Jump to content

వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2010)

వికీపీడియా నుండి

2010 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

హిందూ మతం లోని దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు - భారతి, సరస్వతి, శారద, హంస వాహిని, జగతీ ఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మ చారిణి, బుద్ధి ధాత్రి, వరదాయిని, క్షుద్ర ఘంట, భువనేశ్వరి. ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి. బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు.

ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"

ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది. తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

2వ వారం

ఈఫిల్ టవర్ లేదా ఐఫిల్ టవర్, ప్యారిస్ లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం. దీనిని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి. 1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000 మందికి పైగా దీన్ని సందర్శించారు. ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.

ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.

మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. (టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

3వ వారం

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820-1891) బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు. బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటి సారి క్రమబద్ధీకరించాడు. "ఈశ్వరచంద్ర"బిర్సింగా గ్రామము (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము లో జన్మించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత 1828లో కలకత్తాకు మారాడు. సంస్కృత కళాశాలలో చదివాడు.


1839 లో హిందూ న్యాయశాస్త్రము లో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదును అందుకొన్నాడు. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజి లో ప్రధాన సంస్కృత పండిట్ పదవి లభించింది. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టాడు. 1849 లో కాలేజీ నుండి రాజీనామా చేశాడు. ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగము లో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవి లభించింది. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరాడు. స్కూల్ ఇన్స్‌పెక్టర్ పదవిలో 20 స్కూళ్ళను స్థాపించాడు. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యాడు. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించాడు.


విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు. మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

4వ వారం

శృంగేరి, కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఈ గ్రామములోనే ఉన్న శృంగేరి శంకర మఠమును దక్షిణామ్నాయ మఠం అని అంటారు. ఇతిహాసం ప్రకారం శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, శంకరుడు ఇక్కడకు వచ్చినప్పుడు ఒక కప్ప ప్రసవిస్తున్నప్పుడు సర్పము నీడ కలిపించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ఇంతే కాకుందా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఊదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చూసాక శంకరులు ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపించాడు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరిలో, కంచిలో, బదరిలో ,ద్వారకలో మఠాలను స్థాపించాడు.


2001 జనాభా లెక్కల ప్రకారం శృంగేరి జనాభా 4253 (52 శాతం పురుషులు 48 శాతం స్త్రీలు). శృంగేరి అక్షరాస్యత 83 శాతము. ఇది జాతీయ సగటు అక్షరాస్యత కంటే (59.5%) ఎక్కువ. ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా 8 శాతం.


శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉన్నది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులు మున్నగునవి అహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి. మంగళూరు నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది. షిమోగా నుండి కూడా తరచు బస్సు సౌకర్యం ఉంది. శృంగేరి నుండి ఉడిపి కి బస్సు ఆగుంబె అనే ఊరి మీదుగా మలనాడు పర్వతశ్రేణుల మధ్య నుండి వెళ్తుంది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

5వ వారం

మేరీ క్యూరీ నవంబర్ 7, 1867జూలై 4, 1934) ప్రసిద్ధ భౌతిక, రసాయనిక మహిళా శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) ప్రప్రథమంగా ఈమెకే లభించాయి. ఇప్పటికీ మరే శాస్త్రవేత్తకూ రెండు వేరువేరు వైజ్ఞానిక రంగాలలో నోబెల్ బహుమతులు లభించలేదు. రేడియో ధార్మికతలో ఈమె పరిశోధనలు ఆ విషయంలో తరువాతి శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి. సోర్‌బోన్‌లో ఈమె మొట్టమొదటి మహిళా ప్రొఫెసర్. పోలండ్‌లో జన్మించి తరువాత ఫ్రెంచి పౌరసత్వం తీసుకొన్న ఈమెకు రెండు దేశాలతోనూ ప్రగాఢమైన సంబంధం ఉంది. ఈమె భర్త, సహ పరిశోధకుడు అయిన పియరీ క్యూరీ తన నోబెల్ బహుమతిని ఈమెతో కలసి అందుకొన్నాడు. ఈమె కుమార్తె ఇరీన్ జూలియట్ క్యూరీ మరియు అల్లుడు 1935లో రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి పొందినారు. ఇలా వీరి కుటుంబంలో నలుగురికి నోబెల్ బహుమతులు లభించాయి.

మారియా స్క్లొడొస్క పోలండ్ రాజధాని నగరమైన వార్సాలో నివసిస్తున్న బ్రోనిస్లావా మరియు వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే పోలిష్ దంపతులకు జన్మించినది. అమ్మాయి అవడం వల్లనూ, ఇంకా రష్యా మరియు పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు విశ్వవిద్యాలయంలో ప్రవేశం దొరకలేదు. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ పారిస్ చేరుకున్నది.

పారిస్‌లో ఈమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. సార్బోన్‌లో గణితం, భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రాలను అభ్యసించింది (అక్కడే తరవాత 1909లో సార్బోన్‌లో ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది). 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ప్రథమస్థానంలో పూర్తి చేసింది. ఒక సంవత్సరం తరవాత అదే యూనివర్సిటీలో, గణితంలో ఆవిడ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1903లో ఫ్రాన్సులో డాక్టరేటు పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించింది. సార్బోన్‌లో తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడింది. వారిరువురూ తరవాత వారి పరిశోధనలను రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజంనుండి వారు యురేనియంను వేరుచేసారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో యురేనియం కన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్దారించారు. 26 డిసెంబరు 1898న వీరు ఈ పరిశోధనను బయలు పరిచారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

6వ వారం
పంచవర్ష ప్రణాళికలు

1947 లో భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘం ను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. ఇంతవరకు మనదేశంలో 10 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 11 వ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 లో రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారిచూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. 1938 లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944 లో బాంబే ప్రణాళిక రూపకల్పన జర్గింది. జాతీయ నాయకులైన దాదాభాయి నౌరోజీ, ఎం.జి.రణడే, శ్రీమన్నారాయణ, ఎం.ఎన్.రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారాభారత ప్రణాళికా విధానం మూల భావాలను సమగ్రంగా రూపొందించారు. అయిననూ దీని ఒక నిర్దుష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు. 1950 లో ఆర్థిక సంఘం స్థాపించబడింది. 1952 డిసెంబర్ లో మొదటి పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది.

1947 లో స్వాతంత్రం పొందిన మనదేశం ప్రతి అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ప్రణాళిక బద్దంగా రూపొందిన లక్ష్యాల ఆధారంగా అభివృద్ధిని సాధించడం పంచవర్ష ప్రణాళికల విజయమేనని చెప్పవచ్చు. ప్రారంభంలో ఎన్ని ఆటంకాలు ఎదురైననూ అభివృద్ధిపథం వైపు పయనించడానికి ప్రణాళికలు కృషిచేశాయి. పంచవర్ష ప్రణాళికల వల్ల ఎన్నో విజయాలు సాధించిననూ అవి నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తే ఎన్నో అపజయాలు, వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి. ఇంకా....పూర్తివ్యాసం పాతవి

7వ వారం

ప్రదక్షిణము అనే దానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.

ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరకు బలిపీఠం (ధ్వజస్తంభం) వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న శివాలయం లో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు.


ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలన్నదే ప్రదక్షిణ లోని ప్రధానోద్దేశ్యం. దైవ ప్రదక్షిణము వలెనే అశ్వత్థ ప్రదక్షిణము, భూప్రదక్షిణము, కులశైల ప్రదక్షిణములు ఒక దాని కంటె ఒకటి దశోత్తరతమమైన ఫలితాన్నిస్తాయి. అలాగే తండ్రికి, గురువుకు, తల్లికి చేసిన ప్రదక్షిణలు ఒకదాని కంటె ఒకటి పది రెట్లు ఫలాన్నిస్తాయి. ఉదయము మరియు సాయంకాలము వేళల్లో సూర్య ప్రదక్షిణము సర్వసిద్ధిప్రదమని చెప్పబడినది. ఇంకా....పూర్తివ్యాసం పాతవి

8వ వారం

పోడూరు', ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ది గలిగిన పంట పొలాలతోనూ అభివృద్దిలో ఉన్న గ్రామము. వెండితెర వెలుగులో పోడూరు అందాలు. పల్లె అందాలు.. ప్రకృతి రమణీయత.. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగులు చేపడుతున్నారు.

ఈ ప్రదేశమున మొదట అడవి ఉండేది అడవిని చదును చేసి పోడు వ్యవసాయము చేయుచూ ఈ ప్రాంతమును పోడు అని పిలిచేవారు. కొంతకాలమునకు మెల్లగా మరికొంత భాగము చదును చేసి నివాసయోగ్యముగా మార్చుకొని మరికొంత ఊరు పెరిగిన తరువాత'పోడు'కు ఊరు చేర్చి పోడు ఊరుగా పిలువుట మొదలు పెట్టారు. అదే కాలానుగుణంగా పోడూరుగా మార్పుచెంది స్థిరపడినది. ధవళేశ్వరం వద్ద 1860 లో ఆనకట్ట కట్టబడి పోడూరుకు కాలువ సౌకర్య ఏర్పడటంతో వ్యవసాయం పుంజుకొన్నది. అప్పటికి పోడూరు జనసంఖ్య 3.357 ఉందేది. పోడూరు సౌకర్యాల పరంగా చాలా వెనుకబడి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో గ్రామ అభివృద్ది కోసం 1901వ సంవత్సరంలో గ్రామ అభివృద్ది సేవా కేంద్రం ఏర్పడింది. దీని ద్వారా కొన్ని నిధులను సేకరించి ఊరి రహదారులను మరియు ఇతర సౌకర్యాలను అభివృద్ది పరుచుట మొదలు పెట్టారు. 1929వ సంవత్సరం బ్రిటిష్ పాలకుల ద్వారా పోడూరు గ్రామపంచాయితీ ఏర్పడింది. తదుపరి అది మరింత అభివృద్ది చెందినది. ప్రస్తుతము రెండు అంతస్తుల భవనము మరియు పదిహేనుమంది సిబ్బందితో గ్రామానికి సేవలందించుచున్నది.

