకంగా పోరాడారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా భారత తన కుల గుర్తింపును విడిచిపెట్టేశారు. జీవించే ప్రతి జీవం సమానమేనని భావించారు. దీన్ని చూపించేందుకు ఒక యువ దళితునికి ఉపనయనం చేసి బ్రాహ్మణుని చేశారు. అప్పట్లో తర్వాతి తరాల వారి మనస్సులోకి పెద్దలు విభజన బీజాలు నాటడాన్ని వెక్కిరించారు. వేదాలను, గీతను బోధించేప్పుడు తమ స్వంత ఆలోచనలు దానిలో చేర్చి కువ్యాఖ్యానాలు చేయడాన్ని బహిరంగంగా ఖండించారు. దళితులను హిందూ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడాన్ని అతను గట్టిగా ప్రబోధించారు.

ప్రాచుర్యం, ప్రఖ్యాతి, ప్రభావం

[మార్చు]

భావాలు

[మార్చు]

తమిళనాట సుబ్రహ్మణ్య భారతి భావాత్మకంగా గొప్ప విప్లవాన్ని సాధించారు. సంస్కరణ, దేశభక్తి, జాతీయవాదం, తమిళ భాష ఔన్నత్యం వంటి అంశాల్లో అతను కవితలు తమిళులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సామాన్యమైన ప్రజలు అతను కవితలను కంఠస్థం చేసి సందర్భానుసారం ప్రస్తావించే స్థాయికి వచ్చాయి. కోట్లాదిమంది ప్రజలు అతను రాసిన కవితల పంక్తులను ప్రస్తావించడం విశేషం. ప్రేమ, భక్తి, కరుణ, శాంతి, యుద్ధం వంటి సార్వజనీనమైన అంశాల్లోనూ భారతి గీతాలు సందర్భానుసారంగా ప్రజల నాల్కలపై నాట్యమాడాయి.

భారతి పురస్కారం

[మార్చు]

భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి శాఖతో కలిసి 1987లో అత్యున్నత జాతీయ స్థాయి సుబ్రహ్మణ్య భారతి పురస్కారాన్ని నెలకొల్పి ప్రతి సంవత్సరం హిందూ సాహిత్యంపై అత్యున్నత స్థాయి రచనలు చేసిన రచయితలను సత్కరిస్తోంది.

స్మారక నామీకరణలు

[మార్చు]

భారతీయార్ విశ్వవిద్యాలయాన్ని అతను పేరిట 1982లో కోయంబత్తూరులో నెలకొల్పారు.[10] మెరీనా బీచ్ వద్ద, భారత పార్లమెంటు భవనం వద్ద భారతీయార్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఎన్నో రోడ్లుకు అతను పేరు పెట్టారు, వాటిలో ప్రఖ్యాతమైనవి కోయంబత్తూరులోని భారతీయార్ రోడ్డు, న్యూఢిల్లీలోని సుబ్రమణియం భారతి మార్గ్.[11][12] ఎన్.జి.ఓ. సేవలయ మహాకవి భారతీయార్ హయ్యర్ సెకండరీ స్కూల్ నడిపిస్తున్నారు.[13]

సినిమా రంగంలో

[మార్చు]

