కోల్కతా: కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ను కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్యూజేఎస్) స్నాతకోత్సవ వేడుకకు సీజేఐ లలిత్ వీసీగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలను వేధింపుల నుంచి రక్షించాలని న్యాయవ్యవస్థను కోరారు.
సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గం ప్రజాస్వామిక అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుందంటూ పరోక్షంగా బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అని సీజేఐని ఉద్దేశించి అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే దేశమంతా రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించాలని సీజేఐ జస్టిస్ లలిత్ను ఆమె కోరారు.
కాగా, మీడియా కూడా పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. వారు ఎవరినైనా నిందిస్తారా అని ప్రశ్నించారు. మన ప్రతిష్టకు భంగం కలిగితే ఇక అంతేగా అని అన్నారు. తీర్పు వెలువడకముందే చాలా విషయాలు జరుగుతున్నాయని విమర్శించారు. తాను తప్పు మాట్లాడితే క్షమాపణలు కోరుతున్నానని ఆమె అన్నారు.
అలాగే న్యాయవ్యవస్థ పరిస్థితి మరింత దిగజారిందని మమతా బెనర్జీ విమర్శించారు. ‘ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని నేను చెప్పడం లేదు, కానీ ఈ రోజుల్లో పరిస్థితి మరింత దిగజారింది. అన్యాయం నుంచి ప్రజలను న్యాయవ్యవస్థ రక్షించాలి. వారి మొరను వినాలి. ప్రస్తుతం ప్రజలు తలుపుల వెనుక ఏడుస్తున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.