పోడూరును పండిత పోడూరుగా పిలిచేవారు ఎందరో పండితులు ఇక్కడ జన్మించి ఊరికి ధన్యతనొందించినారు. వారిలో ఒకరు మూతకవి. పోడూరి పెదరామకవిగారు శివరామాభ్యుదయము అనే ద్వ్యర్ధి కావ్యము రచించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారు ఊరిలో మరొక పేరొందిన విద్యాధికుడు కవి. గ్రామ పూర్వులలో మరొక గొప్ప వ్యక్తి సూరప్పగారు. ఈయన గ్రామమున నీటి ఎద్దడి మాపుటకు వారి భూములలో పెద్ద చెరువు తవ్వించి గ్రామానికి అంకితమిచ్చారు. ఇప్పటికీ ఆ చెరువు సూరప్ప చెరువుగానే పిలవబడుతున్నది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

9వ వారం

ఇళయరాజా భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 4,000 పాటలకు, 800 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా భారత దేశంలోని, చెన్నై లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక కుమార్తె (భవతారణి). వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి.

తమిళనాడు రాష్త్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది.సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, లండన్ నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది.

దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన "దళపతి" చిత్రంలోని "చిలకమ్మా చిటికెయ్యంగ" పాట బిబిసి వారి 10 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. ఇంకా....పూర్తివ్యాసం పాతవి

10వ వారం

ఇల్లాలి ముచ్చట్లు ఒక చక్కటి సాహితీ ప్రయోగం. "ఇల్లాలి ముచ్చట్లు" అనే శీర్షిక మొదలు పెట్టినది, ఆంధ్రజ్యోతి వార పత్రికలో. ఈ శీర్షికను 1967వ సంవత్సరంలో మొదలు పెట్టారు. ఈ శీర్షికను "పురాణం సీత" నిర్వహించేవారు. అందరూ ఈ శీర్షికను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ సతీమణి వ్రాస్తున్నదని చాలా కాలం అనుకునేవారట. కాని, సుబ్రహ్మణ్య శర్మే, మహిళా రచనా శైలిని అనుకరిస్తూ చాలా కాలం ఎవరికీ అంతు చిక్కకుండా నిర్వహించారు. దీనికి కారణం, శీర్షిక పేరు మహిళా సంబంధమయి, రచయిత పురుషుడయితే పాఠకులు ఆదరించరేమో అన్న అనుమానం ఒకటి కాగా, అప్పటి రోజులలో, మహిళా రచయితలదే పైచేయి అవుతూ వారి రచనలే ప్రసిద్ధి చెంది ఉండటం మరొక కారణం కావచ్చును. పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడయిన తరువాత కూడ తన బాధ్యతలను నిర్వహిస్తూనే, ఈ శీర్షికను కూడ విజయవంతంగా కొనసాగించారు.

ఈ శీర్షికలో మనం రోజువారి చూసే సంఘటనలు, రాజకీయాలు, తగాదాలు, చిన్న పిల్లల ఆటలు వంటి విషయాల గురించి (చైనా రాజకీయాల దగ్గరనుంచి చీపురు కట్టవరకు) హాస్యభరితంగా, ఆహ్లాదకరంగా వ్రాస్తూనే అవసరమైనప్పుడు, అవసరమైనంతవరకు సునిసితమైన విమర్శదగ్గర నుండి, కత్తుల్లాంటి మాటలతో తీవ్ర విమర్శకూడా చేస్తూండేవారు. చక్కటి పొందికతో, ఎక్కడా కూడ తూకం చెడకుండా, ఈ శేర్షిక ప్రతి వారం ఒక పేజీ మాత్రమే ప్రచురించేవారు.

వ్యాసరచన ఎక్కువ భాగం స్వగతంలోనే జరిగింది. కొన్ని కొన్ని వ్యాసాలలో "పురాణం సీత" తన భర్తతో మా(పో)ట్లాడుతున్నట్టు వ్రాయటం జరిగింది. వార పత్రికలలో, వ్యాసాలను స్వగతంగాను లేదా ఏక వ్యక్తి సంభాషణ రూపంలో, కధలాగ చెప్పే పద్ధతి, ఈ వ్యాస శీర్షికతోనే మొదలు. వ్యాసాలన్నీ చక్కటి వ్యావహారికి భాషలో అవసరమైన చోట ఆంగ్ల పదాలను యధాతధంగా వాడుతూ, సంగీతంలో మెట్లు మెట్లుగా పరాకాష్టకు చేరుకున్నట్టుగా ముగింపుకు చేరువవుతాయి. దాదాపు అన్ని వ్యాసాలలోనూ ఒక విధమైన ఊపిరి సలపని వేగం ఉన్నది. పాఠకుల ఆసక్తికి కారణం, కొంతవరకు వ్యాసంలో చర్చించబడ్డ ఆ కాలపు సామాజిక సమస్యలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనేవి అయినప్పటికి, వ్యాస శైలి అటువంటి ఆసక్తిని ఎక్కువగా నిలపగలిగిందని చెప్పక తప్పదు. వ్యాసాలన్నీ కూడ హాస్యభరితంగా ఉంటాయి. ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఈ విధంగా వ్రాయటమేమీ తేలిక కాదని, తేలికని ఊహిస్తున్నవారు ప్రయత్నించి చూడవచ్చని సవాలు చేసి, ఈ శీర్షిక శైలిని కొనియాడారు

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

11వ వారం

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు.


చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం తెలుగు నూతన సంవత్సరం తమిళ నూతన సంవత్సరం సూర్యమానం ప్రకారం చైత్ర మాసం మొదటిరోజు. ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.


ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని తయారు చేసే పద్దతిలో ఉప్పు', వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.

.... పూర్తివ్యాసం పాతవి

12వ వారం

పంచవర్ష ప్రణాళికలు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ భవిష్యత్తు బాగుండాలని అభివృద్ధి కోసం జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికలు. నెహ్రూ ప్రణాళికా సంఘం ను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూ ను పితామహుడిగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం ఇంతవరకు మనదేశంలో 10 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 11 వ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తాడు, కాగా కేబినేట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మెన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా మాంటెక్ సింగ్ అహ్లువాలియా కొనసాగుతున్నారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934 లో రచించిన ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థకు దారిచూపింది. కాబట్టి అతనిని దేశ ప్రణాళిక వ్యవస్థకు పితామహుడిగా అభివర్ణించవచ్చు. ఈ గ్రంథంలో విశ్వేశ్వరయ్య దేశంలో తాండవిస్తున్న పేదరికం, నిరుద్యోగం వంటి అనేక ఆర్థిక సమస్యలకు కారణం ప్రణాళికబద్దమైన పద్దతి లేకపోవడమే కారణమని పేర్కొన్నాడు. 1938 లో దేశంలో జాతీయ ప్రణాళిక కమిటీని స్థాపించారు. 1944 లో బాంబే ప్రణాళిక రూపకల్పన జర్గింది. జాతీయ నాయకులైన దాదాభాయి నౌరోజీ, ఎం.జి.రణడే, శ్రీమన్నారాయణ, ఎం.ఎన్.రాయ్ తదితరులు తమ రచనల ద్వారా, ఇతరేతర కృషి ద్వారాభారత ప్రణాళికా విధానం మూల భావాలను సమగ్రంగా రూపొందించారు. అయిననూ దీని ఒక నిర్దుష్ట రూపం ఇచ్చినది మాత్రం జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు.

మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగం మీదనూ, రెండోది పారిశ్రామిక రంగం మీదనూ ప్రత్యేకించి ప్రభుత్వ రంగ సంస్థల మీద, మూడవ దాంట్లో స్వయంసంవృద్ధి మీద, నాలుగు, ఐదవ ప్రణాలికల్లో సుస్థిర అభివృద్ధి, ఆరవ ప్రణాళికలో పేదరిక నిర్మూలన... ఇలా ఒక్కో ప్రణాళికలో ఒక్కో అంశం మీద దృష్టి సారిస్తూ వచ్చారు. .... పూర్తివ్యాసం పాతవి

13వ వారం

అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క. ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు. చరిత్ర పరంగా అరటిచెట్లను పశ్చిమ [[పసిఫిక్ మహాసముద్రం| చాలా రకాల అరటి పండ్ల రంగూ, రుచీ, వాసన, అవి పక్వానికి వచ్చే దశలోని ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోతాయి, కేవలం 2002 వ సంవత్సరములోనే 6.8 కోట్ల టన్నుల అరటిపండ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేయబడినాయి. ఇందులో 1.2 కోట్ల టన్నులు దేశాల మధ్య వ్యాపారంగా రవాణా చెయ్యబడినాయి. ఈక్వడార్, కోస్టారికా , కొలంబియా, ఫిలిప్పైన్సు దేశాలు ప్రతి ఒక్కటీ పది లక్షల టన్నుల కన్నా ఎక్కువ అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నాయి.

అరటిలో పిండిపదార్థాలు/చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువ. ప్రతి 100 గ్రాముల అరటి లో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1గ్రాము మాంసకృత్తులు (ప్రోటీనులు), 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నవి. అరటి సులభంగా జీర్ణమై, మలబద్ధం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. భారతదేశములో మొత్తం 50 రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో కొన్ని రకాలు: పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి(ముకిరీ),కర్పూరం. వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు

పురావస్తు, శిలాజవాతావరణ శాస్త్ర ఆధారాలను బట్టి పౌపా న్యూ గినియా లోని పశ్చిమ ద్వీప ఖండములోని కుక్‌ స్వాంపు వద్ద క్రీస్తుకు పూర్వం 8000 లేదా క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండే అరటి తోటల పెంపకం సాగినట్లు నిర్ధారించినారు. దీని వల్ల న్యూ గినియా లో తొలి అరటి తోటల పెంపకం జరిగినట్లు నిర్ధారించవచ్చు. తరువాత తరువాత ఇతర అడవి అరటి జాతులు దక్షిణ ఆసియా ఖండములో పెంపకము చేసినట్లు తోచుచున్నది.