భారతి జీవితాన్ని ఆధారం చేసుకున్న తమిళ చిత్రం - భారతిని 2000లో జ్ఞాన రాజశేఖరన్ నిర్మించి విడుదల చేయగా జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ తమిళ చిత్రం పురస్కారాన్ని అందుకుంది.[14] కప్పళోత్తియ తమిళన్ చిత్రం వి.ఓ.చిదంబరనర్ తో పాటుగా సుబ్రమణ్య శివ, భారతీయార్ స్వతంత్రోద్యమ కాలంలో అనుభవించిన సంఘర్షణను చూపుతుంది, ఎస్.వి.సుబ్బయ్య సుబ్రహ్మణ్య భారతిగా నటించారు. తమిళ సినిమాల్లో అనేకం సుబ్రహ్మణ్య భారతి గీతాలు ఉపయోగించుకోగా, ప్రత్యేకించి వారుమైయిన్ నీరుం శివప్పు (తెలుగులో ఆకలి రాజ్యంగా పునర్నిర్మించారు) సినిమాలో అనేకమార్లు కథానాయకుడు సుబ్రహ్మణ్య భారతి కవితలను సందర్భానుసారం ఉటంకించడం కనిపిస్తుంది. అచ్చమిల్లై అచ్చమిల్లై (1984), కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్ (2002) మొదలైన సినిమాల పేర్లను సుబ్రహ్మణ్య భారతి గీతాల్లోని చరణాలు, పల్లవుల నుంచి తీసుకున్నారు.

సంగీత రంగంలో

[మార్చు]

కర్ణాటక సంగీత రంగంలో తరచుగా వినవచ్చే కృతుల్లో సుబ్రహ్మణ్య భారతి కీర్తనలు ఉన్నాయి. అతను రచించిన చిన్నంజిరు కిళియే కణ్ణమ్మా (పసిపిల్లల గురించి), కాక్కై చిరగినిలే నందలాలా (కృష్ణభక్తి), నల్లతూర్ వీణై సెగి (శక్తి యుక్తుల వ్యర్థం చేసే విధి గురించి) వంటివి పలువురు కర్ణాటక సంగీత విద్వాంసులు కచేరీల్లోనూ, రికార్డుల్లోనూ గానం చేశారు.

2013 మార్చిలో ఎస్.ఎస్.మ్యూజిక్, ఆయంగరన్ ఇంటర్నేషనల్ ప్రఖ్యాత బ్రిటీష్ గాయకుడు ఆడెలె పాట స్కైఫాల్ కు, భారతీయార్ గీతం అచ్చమిల్లై అచ్చమిల్లైకీ ఉన్న పోలికలు గుర్తించారు. ఉచ్చి మీదు వాన్ ఇదిందు వీళుగింద్ర పోదినం, అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమ్ ఎన్బదిల్లైయే అన్న వాక్యాలు స్కై ఫాల్ లిరిక్స్ లెట్ ది స్కై ఫాల్, వెన్ ఇట్ క్రంబుల్స్, వుయ్ విల్ స్టాండ్ టాల్ అండ్ ఫేస్ ఇట్ ఆల్ టుగెదర్ అన్న వాక్యాలు దాదాపుగా ఒకేలా "ఆకాశం మీదపడిపోతే పోనీ, భయం లేకుండా, నిలబడి ఎదుర్కుంటాం" అన్న అర్థాన్నే ఇస్తున్నాయి.[15][16]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Natarajan, p. 290
  2. 2.0 2.1 2.2 University of Delhi 2005, pp. 125–126
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Rajagopalan 2013, p. 1
  4. "Bharati's Tamil daily Vijaya traced in Paris" Archived 2016-11-21 at the Wayback Machine.
  5. 5.0 5.1 Lal 1992, pp. 4191–3
  6. "Last speech delivered in Erode" Archived 2008-04-15 at the Wayback Machine.
  7. "Changing society and modern Tamil literature".
  8. Sahitya Akademi 1992, p. 379
  9. Sivaraman 2006, pp. 71–72
  10. Gupta 2006, p. 14
  11. "Free helmet distribution". Times of India.
  12. "Subramaniam Bharti Marg". Indian Express.
  13. "Activities: School". Sevalaya. Archived from the original on 2013-12-05. Retrieved 2016-08-19.
  14. "SA women 'swoon' over Sanjay" Archived 2014-06-10 at the Wayback Machine.
  15. "Bharathiyar Song in James Bond Movie ?". SS Music. Archived from the original on 15 జూన్ 2015. Retrieved 26 April 2015.
  16. "Bharathiyar in Hollywood". Ayngaran International. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 26 April 2015.

ఇతర లింకులు

[మార్చు]