Jump to content

మామిడి అల్లం

వికీపీడియా నుండి

మామిడియల్లం
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
కుర్. అమాద
Binomial name
కుర్కుమా అమాద
Valeton & van Zijp
Synonyms

కుర్కుమా మాంగ Valeton & van Zijp

మామిడి అల్లం (లాటిన్ కుర్కుమా అమాద), మామిడియల్లం, లేక మామిడల్లం అనేది అల్లం (జింజిబిరేసి) కుటుంబానికి చెందిన దుంప మొక్క. చూడటానికి అల్లం వలె కనబడినప్పటికీ నిజానికి పసుపుకొమ్ముల మొక్కకీ దీనికీ దగ్గర సంబంధమున్నది. దీనిని ఆయుర్వేదశాస్త్ర సంస్కృతంలో ఆమ్రహరిద్రా (= మామిడిపసుపుకొమ్ము) అని కూడా పిలుస్తారు.

మామిడియల్లపు మొక్క యొక్క చిత్రణ: ఆకు, కాడ, పువ్వు, మరియు వేర్లు కలిగియున్న దుంప (కొమ్ము)

ఆహారముగా వినియోగం

[మార్చు]

దీని కొమ్ముకున్న మంచి మామిడివాసన వలనా, అల్లముకుండేటంత ఘాటయిన రుచి లేకపోవడం వలనా, పచ్చిగానో ఊఱబెట్టుకునో తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇది సీమాంధ్రప్రాంతపు జిల్లాలలో, ప్రత్యేకించి తూర్పు-పడమటి గోదావరీ కోనసీమా ప్రాంతాలలో, నిమ్మరసంలో ఊఱబెట్టి, ముద్దపప్పు వంటివాటితో నంజుకొని తింటారు. దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాల జనులు తమతమ సలాడ్లలోనూ చిన్నపాటి వేపుళ్లలోనూ దీని కొమ్మును సన్నగా తరిగి జోడిస్తారు. జపాన్, కొరియా వంటి తూర్పాసియా దేశాలవారు కూడా దీనిని ప్రత్యేక పదార్థంగా భావించి తింటారు.

మన ఇరుగుపొరుగు దక్షిణరాష్ట్రాలలో కూడా దీనిని పచ్చిగానో లేక ఊఱగాయగానో తింటారు. పంచదారతో మగ్గించి చేసిన దీని తీపిచట్నీని విశేషించి ఉత్తరభారత రాష్ట్రాలలో పరోటాల వంటివాటితో ఆరగిస్తారు. ఉత్తరానికి పొరుగుదేశమైన నేపాల్ యొక్క దక్షిణ రాష్ట్రాలవారు తమతమ పండుగలప్పటి విందులలో దీని పచ్చడిని కందకూరతో వడ్డిస్తారు.

రాష్ట్రీయ నామాలు

[మార్చు]

మన దేశపు రాష్ట్రాలలో మామిడి అల్లానికి ఉన్న పేరు మామిడి అల్లం అనో లేక మామిడిపసుపు అనో అర్థం వచ్చేలాగనే ఉన్నది. ప్రముఖ భాషలలో ఈ కొమ్ముకున్న పేర్లూ వాటి తెలుగు అర్థాలు క్రింద ఇవ్వబడినవి:

  • ఆంగ్లము: Mango-ginger (మ్యాంగో జింజెర్ ― మామిడి అల్లం)
  • హిందీ: आमहलदी (ఆంహల్దీ ― మామిడిపసుపు)
  • బాంగ్లా: আম আদা (ఆమ్ ఆదా ― మామిడి అల్లం)
  • మరాఠీ: आम्बेहळद (ఆంబేహళద్ ― మామిడిపసుపు)
  • తమిళం: மாங்காய் இஞ்சி (మాంగాయ్ ఇంజి ― మామిడి అల్లం)
  • గుజరాతీ: આંબો હળદર (ఆంబో హళదర్ ― మామిడిపసుపు)
  • కన్నడం: ಮಾವಿನ ಶುಂಠಿ (మావిన శుంఠి ― మామిడి అల్లం)
  • మలయాళం: മാങ്ങയിഞ്ചി (మాఙ్ఙయింజి ― మామిడి అల్లం)
  • పంజాబీ: ਅੰਬ ਅਦਰਕ (ఆంబ్ అద్రక్ ― మామిడి అల్లం)

లక్షణాలు

[మార్చు]
  • నిటారుగా పెరిగే గుల్మం.
  • మామిడికాయ వాసనతో ఉన్న కొమ్ము వంటి భూగర్భ కాండం.
  • చతురస్రాకార భల్లాకారంలో ఉండి పొడుగాటి వృంతాలున్న పత్రాలు.
  • కంకుల్లో అమరివున్న తెలుపు రంగుతో కూడిన లేత పసుపు రంగు పుష్పాలు.
  • మూడు నొక్కులు గల విదారక ఫలం.