వ్రాత ప్రతులలో మొదటిసారిగా అరటి ప్రస్తావన మనకు క్రీస్తు పూర్వం 600 సంవత్సరములో వ్రాసిన బౌద్ధ సాహిత్యమునందు కనపడుతుంది. అలెగ్జాండరు తొలిసారిగా వీటి రుచిని క్రీస్తు పూర్వం 327 వ సంవత్సరములో భారత దేశం నందు చూసినాడు. చైనాలో క్రీస్తు శకం 200 సంవత్సరము నుండి అరటి తోటల పెంపకం సాగినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. క్రీస్తు శకం 650 వ సంవత్సరములో ముస్లిం దండయాత్రల వల్ల అరటి పాలస్తీనా ప్రాంతానికీ, తరువాత ఆఫ్రికా ఖండానికీ వ్యాప్తి చెందింది. క్రీస్తు శకం 1502 వ సంవత్సరాన పోర్చుగీసు వారు తొలిసారిగా అరటి పెంపకాన్ని కరేబియను, మధ్య అమెరికా ప్రాంతములలో మొదలుపెట్టినారు.

.... పూర్తివ్యాసం పాతవి

14వ వారం

బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు. స్వల్పకాలములోనే వివిధ భాషలలో 750కి పైగా సినిమాలలోనటించి ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించింది గిన్నీస్ ప్రపంచ రికార్డులు(2008వ సంవత్సరం)వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.

బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు.ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా తొలిసారి విడుదలన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం".

"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాలగారు తను దర్శకత్వం వహిస్తున్న "చంటబ్బాయ్" సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవి కి పరిచయం చేయడం, తర్వాత "పసివాడి ప్రాణం" లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంట లో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకులు జంధ్యాలగారిని, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు గారినీ, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిగారిని ఎప్పటికీ మరువలేను అంటాడు. .... పూర్తివ్యాసం పాతవి

15వ వారం
దస్త్రం:Bhadrakaliamma l.jpg

శ్రీ భద్రకాళీ దేవస్థానము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, వరంగల్ నగరమునందు ఉన్నది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై రంగంపేట నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరమున గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉన్నది. ఆమె 8 చేతులతో - కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకము : ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలము, ఛిన్నమస్తకము, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉన్నది.

ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లూ 'ప్రతాపరుద్ర చరిత్రము' మరియి 'సిద్ధేశ్వర చరిత్రము' గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శనమిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వచ్చానని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు, ఆ విద్వాంసులను కారుమాటలతోనైన జయించాలనే ఉద్దేశ్యంతో "ఈ వేళ కృష్ణచతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా?" అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే, ఔనంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. కాదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి, "రేపు పౌర్ణమి" అని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది. ఆ సంకట స్థితినుంచి తమను రక్షించుకోటానికి ఆ విద్వాంసులలో ప్రధానుదైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళీదేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై "నీ మాట నే నిలుపుతా" నని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి, సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట. ఇది కేవలం దైవీశక్తి కాని, మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగ శ్రీ భద్రకాళీదేవి భక్తులను కటాక్షించటం ఆనాటినుంచే కనిపిస్తుంది. ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోనివాడు. కనుక ప్రతాపరుద్రుని కాలంనాటికే భద్రకాళీ దేవాలయం ప్రసిద్దమై ఉండినట్లు సృష్టమవుతుంది.

క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. .... పూర్తివ్యాసం పాతవి

16వ వారం

మనాలి హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో కులు లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడిది. సముద్ర మట్టానికి 6398 అడుగుల ఎత్తులో ఉంది. మనాలి పరిపాలనాపరంగా కులు జిల్లాలో భాగంగా ఉంది, జనాభా సుమారు 30,000. ఈ చిన్న పట్టణం లడఖ్ కు ప్రాచీన వర్తక మార్గ ప్రారంభంగా ఉండేది, అక్కడ నుండి కారకోరం కనుమ మీదుగా యార్కండ్ మరియు టరిం హరివాణంలోని ఖోటాన్ కు చేరుతుంది.

మనాలి మరియు దాని చుట్టుప్రక్కల ప్రదేశం సప్తర్షి, లేదా ఏడుగురు ఋషుల నివాసంగా పేర్కొనబడటం వలన భారతీయ సంస్కృతి మరియు వారసత్వంలో అమిత ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారత దేశ జనాభా లెక్కల ప్రకారం, మనాలి యొక్క జనాభా 6265. జనాభాలో పురుషులు 64% మరియు స్త్రీలు 36%. మనాలి యొక్క సగటు అక్షరాస్యత రేటు 74%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 80%, మరియు స్త్రీలలో అక్షరాస్యత 63%. మనాలిలో 9% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారు.

మనాలి బాగా చల్లని శీతాకాలాలు, మరియు మితమైన చల్లదనాన్ని కలిగిన వేసవికాల శీతోష్ణస్థితిని కలిగిఉంది. ఉష్ణోగ్రతలు సంవత్సరంలో 4సెంటీగ్రేడ్ నుండి 30సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. వేసవికాలంలో సగటు ఉష్ణోగ్రతలు 14సెంటీగ్రేడ్ నుండి 20సెంటీగ్రేడ్ వరకు, మరియు శీతాకాలంలో -7సెంటీగ్రేడ్ నుండి 10సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.మనాలి దాని పేరును బ్రాహ్మణ స్మృతి కర్త అయిన మనువు పేరు మీదుగా పొందింది. మనాలి అనే పదానికి సాహిత్యపరమైన అర్ధం “మనువు యొక్క నివాసం”. పురాణాల ప్రకారం ఒక గొప్ప వరద ప్రపంచాన్ని ముంచి వేసిన తరువాత మరల మానవ జీవితాన్ని సృష్టించడానికి మనువు తన ఓడ నుండి మనాలిలో అడుగుపెడతాడు.

మనాలి జాతీయ రహదారి-21 మరియు జాతీయరహదారి 1 ల ద్వారా ఢిల్లీతో కలుపబడింది, లే కు వెళ్ళే ఈ రహదారి ప్రపంచంలో అంత్యంత ఎత్తైన వాహనంలో ప్రయాణించగల రహదారిగా ప్రసిద్ధి చెందింది.మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట , పాల సామ్రాజ్యం యొక్క చిహ్నం. శిలలు, రాళ్ళు, మరియు విశాల దారు శిల్పములతో కూడిన ఈ భవనం హిమాచల్ యొక్క మహోన్నత మరియు మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ఈ కోట తరువాత కాలంలో హోటల్ గా మార్చబడి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది. పూర్తివ్యాసం పాతవి

17వ వారం

త్యాగరాజు ఒక గొప్ప వాగ్గేయ కారుడు. కర్ణాటక సంగీత త్రిముర్తుల్లో ఒకడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.త్యాగరాజు ప్రస్తుత తమిళనాడు లోని తంజావూరు దగ్గరి తిరువయ్యూరు అను గ్రామం (అగ్రహారం) నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలములోని కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆదరంలో ఉండేవాడు. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.

ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ సంగీత కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. పూర్తివ్యాసం పాతవి

18వ వారం

మామిడికి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి మాంగిఫెరా ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటిని ఊరగాయలు తయారీలో ఉపయోగిస్తారు. వీటినుండి రసాలు తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.

ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలేవైపు కొంచం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి.ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మద్యలో పీచు తోను పీచు లేకుండాను ధృడమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి(1)నుండి(2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్నవిత్తనంతో (జీడి) ఉంటుంది.

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కవగా తాజాగానే తింటారు. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు)చేస్తారు. ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలోఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది.

పూర్తివ్యాసం పాతవి

19వ వారం

ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ హైస్కూల్ లో , తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి ' కి సంపాదకుడిగా ఉన్నాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం" తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.

తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం , సినీవాలి , కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి , దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. వేమన వేదం , మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?,గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత.

పూర్తివ్యాసం పాతవి

20వ వారం

రెండు లేదా 2 అనేది లెక్కించడానికి వాడే (cardinal) అంకెలలో ఒకటి తరువాత, మూడుకు ముందు వచ్చే అంకె. దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడుతారు

  • లెక్కలో రెండవది. అంటే కొన్ని వస్తువుల సమూహాన్ని లెక్క పెట్టేపుడు "ఒకటి" తరువాత "రెండు" వస్తుంది. ఇక్కడ అన్నింటిలో ఆ వస్తువు కూడా ఒకటి మాత్రమే కాని దానికి విశేష స్థానం ఏమీ లేదు. (ఒకటి, రెండూ, మూడు ....; రెండవ కృష్ణుడు; రెండవ ఇల్లు; గాంధీనగర్ రెండవవీధి)
  • రెండు వస్తువుల సమూహము "జోడు" అన్న రూపంలో ఎక్కువగా వాడుతారు. (ద్వయ మంత్రం; దొందూ దొందే, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు)
  • అన్నింటికంటే ఉత్తమమైనదాని తరువాతిది. రెండవ స్థానము, అంత మంచిది కాదు (నెం.2 క్వాలిటీ)
  • చట్టవిరుద్ధమైనది (రెండో నెంబరు ఎకౌంటు, నెంబర్ టు మనీ)
  • విడిపోవడం అనే అర్ధంలో (ఇల్లు రెండు ముక్కలైపోయింది. ఒకటికి రెండయ్యాయి)
  • తోడు (ఒకరికి ఒకరు, ఇద్దరు మొనగాళ్ళు)


రెండు కి సంబంధించిన తెలుగు మాటలు: జోడీ, జోడు, జత, జంట, ఇరు, ఉమ్మడి. రెండు కి సంబంధించిన సంస్కృతం మాటలు: యుగళ, యుగ్మ, ఉభయ, ద్వి, ద్విగు, ద్వంద్వ, ద్వయి, ద్వైత, మొదలైనవి. సులోచనద్వయాన్ని కళ్ళజోడు అని తెలుగువారు అంటే, ముక్కుజోడు అని తమిళులు అంటారు. ఈరు, ఇరు అంటే రెండు, ఇద్దరు అని రెండర్ధాలు ఉన్నాయి. ఈరారు అంటే 12, ఈరేడు అంటే 14, ఈరెనిమిది 16. ఇరుకెలకులు, ఇరుచక్కి, ఇరుదిసలు, ఇరువంకలు – ఈ మాటలన్నిటికి ‘రెండు పక్కలు’ అని అర్ధం.

పూర్తివ్యాసం పాతవి

21వ వారం

జార్ఖండ్ లేదా ఝార్ఖండ్, భారతదేశంలో ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒరిస్సా రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు. 2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున జార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత.

బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రము.

కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా జార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. మగధ సామ్రాజ్యంకాలం నుంచీ ఉన్నది. ("ఝరీ" - అంటే పొద). చోటానాగపూర్ పీఠభూమి, సంథాల్ పరగణాలలో విస్తరించి ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము.

పూర్తివ్యాసం పాతవి

22వ వారం

ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు (1883-1960) స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంధాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించాడు. రాయలసీమ కు ఆ పేరు పెట్టింది ఆయనే. 1928లో కర్నూలు జిల్లా నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అప్పటి వరకు దీనిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.


ఇతను కర్నూలు, గుత్తి, నంద్యాల లో ప్రాధమిక, ఉన్నత విద్య చదివాడు. మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసాడు. తరువాత రాజమండ్రి లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907 లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించాడు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


ఆ తరువాత స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవాడు. 1908 లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు విపరీతబుద్ధి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యాడు. 1927 లో కాంగ్రెసు అభ్యర్ధిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసాడు.


1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంధాలయోద్యమం వైపు దృష్టి మరల్చాడు. ఆంధ్ర గ్రంధాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1952 లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించాడు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించాడు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.

పూర్తివ్యాసం పాతవి

23వ వారం

బోస్టన్ మహానగరము అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మస్సాచుసెట్స్ రాష్ట్ర రాజధాని. న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలోకెల్లా అతి పెద్దది అయిన బోస్టన్‌ను ఆ ప్రాంత ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా పరిగణిస్తారు. 2006వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారము ఈ నగర జనాభా దాదాపు 5,96,763. బోస్టన్ నగరంలో నివసించేవారిని 'బోస్టనియన్స్ ' అని పిలుస్తుంటారు.

1630లో ఇంగ్లండ్ నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు షాముట్ ద్వీపకల్పంలో ఈ నగరాన్ని నెలకొల్పారు. 18వ శతాబ్దంలో జరిగిన అమెరికా విప్లవానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సంఘటనలను ఈ నగరం సాక్షి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బోస్టన్ మహానగరం ప్రముఖ నౌకాపోర్టుగా,పరిశ్రమలకు కేంద్రంగా రూపుదిద్దుకుంది.

అమెరికా చరిత్రలో మొట్టమొదటి పబ్లిక్ స్కూలు అయిన బోస్టన్ లాటిన్ స్కూలు ఇక్కడే నెలకొల్పవడింది. మొట్టమొదటి కాలేజీ అయిన హార్వర్డు, అమెరికాలోనే మొట్టమొదటి సబ్‌వే రవాణా వ్యవస్థ మొదలయినవి ఈ నగరంలోనే ఉన్నాయి. లెక్కలేనన్ని విద్యాలయాలతో, హాస్పిటల్స్‌తో బోస్టన్ అమెరికాలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా మరియు ఆరోగ్యకేంద్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం దాదాపు 16.3 మిలియనుల సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు బోస్టన్ ఆర్థికరంగంలో చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. ఈ విద్యాసంస్థలు కల్పిస్తున్న మానవ వనరులవల్ల ఎన్నో పరిశ్రమలు బోస్టన్ నగరంలో, చుట్టు పక్కల నెలకొల్పబడ్డాయి. 2003 లెక్కల ప్రకారం, బోస్టన్ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులవల్ల $4.8 బిలియనుల ఆదాయం చేకూరింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి అత్యధికంగా బోస్టన్‌కు ఫండ్స్ వస్తాయి.టూరిజం కూడా మరో ముఖ్యమయిన ఆదాయవనరుగా నిలుస్తున్నది. 2004లో నగరానికి వచ్చిన సందర్శకులు $7.9 బిలియన్లు ఖర్చుపెట్టారు.


ఆర్థికరంగంలో సేవలు అందించే - ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎన్నో బోస్టన్‌లో ఉన్నాయి. ఫిడిలిటీ ఇన్వెస్టిమెంట్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్, లిబర్టీ మ్యూచువల్, జిల్లెట్, టెరాడైన్ మొదలయిన ఎన్నొ కంపెనీల ప్రధాన కేంద్రాలు బోస్టన్‌లో ఉన్నాయి.

పూర్తివ్యాసం పాతవి

24వ వారం

నలంద భారత దేశమందు ప్రస్తుత బీహరు రాష్ట్రంలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలందా అనే సంస్కృత పదం నలం (అనగా కమలము అనిఅర్ధం, కమలం జ్ఞానికి చిహ్నం) మరియూ ద (అంటే ఇవ్వడం)అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టింది. చైనా తీర్థయాత్రీకుడైన హ్యూయన్ త్సాంగ్ నలందా పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే నలందా అన్న పేరు వచ్చిందని వివరించాడు.

ఇది పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం క్రీ.శ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికముగా పాల వంశము యొక్క పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్ కన్నింగ్‌హాం నలందను బారాగావ్ గ్రామముగా గుర్తించాడు. బుద్ధుడు చాలా సార్లు నలందా చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చెప్పబడినది. ఆయన నలందను సందర్శించినప్పుడు సాధారణముగా పావారిక యొక్క మామిడితోపులో బస చేసేవాడు మరియు అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి మరియు దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు కేవత్తతో మరియు అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది.

నలందా ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయము, అంటే ఈ విద్యాలయంలో విధ్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా 10,000 మంది విద్యర్థులూ 2,000 మంది బోధకులూ ఉండేవారు. పెను గోడ మరియూ ద్వారములతో ఈ విశ్వ విద్యాలయము 'అతి ఘనమైన కట్టడము' గా గుర్తించబడినది. నలందాలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్ళూ, మరియూ ఎన్నొ ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యాన వనాలు ఉండేవి. గ్రంధాలయము ఒక తొమ్మిది అంతస్తుల భవనము. ఇందులో ఎన్నొ గ్రంధాల ములాలు ఉన్నవి. నలందా విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలందా విద్యార్ధులనూ, బొధకులనూ కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా,మరియు టర్కీ వంటి దేశాల నుండీ ఆకర్షించింది.

పూర్తి వ్యాసము, పాతవి

25వ వారం

కాశీనాథుని నాగేశ్వరరావు (1867 - 1938) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి. ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోద్ధారక అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది.


కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్తి గ్రామంలో 1867 లో మే 1న జన్మించాడు. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో 'మద్రాసు క్రిస్టియన్ కాలేజి'లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి. నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.


1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవుసరం. సెప్టెంబరు 1908లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.

పూర్తి వ్యాసము, పాతవి

26వ వారం

గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. గద్వాల చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం కూడా. పట్టణం నడిబొడ్డున సంస్థానాధీశుల కాలం నాటి పూర్తిగా మట్టితో నిర్మించిన కోట కలదు. గద్వాల సమీపంలో ఆత్మకూరు వెళ్ళు రహదారిలో "ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు" ఉంది. 7వ నెంబరు జాతీయ రహదారి నుండి 18 కిలోమీటర్లు లోపలికి ఉన్న గద్వాల పట్టణానికి రైలు మార్గం ఉంది. గద్వాల సమీపంలోని పలు గ్రామాలు కూడా చారిత్రక ప్రాశస్త్యం కలవి. అయిజా, రాజోలి, వేణిసోంపూర్, ఆలంపూర్ తదితర గ్రామాలు కూడా చారిత్రకంగా, పర్యాటకంగా ప్రఖ్యాతిగాంచినవి. ఇది గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా ఉంది. పట్టణ జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారము 53,601. ఇందులో పురుషులు 51% మరియు మహిళలు 49%. ఇక్కడి సగటు అక్షరాస్యత 57%.

1663 సంవత్సరం నుండి 1712 మధ్యకాలంలో పెదసోమభూపాలుడు (ఇతనినే నలసోమనాద్రి అనేవారు) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను కోటలోపల ఏర్పాటు చేసారు. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్)డిగ్రీ కళాశాలగా పెట్టబడింది.


చేనేత పరిశ్రమలో ముఖ్యంగా చీరల తయారీలో గద్వాల పట్టణం రాష్ట్రంలోనే ప్రముఖ పేరు సంపాదించింది. సుమారు నాలుగు శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి పంచెలను సమర్పించే సంప్రదాయం ఉంది.

పూర్తి వ్యాసము, పాతవి

27వ వారం

బౌద్ధ మతము లేదా బౌద్ధం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి - మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానం తో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.


గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంధం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు "మహాయాన సూత్రాలు" అనే రచనను విశ్వసిస్తారు. దీనిని థేరవాదులు అంగీకరించరు.

వివిధ సంప్రదాయాలలో ఏకాభిప్రాయంగా పరిగణింపబడే ముఖ్య సూత్రాలు -

ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు మొదటిగా కనుక్కొని ఇతరులకు బోధించాడు. గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 5వ శతాబ్దంలో జీవించాడని పరిశోధకుల అంచనా. ఆరంభ దశలో బౌద్ధం సుత్త పిటకం, వినయ పిటకం అనే మౌలిక పాళీ సూత్రాలపైనా, నాలుగు నికాయ (ఆగమ) సూత్రాలపైనా ఆధారపడింది. బుద్ధుని పరినిర్వాణం తరువాత కొద్ది కాలానికే మొదటి బౌద్ధ మండలి సమావేశమయ్యంది. బుద్ధుని సన్నిహితుడైన ఆనందుడు తెలిపిన సూత్రాలు సుత్త పిటకం అనీ, మరొక శిష్యుడు ఉపాలి చెప్పిన విషయాలు వినయ పిటకం అనీ ప్రసిద్ది చెందాయి. సుత్త పిటకంలో బుద్ధుని సూక్తులు ఉన్నాయి. వినయ పిటకంలో బౌద్ధ సంఘంలో ఉండేవారి లక్షణాల గురించి చెప్పబడింది (భిక్షువుల ధర్మాలు). రెండవ బౌద్ధ మండలి తరువాత బౌద్ధంలో వివిధ శాఖలు పొడసూపనారంభించాయని పరిశోధకులు భావిస్తున్నారు. అశోకుని తరువాతనే ఈ శాఖా భేదాలు బలవంతమయ్యాయని కొందరి అభిప్రాయం. అశోకుడు పాటలీ పుత్ర నగరంలో మూడవ బౌద్ధ మండలిని నిర్వహింప జేశాడు. ...


పూర్తి వ్యాసము, పాతవి

28వ వారం

గూగుల్‌ ఇంక్‌, ఒక అమెరికన్ పబ్లిక్ కార్పోరేషన్. ప్రసిద్ధ శోధన యంత్రం(ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్-Google), వెబ్-ఆదారిత ఈ -మెయిల్(G-mail), ఆన్ లైన్ మ్యాపింగ్(maps.google), ఆఫీసు ప్రొడక్టివిటీ(Google Apps), సోషల్ నెట్ వర్కింగ్(Orkut), వీడియో షేరింగ్(youtube) మొదలగు బహుముఖ సేవలద్వారా ప్రపంచ వ్యాప్తంగా వెబ్ ట్రాఫిక్ పరంగా రెండవ స్థానములో ఉన్న సంస్థ. సెప్టెంబర్‌ 1998 వ సంవత్సరంలో ఒక ప్రైవేటు కార్పోరేషనుగా స్థాపించబడింది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 19,000 మంది పనిచేస్తారు. గూగుల్‌ యొక్క సేవలు ఎన్నో సర్వర్‌ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్‌ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్సు వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%), ఎమ్.ఎస్.ఎన్‌ (13%)ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌. గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది!


1996 జనవరిలో, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ అను ఇద్దరు పి.హెచ్.డి విద్యార్థులచే ఒక పరిశోధనా ప్రాజెక్టుగా గూగుల్ మొదలయ్యింది గూగుల్ యొక్క కార్పొరెట్ చరిత్ర. అప్పటి వరకు ఉపయోగంలో ఉన్న శోధనాయంత్రాలలో ఉపయోగిస్తున్న సాంకేతికత కంటే వెబ్సైట్ల మధ్య గల సంబంధాన్ని సంక్షోధించగలిగే సాంకేతికత మరింత మెరుగైన శోధనాయంత్రాన్నివ్వగలదని వారు భావించారు(అప్పటి వరకు అందుబాటులో ఉన్న శోధనాయంత్రాలు ఒక పదం ఒక పేజీలో ఎన్ని సార్లు తటస్థపడుతుంది అనే దానిపై ఆధారపడేవి). ఇతర వెబ్ పేజీల నుండి ఎక్కువ లింకులు కలిగి ఉన్న వెబ్ పేజీలే సెర్చ్ చెయబడుతున్న పదం తో ఎక్కువ సంబంధం కలిగినవిగా దృవీకరించుకున్న తర్వాత పేజ్ మరియు బ్రిన్ తమ సెర్చ్ ఇంజన్ కు పునాది వేసారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము కి చెందిన వెబ్సైట్ ను సెర్చ్ ఇంజన్ మొదట వాడింది. google.com డొమైన్ సెప్టెంబర్ 15, 1997 న నమోదు చేయబడింది. సెప్టెంబర్ 7, 1998Google Inc. మెన్లో పార్క్, కాలిఫోర్నియా లో ఒక స్నేహితుని ఇంటి గారేజీ లో కంపెనీ గా అవతారం ఎత్తింది.


గూగుల్ పెరుగుతున్న ఇంటర్ నెట్ వినియోగదారులలో అంతులేని వీర అభిమానులను సంపాదించుకుంది. అనవసరపు బొమ్మలు, చిత్రాలు లేని గూగుల్ ముఖ్య పేజికి వినియోగదారులు ఆకర్షితులైయ్యారు. హడావిడిని ఇష్టపడని వినియోగదారులను సైతం ఇట్టె ఆకర్షించగలిగింది గూగుల్.....

పూర్తి వ్యాసము, పాతవి

29వ వారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు.

తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్ట లో కనుగొని,ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రతిష్టించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితులు యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి.


దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి.


క్రీ.శ.614లో పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయం లోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధ యాదవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

పూర్తి వ్యాసము, పాతవి

30వ వారం
పింగళి నాగేంద్రరావు (1901 - 1971) ఒక తెలుగు సినిమా రచయిత, పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. సి.ఐ.డి, శ్రీ కృష్ణార్జున యుద్ధం, మహామంత్రి తిమ్మరుసు, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, మహాకవి కాళిదాసు, పెళ్ళినాటి ప్రమాణాలు, మాయా బజార్, మిస్సమ్మ, చంద్రహారం, పాతాళ భైరవి, గుణసుందరి కథ, వింధ్యరాణి, శ్రీకృష్ణ లీలలు, అప్పు చేసి పప్పు కూడు వంటి చిత్రాలకు రచయిత పింగళి.


ఆయన 1901 డిసెంబర్ 29న శ్రీకాకుళం జిల్లా, బొబ్బిలి దగ్గర ఉన్న రాజాంలో జన్మించాడు. పింగళికి రెండేళ్ళ వయసులో బందరుకు వారి కుటుంబం బందరుకు వలస వెళ్ళారు. ఆయన చిన్నతనం నుంచీ కృష్ణా జిల్లాలోనే ఉంటూ ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోపల్లె హనుమంతరావు ప్రభృతులు స్థాపించిన ఈ కళాశాలలో తొలి విద్యార్థులలో ఒకడైన కారణం చేత కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు మొదలైన వారి పరిచయం లభించింది.


1918లో చదువు పూర్తి చేసి నాగేంద్ర రావు ఖరగ్‌పూర్ లోని రైల్వే వర్క్‌షాపులో అప్రెంటీస్ గా చేరాడు. ప్రసిద్ధ యోగవ్యాయామవేత్త అయిన రామజోగారావు గారి జాతీయోత్సాహం రేకెత్తించే ఉపన్యాసాల ఫలితంగా 1920లో నాగేంద్రరావు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఉత్తరదేశయాత్ర ప్రారంభించాడు. దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) సభ్యుడుకావటం జరిగింది. ఉత్తరదేశం పర్యటించి చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నాడు. అసలే బ్రహ్మచారి, అందులో వైరాగ్యం కుదిరింది. కాని ఆశ్రమంవారు అనుమతించలేదు. నాగేంద్రరావు ఆశ్రమవాసిగా వుండేకన్న కాంగ్రెసు సంస్థలో చేరి ఎక్కువ దేశసేవ చేయగలుగుతాడన్నారు... పింగళి నాటకాలు ఇటీవల పింగళీయం పేరుతో వెలువఢ్డాయి.

పూర్తి వ్యాసము, పాతవి

31వ వారం

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.


ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు గురించి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం ప్రకారం

  1. శాంకరి - శ్రీలంక
  2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు
  3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
  4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక
  5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్
  6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్
  7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర
  8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
  9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
  10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
  11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్, ఒరిస్సా
  12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
  13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం
  14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్
  15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్
  16. మంగళ గౌరి - గయ, బీహారు
  17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్
  18. సరస్వతి - జమ్ము, కాష్మీరు

పూర్తి వ్యాసము, పాతవి

32వ వారం

కార్గిల్ యుద్ధం , భారత్ పాకిస్తాన్ మధ్య మే - జులై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో మరియు మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి(వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలు మరియు తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలు బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువయ్యింది.

వాస్తవాధీనరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది).

భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లధాక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లా లో భాగంగా ఉండేది. మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత వాస్తవాధీన రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారత దేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది. 1971లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు. కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 km ల దూరంలో ఉంది. శ్రీనగర్ - లేహ్ లను కలిపే జాతీయ రహదారి(NH 1D) కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 km పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు.

పూర్తి వ్యాసము, పాతవి

33వ వారం

దామెర్ల రామారావు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1877, మార్చి 8వ తేదీన ప్రముఖ వైద్యుడు దామెర్ల వెంకట రమణారావు, లక్ష్మీదేవిలకు రెండవ కుమారుడుగా జన్మించాడు. చిన్నతనం నుంచీ ఈయనకు చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి ఉండేది. రామారావు మేనమామ పాఠశాలలో డ్రాయింగు టీచరుగా పనిచేసేవాడు. అన్నివేళలా ఆయనతో ఉండటం వలన కాబోలు రామారావుకి కూడా చిత్రలేఖనం మీద మనసు మళ్ళింది. ఆరేళ్ళ వయసునుండీ గోడమీద బొగ్గుతో, ఆపైన తెల్ల కాగితాల మీద బొమ్మలు వేయటం ప్రారంభించాడు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళవయసు నాటికి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదలయింది. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరిగట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ ఒకటేమిటి? అనేక ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు.

ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూ కూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు. కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి పంపాడు. 1916 లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె. స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్‌లోని లోని మెళకువలు నేర్చుకున్నాడు. ఆ కళాశాల సంచాలకుడైన సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా మూడవ సంవత్సరములో చేర్చుకొన్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని మద్రాసీ అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి ముక్కునవేలేసుకున్నారు, నమ్మలేకపోయారు. అమాయకంగా నలుగురిలో కలవక ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సృజనాత్మకత ఉందా? అని అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మేయో బంగారు పతకాన్ని రామారావు పొందాడు. వెంటనే చిత్రకళశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. కాని స్వరాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో రాజమండ్రికి తిరిగివచ్చాడు.

1922 లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన 'ఋష్యశృంగ బంధనం' చిత్రానికి ప్రథమ బహుమతిగా 'వైస్రాయి ఆఫ్ ఇండియా' పతకం వచ్చింది. అంతేకాకుండా అప్పటి వైస్రాయి లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాల్లో ఒకదాన్ని కొన్నాడు. రామారావు చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, 'సిద్ధార్థుని రాగోదయం', 'బావి దగ్గర', భరతవంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన, నంది పూజ, పేరంటము, గొల్లపడుచులు, కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి.

పూర్తి వ్యాసము, పాతవి

34వ వారం
దస్త్రం:SwamiAyyappan.jpg

అయ్యప్ప, హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శశబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.

శబరిమలైలోని అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశంలో ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు. అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశము లోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా కలదు. ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక పట్టణాలు. గ్రామాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు.


నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది. భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

పూర్తి వ్యాసము, పాతవి

35వ వారం

భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం ఆంధ్ర ప్రదేశ్, ఖమ్మం జిల్లా లో, గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ.,మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడినది.

పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధము గా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరిఅని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిర పడింది. గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను(6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరి పై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనేపేరు వచ్చింది.

సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.

పూర్తి వ్యాసము, పాతవి

36వ వారం

భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడిగా పి.సి.మహలనోబిస్ ప్రసిద్దిచెందినాడు. 1893 లో కోల్‌కత లో జన్మించిన మహలనోబిస్ భౌతిక శాస్త్రం లో శిక్షణ పొంది, అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైరైనాడు. అతనికి గణాంక శాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆ రంగంలో నైపుణ్యం సాధించి చివరికి ఆ రంగంలోనే జగత్ప్రసిద్ది చెందినాడు. గణాంక శాస్త్ర రంగంలో అతని సేవలకు గుర్తింపుగా లండన్ లోని రాయల్ సొసైటీ పెల్లోగా ఎన్నికయ్యాడు. 1946 లో ఐక్యరాజ్యసమితి గణాంక శాస్త్ర కమీషన్ సభ్యుడిగా, 1949 లో కేంద్ర మంత్రివర్గపు గణాంక శాస్త్ర గౌరవ సలహా దారుడిగా నియమించబడ్డాడు. 1950 లో నేషనల్ శాంపిల్ సర్వే స్థాపనలో మహలనోబిస్ కీలకపాత్ర వహించాడు. 1949 జాతీయాదాయ కమిటీ చైర్మెన్ గా మహలనోబిస్ జాతీయాదాయ గణాంకాలకు ప్రాతిపదిక స్వరూపాన్ని ఇచ్చాడు. 1955 నుండి 1967 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగా తన సేవలందించాడు. రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో అతని కృషి అనిర్వచనీయం. భారీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఆ ప్రణాళిక నమూనా మహలనోబిస్ నమూనా గా ప్రసిద్ధిగాంచింది. భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహలనోబిస్ 1972 జూన్ 28 న మరణించాడు.


1893 జూన్ 29కోల్‌కత లో జన్మించిన మహలనోబిస్ పూర్తి పేరు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. అతని పూర్వీకుల స్వస్థలం నేటి బంగ్లాదేశ్ ప్రాంతం. జీవనోపాధి కోసం మహలనోబిస్ తాత కోల్‌కత ప్రాంతానికి చేరి స్థిరపడ్డాడు. మహలనోబిస్ బాల్యం, విద్యాభ్యాసం కూడా కోల్‌కత లోనే కొనసాగింది. 1912 లో భౌతిక శాస్త్రం (ఆనర్స్)లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత కేంబ్రిడ్జి, కింగ్స్ కళాశాలలలో గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం అభ్యసించాడు. అభ్యసనం పూర్తి కాగానే మహలనోబిస్ కోల్ కత లోని ప్రెసిడెన్సీ కళాశాల లో భౌతిక శాస్త్ర అద్యాపకుడిగా ప్రవేశించాడు. 30 సంవత్సరాల పాటు సేవలందించి చివరగా ప్రిన్సిపాల్ గా రిటైరయ్యాడు.

సోవియట్ యూనియన్ ప్రణాళిక విధానానికి ప్రభావితుడైన జవహర్ లాల్ నెహ్రూ దేశంలో కూడా ఒక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టు దశలో పి.సి.మహలనోబిస్ ప్రణాళిక విధాన రంగంలో ప్రవేశించాడు. 1950 లో ప్రణాళిక సంఘం స్థాపితమైనప్పటి నుంచి గణాంక శాస్త్ర సలహాదారుడిగా సేవలందించాడు. 1955 నుండి 1967 ప్రణాళిక సంఘం సభ్యుడిగా నియమించబడ్డాడు. ముఖ్యంగా భారీ పరిశ్రమలకు ప్రాముఖ్యం ఇచ్చిన రెండో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో పి.సి.మహలనోబిస్ పాత్ర అనిర్వచనీయం. ఇది మహలనోబిస్ నమూనా గా ప్రసిద్ధి చెందినది. వర్తమాన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమైన ప్రమాణాలను మహలనోబిస్ రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినాడు. ప్రణాళిక ఆలోచనలకు నిర్దిష్ట రూపం కల్పించడంలో మహలనోబిస్ ఎంతో సహకరించాడు.

పూర్తి వ్యాసము, పాతవి

37వ వారం

ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా , తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం.

ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు , శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది.1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో బర్లాండ్, డబ్లిన్ ‍లలో బారిష్టర్ చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.

లక్ష్మీనారాయణ 1900లో గుంటూరు లో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు. అలాగే ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శులు ఇద్దరులో ఒకడుగా ఎన్నికయ్యాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.

ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900లో గుంటూరు లో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. 1902 లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు . వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906లో ను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. రాయవేలూరు జైలు నుంచి విడుదల అయిన తర్వాత 1922 లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.

పూర్తి వ్యాసము, పాతవి

38వ వారం

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు.

చిత్తూరు నాగయ్య 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు.

1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూరులో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉఛ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలి చిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.

పూర్తి వ్యాసము, పాతవి

39వ వారం

అన్ని జీవుల జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం సూర్యుడు. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు. వీటిలో దేనినైతే మానవుడి కన్ను గ్రహించ గలుగుతుందో దాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని తరంగదైర్ఘ్యం 380 nm నుంచి 760 nm వరకు ఉంటుంది. సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే వాతావరణం పైపొర వరకు చేరుతుంది. ఇందులో 45 శాతం మాత్రమే భూతలానికి చేరుతుంది. జీవులకు లభించే మొత్తం కాంతి ఆవాసం, ఋతువులను బట్టి మారుతుంది.

కాంతికి కణ స్వభావమూ, తరంగ స్వభావమూ సంయుక్తంగా అవిభాజ్యంగా ఉంటాయి. ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్నీ, కణ స్వభావాన్నీ ఏక కాలంలో పరిశీలించలేము. ఇది వక్రీభవనం, వివర్తనం, వ్యతికరణం,ధృవణం అనే ధర్మాలను కలిగి ఉంటుంది. కాంతికున్న తరంగ స్వభావానికి ఈ దృగ్విషయాలు కారణము. కాంతి విద్యుత్పలితము, కాంప్టన్ ఫలితము, కాంతి రసాయనిక చర్యలు, కృష్ణ వస్తు వికిరణం, ఉద్గార వర్ణపటాలు వంటి ప్రయోగ ఫలితాలు, పరిశీలనలు కాంతికున్న కణ స్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకంగా రెండు లక్షణాలు ఏక సమయంలో ఉండటం వలన కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం ఉందంటారు.

కాంతి పర్యావరణంలో ఒక ముఖ్య కారకం. జీవరాసులపై దీని ప్రభావం నిర్ధిష్టంగాను, దిశవంతంగాను ఉంటుంది. జీవుల పెరుగుదల, శరీరవర్ణం, చలనం, దృష్టి, ప్రవర్తన, కాంతి ఆవర్తిత్వం, సర్కేడియన్ రిథమ్స్ వంటి జీవక్రియలను కాంతి ప్రభావితం చేస్తుంది. మొక్కలలో పత్రహరితం అభివృద్ధికి, కిరణజన్య సంయోగక్రియకు, మొక్కలకు, జంతువుల పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా కాంతి అవసరం. జంతువులలో వర్ణత ను కాంతి ప్రేరేపిస్తుంది. భూమధ్య ప్రాంతంలో నివసించే మానవులు అధిక కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి చర్మం ముదురు వర్ణం కలిగి ఉంటుంది. సమశీతోష్ణ ప్రాంతంలో నివసించే మానవులు తక్కువగా కాంతి తీవ్రతకు గురవుతారు. కాబట్టి వారి చర్మం తక్కువ వర్ణం కలిగి ఉంటుంది.

సాధారణంగా జంతువుల పృష్ఠభాగం గాఢమైన రంగులోను, ఉదరభాగం లేతరంగులోను ఉంటుంది. పృష్ఠబాగంపై ఎక్కువ కాంతి పడటం వల్ల అక్కడ వర్ణత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి రక్షక అనుకూలనాలు అంటారు. దీనివల్ల జంతువులు తమ శత్రువుల బారినుంచి రక్షించుకొంటాయి.

పూర్తి వ్యాసము, పాతవి

40వ వారం

ఆగుంబె, కర్ణాటక రాష్ట్రంలోని షిమోగ జిల్లా, తీర్థహళ్ళి తాలుకాలో ఒక గ్రామము. ఆగుంబె, పశ్చిమ కనుమలలో మలనాడు అనే ప్రాంతంలో ఉన్నది. ఈ గ్రామంలో పడే వర్ష పాతం ఆధారంగా భారత దేశంలో అత్యధిక వర్షపాతం పడే ప్రదేశమైన చిరపుంజి తరువాతి స్థానంలో నిలుస్తుంది. ఇంత అత్యధిక వర్షపాతం వల్ల ఆగుంబె, దక్షిణ చిరపుంజి అని పేరు సంపాదించుకొన్నది. ఈ గ్రామంలో ప్రసిద్ధ సర్ప పరిశోధనా శాస్త్రవేత్త విట్టేకర్‌ స్థాపించిన వర్షపాత ఆధారిత అరణ్య పరిశోధనా కేంద్రం ఉన్నది. విట్టేకర్‌ ఈ గ్రామాన్ని కింగ్‌ కోబ్రా రాజధానిగా వర్ణించాడు. ఔషధ మెక్కల సంరక్షణా కేంద్రం కూడా ఆగుంబె గ్రామంలోనే ఉన్నది.

ఆగుంబె భారత దేశంలోనే అతధిక వర్షపాతం నమోదు చేసుకొంటున్న ప్ర్రాంతాలలో రెండవది (మెదటి స్థానం చిరపుంజీకి లేదా దాని సమీపములో ఉన్న మాసిన్రంకు దక్కుతుంది) ఇక్కడ సాలీనా సగటు వర్షపాతం 7640 మి.మీ. ఇప్పటి వరకు అగుంబెలో అత్యధిక వర్షపాతం (4508 మి.మీ.) ఆగష్టు 1946లో నమోదయ్యింది. పశ్చిమ కనుమలలో ఉన్న ఆగుంగే సూర్యాస్తమయం చూడడానికి దేశం నలుమూలలనుండి పర్యాటకులు వస్తారు. నిర్మలమైన ఆకాశం ఉన్నరోజు అరేబియా సముద్రం చాలా దూరంలో ఉన్నప్పటికి సూర్యాస్తమయంలో అరేబియా సముద్రంలోకి సూర్యుడు వెళ్ళి పోతున్నాడా అన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది

కుంచికాళ్ జలపాతాలు భారతదేశంలో అత్యధిక ఎత్తు నుండి పడుతున్న జలపాతాలలో ఒకటి. ప్రపంచ జలపాతాలలో ఈ జలపాతం 116 వ స్థానంలో ఉన్నది. బరకనా జలపాతం 850 అడుగులు లేదా 259 మీటర్ల ఎత్తు నుండి పడుతోంది. బరకనా జలపాతం భారత దేశంలోనే అత్యంత ఎత్తు నుండి పడుతున్న జలపాతాలలో 10వ స్థానంలో ఉన్నది. సీతా నది కొండలపై నుండి పడుతూ బరకనా జలపాతంగా మారుతోంది. ఈ బరకనా జలపాతానికి సీతా జలపాతం అనే మరోపేరు కూడా ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో జలవిద్యుత్తు ఉత్పత్తిలో ఈ జలపాతం ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఓనకె అబ్బే జలపాతాలు ఆగుంబెకి దగ్గరలో ఉన్న మరొక జలపాతం. ఆర్.కె.నారాయణన్ రచించిన మాల్గుడి డేస్ అనే నవల ఆధారంగా శంకర నాగ్ దర్శకత్వంలో నిర్మించబడిన మాల్గుడి డేస్‌ ధారావాహిక కార్యక్రమంలోని చాలా భాగం ఆగుంబెలో చిత్రించబడింది.

పూర్తి వ్యాసము, పాతవి

41వ వారం

పసుపు, అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపల అంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

  • భారతదేశం లో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన సాంగ్లి పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది.
  • పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతుంది.వాణిజ్య పరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. పసుపు దుంపలనుంచి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు కొమ్ములు, పసుపు (పొడి)ని తయారుచేస్తారు. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరోధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్‌ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్‌ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపురంగులో ఉంటుంది. ఇప్పటివరకు పసుపులో బంగారు వన్నెలో వుండే కర్‌క్యుమిన్‌, డిమిథాక్సి కర్‌క్యుమిన్‌, బిస్‌డిమిథాక్సి కర్‌క్యుమిన్‌ అనే పదార్థాలపై అత్యంత పరిశోధనలు జరిగాయి. పసుపు దుంపలో కర్‌క్యుమిన్‌ కేవలం 3 నుంచి 5 శాతమే ఉన్నప్పటికీ శరీర సౌందర్యానికి, శరీర ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
  • పసుపు బాహ్యంగాను, అంతర్గతంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. శరీరము మీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలా వరకు సంబంధిత భాధలు తగ్గుతాయి. చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి. దెబ్బలు, గాయాలు తగిలినపుడు శరీరం నుంచి రక్త స్రావాన్ని ఆపుటకు పసుపు దోహదపడుతుంది.
  • వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

42వ వారం

భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకరుగా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, నీలం సంజీవరెడ్డి . అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది.

1929లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు.1940 1945 ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులో ఉన్నాడు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభ కు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగా తో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభా సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

43వ వారం

శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గధాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) ఒక హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం" లో ఈయన ప్రభావము చాలా ఉంది. రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గధాధరుడు చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామములో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్దగా వినేవాడు.

ఇతని అన్న రామ్‌కుమార్ కలకత్తా లో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించెను. కొంత ప్రోద్బలముతో గధాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకొనెను. రామ్‌కుమార్ రిటైరయిన తరువాత రామకృష్ణుడు పూజారిగా భాధ్యతలను తీసుకొనెను. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తాఅని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.

కాలక్రమంలో తోతాపురి అను నాగాసాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

44వ వారం

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఇది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టింది. పురాతన హరప్పా నాగరికతకు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. అలెగ్జాండర్ కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు. కృష్ణా జిల్లా పెడనలో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఆర్యవటంలో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.

ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్ఛమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ రామాయణము, మహాభారతం, శివ పురాణం మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

కోరమాండల్ తీరం వెంబడి ఉన్న ముఖ్యమైన మచిలీపట్నం ఓడరేవు ద్వారా ఈ కళంకారీ ఉత్పత్తులు ప్రపంచం నలుమూలలకూ వ్యాపించి ఉండవచ్చు. మచిలీపట్నం ఓడరేవుకు సౌకర్యాలు సరిగా లేకపోయినా గోల్కొండ ప్రభువులతో సంబంధాలు ఉండటంవలన అది ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. గోల్కొండ ప్రభువులైన కుతుబ్ షాలు కళంకారీ ఉత్పత్తులను ఎక్కువగా కోరే పర్షియన్ వర్తకులతో వ్యాపార సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఈజిప్టులో కైరో వద్దగల ఫోస్టాట్ అనే ప్రదేశం వద్ద పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపే వరకూ భారతదేశంలో వస్త్రాలపై కళాఖండాలను చిత్రించే సంస్కృతి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ తవ్వకాల్లో వివిధ చిత్రాలతో కూడిన్ భారతదేశ నూలు వస్త్రాలు కనిపించాయి. ఈ వస్త్రాలను 18వ శతాబ్దంలో పశ్చిమ తీరం ద్వారా ఆ దేశాలను ఎగుమతి అయిఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

45వ వారం

రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930వ సంవత్సరం జూలై 28న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మళయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు. ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనలో కచేరి చేశాడు. అతని తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేయగా ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ "బాల" అని పేరుకు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.

బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసు లో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పని చేశాడు మరియు జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషి తో కలిసి ముంబయి లో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితొ కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైఖ్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు.

తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగాడు. బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేశియా, సింగపూర్ మరియు అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడాడు. భక్త ప్రహ్లాద చిత్రంలో నారదునిగా నటించటమే కాక తన పాటలు తానే పాడుకున్నాడు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

46వ వారం

భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు.

  • వీటిలో మొదటిది జంబూ ద్వీపం. ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు, ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరు ఉపయోగిస్తారు (ఉదా: జంబూ ద్వీపే, మేరో దక్షిణభాగే, శ్రీశైల ఉత్తర భాగే, కృష్ణా గోదావారీ మధ్య స్థానే......). జంబూ అంటే "నేరేడు" పండు లేదా "గిన్నె కాయ", ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చినది.
  • ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.
  • తరువాతి పేరు హిందూదేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
  • తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం. ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!

ఇండియా- ఆంగ్ల పదము, గ్రీకు పదమైన Ἰνδία, లాటిన్ ద్వారా ఇండియా. Ἰνδία బైజాంటియన్లో సింధూనది (Ἰνδός) కి ఆవల గల రాజ్యం. క్రీ.పూ. 5వ శతాబ్దంలో హెరొడోటస్ పాలిటోనిక్ (ἡ Ἰνδική χώρη) "ఇండియన్ లాండ్" (Indian land), అవెస్తన్ నుండి "హిందుస్" (సింధూ నదిని సూచిస్తుంది) దరాయిస్ 1 (డేరియస్-1) నుండి, సంస్కృతం నుండిసింధు (సింధూనదిని సూచిస్తుంది). ఆఖరుకు సంస్కృత పదం నుండి స్థిరపడింది సింధు, లాటిన్ నుండి ఇండియా, పేర్లు స్థిరపడ్డాయి. సంస్కృత పదమైన 'ఇందు' చంద్రుడి పేరు సోమతో సంబంధంలేదు.

భారత్ అనే పేరు "భారత రిపబ్లిక్", లోని భారత్ సంస్కృతం నుండి స్వీకరించిన అధికారిక పదం. హింద్ అనే పేరు ఇరానియన్ భాషనుండి ఉద్భవించింది, దీని సమానార్థం ఇండో-ఆర్యన్ సింధ్. మరియు అవెస్తన్ యొక్క -స్థాన్ అనగా దేశము లేదా ప్రాంతం (సంస్కృతంలో 'స్థాన' ప్రదేశం లాగా). ఇండియాను, పర్షియన్ లో హిందుస్తాన్, అరబ్బీ లో అల్-హింద్(الهند) అని పిలుస్తారు (జై హింద్ లోని 'హింద్' లా). ఈ 'హింద్' మరియు 'హిందుస్తాన్' అనే పేర్లు అరబ్బీ మరియు పర్షియన్ భాషలలో 11వ శతాబ్దం నుండి 'ముస్లింల పరిపాలనా' కాలం నుండి ఉపయోగంలో యున్నది. సల్తనత్ మరియు మొఘల్ కాలంనుండి విరివిగా ఉపయోగంలో వున్నది. 'హిందూ' (हिन्दू) అనే సంస్కృత పదం మరియు పర్షియన్ పదం 'హిందూ' అనే పదాలు సమానం.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

47వ వారం

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పశ్చిమాన పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న అందమైన నగరం శాన్ ఫ్రాన్సిస్కో. పసిఫిక్ సముద్రతీరానికి దీనిని ద్వారంగా వ్యవహరిస్తారు. దీని జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో నాల్గవస్థానంలోనూ, జనసాంద్రత విషయంలో అమెరికాలో ఇది రెండవస్థానంలోనూ ఉంది. ఈ పట్టణం కొండలకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను సుందర పర్యాటక కేంద్రంగా మలచారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక దీవులు ఉన్నాయి.

పురాతత్వ పరిశోధనల ఆధారంగా క్రీ.పూ. 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసమున్న ఋజువులు ఉన్నాయి. ఎలము గుంపుకి చెందిన ఒహ్లోన్ ప్రజలు ఇక్కడ అనేక చిన్న చిన్న పల్లెలలో నివాసము ఉన్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. గాస్పర్ డీ పోర్టోలా నాయకత్వములో స్పెయిన్ దేశస్థులు ఈ ద్వీపకల్పములోని తీరంలోని స్వర్ణద్వారము(గోల్డెన్ గేట్) సమీపంలో కోటను నిర్మించి నివాసము ఏర్పరుచుకున్నారు. అటుపైన "మిషన్ సాన్ ఫ్రాన్సిస్కో డి అస్సిసి" లేదా మిషన్ డోలొరెస్ అనే పేరుతో ఒక మిషనరీని అభివృద్ధి చేసినారు.

స్పెయిన్ దేశము నుండి స్వాతంత్ర్యము పొందిన తరవాత ఈ ప్రాంతం మెక్సికోలో ఒక భాగంగా ఉంది. 1835వ సంవత్సరములో విలియమ్ రిచర్డ్సన్ ప్రస్తుతము పోర్త్స్ మౌత్ సమీపంలో అల్కల్డే ఫ్రాన్సిస్ డీ హేరోతో చేర్చి ఒక వీధి రూపకల్పన చేసి నిర్మించి దానికి యర్బా బ్యూనే అని నామకరణము చేశాడు. 1846వ సంవత్సరములో జరిగిన 1846 మెక్సికన్ యుద్ధంలో జాన్ డి.స్లాట్ నాయకత్వములో అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. 1848వ సంవత్సరంలో ఇక్కడ బంగారు గనులు కనిపెట్టిందువలన ఇక్కడకు ప్రజాప్రవాహము దేశము నలుమూలల నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతాలనుండి వచ్చి, ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నారు. వీరి రాకతో నగరము అతి శీఘ్రగతిని అభివృద్ధి వైపు పయనించింది. బంగారు వేటలో చేరిన జనప్రవాహము వరదలా నగర జనాభాని 1,000 జనసంఖ్య నుండి 25,000 వేల జనసంఖ్యగా అభివృద్ధి చెందేలా మార్చింది. తరవాతికాలంలో 1906వ సంవత్సరములో సంభవించిన భూకంపము అగ్ని ప్రమాదము ఈ నగరాన్ని అతలాకుతలము చేసి చాలా వరకు ద్వంసము చేసాయి. అతి శీఘ్రగతిలో దీనిని అభివృద్ధి చేసి దీనిని బేటా సిటీగా గుర్తింపు పొందేలా చేయడంలో నగరపాలక సంస్థ తన సామర్ధ్యాన్ని చాటుకుంది.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి

48వ వారం

లినక్సు ఒక కంప్యూటరు ఆపరేటింగు సిస్టము మరియూ దీని కెర్నలు ఉచిత సాఫ్ట్వేరు నకు మరియు ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు నకు ప్రసిద్దిగాంచిన ఒక ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా [[మ్యాక్ / మెకింటొష్ ఆపరేటింగ్ సిస్టము]] ల వలే కాకుండా లినక్సు సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా కూడ లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.

లినక్సు నిజానికి దాని కెర్నలు యొక్క పేరు, కానీ సామాన్యంగా యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టము అయిన లినక్సు ఆపరేటింగు సిస్టమును మొత్తాన్ని గుర్తించడానికి వాడతారు. దీనిని కొద్దిమంది జీ యన్ యూ / లినక్సు ఆపరేటింగు సిస్టమ్ అని పిలవాలి అని చెపుతారు. ప్రారంభంలో, లినక్సు కొద్దిమంది ఉత్సాహవంతులు అభివృద్ధి చేశారు. ఆ తరువాత ప్రముఖ కార్పొరేషన్లయిన ఐ బీ యం, హెచ్ పీ మరియు నోవెల్ వంటి సర్వర్లలో ఉపయోగించడంలో సహాయం చేసినాయి, అలాగే డెస్కుటాప్ కంప్యూటర్లలోనూ ప్రాధాన్యత పొందినది. విశ్లేషకులు దీని విజయానికి, తక్కువ ఖర్చు, పటిష్ఠమైన భద్రత, విశ్వసనీయత వంటివి కారణాలుగా చెపుతారు.

లినక్సు మొదట ఇంటెల్ 386 మైక్రో ప్రొసెసర్ కొరకు అభివృద్ధి చేసినారు. కాని ఇప్పుడు అన్ని ప్రముఖ కంప్యూటరు ఆర్కిటెక్చరు లపై పనిచేస్తుంది. దీనిని ఎంబెడెడ్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత వీడియో రికార్డర్లు, వ్యక్తిగత కంప్యూటరులు, సూపరు కంప్యూటరు లపై ప్రతిక్షేపించినారు!

1993 వ సంవత్సరములో రిచర్డు స్టాల్‌ మన్‌ జీ యన్‌ యూ ప్రాజెక్టును స్థాపించినాడు. ఇది ఈ రోజు లినక్సు సిస్టముకు కావలసిన అన్ని విభాగాలను చాలావరకు చేకూరుస్తుంది. జీ‌ ఎన్ ‌యూ స్థాపించినప్పుడు, దాని లక్ష్యం ఓ సంపూర్ణ యునిక్స్‌ వంటి ఆపరేటింగు సిస్టమును అభివృద్ధిచేయడము, అదీ పూర్తిగా ఉచిత సాఫ్ట్వేరుల సహాయముతో. 1990 వ దశకం తొలి నాళ్ళకల్లా ఈ జీ యన్‌ యూ ఒక ఆపరేటింగు సిస్టమునకు కావలసిన అన్ని విభాగాలను, లైబ్రరీలను అప్లికేషన్లను రూపొందించినది. కానీ ఒక ముఖ్యమైన విభాగమయిన దిగువ వ్యవస్థ అయిన కెర్నలు మాత్రము రూపొందింపబడలేదు. కెర్నలు కోసం ఈ జీ యన్‌ యూ ప్రాజెక్టు మొదట ట్రిక్సు కెర్నలును రూపొందించినది. ఆ తరువాత దాని అభివృద్ధిని నిలిపి జీ యన్‌ యూ హర్డ్‌ అను మరొక కెర్నలును రూపొందించడం మొదలుపెట్టినారు. థామస్‌ బుష్నెల్‌ ప్రకారం మొదట హర్డ్‌ నిర్మాణ శైలి బీ యస్‌ డీ 4.4 లైట్‌ కెర్నలును అనుసరించాలని, కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్కిలీ నుండి సరి అయిన సహాయం లేని కారణంగా; ప్రోగ్రామర్లు మరియు స్టాల్‌ మన్‌ మాక్‌ మిక్రో కెర్నలు నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించినారు. కానీ ఈ నిర్ణయం వల్ల చాలా అనుకోని, ఊహించని ఇబ్బందులు వచ్చి హర్డ్‌ నిర్మాణం చాలా ఆలశ్యం అయినది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

49వ వారం

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. 1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు. కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. తన 14 వ ఏట ఒకటవ తరగతిలో చేరాడు.

తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు. ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్టగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడినది. ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు.

నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.

అయితే ఈయనకే ప్రత్యేకమైన హరికథ ని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు. అతని ప్రోద్భలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది. మొదటిది రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది. కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు, నేర్పాడు. ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

50వ వారం

బాబా ఆమ్టే డిసెంబర్ 26, 1914న మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింగన్‌ఘాట్‌లో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపిన మహనీయుడు.

బాబా ఆమ్టే మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్‌ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. బాబా అనేది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబా ఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. 1946లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.


బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించినది. కుష్టువ్యాధి ఒక అంటురోగమని, కుష్టురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబాఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్టురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు. కుష్టురోగులకై బాబాఆమ్టే తదనంతరం సోమనాథ్ మరియు అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించినాడు. సమాజసేవ విషయంలో ఆనంద్‌వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్‌వన్ కై బాబాఆమ్తేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థనుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్‌వన్ రెండు ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథశరణాలయాన్ని కలిగిఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5000కు పైగా నివసిస్తున్నారు.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

51వ వారం

సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందర కాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కధా భాగానికి సంబధించిన పేర్లు పెట్టాడు కాని సుందరకాండకు "సుందరకాండ" అని పేరు పెట్టడానికిగల కారణాలను పండితులు చాలా రకములైన వివరణలు, వ్యాఖ్యానాలు ద్వారా చెబుతారు. అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మారు స్మరించబడుతుంది. శ్రీరాముడి పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.

రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం విజయవంతమౌతుందనీ బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము. అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మ శాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండను గురించి "చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం, హనూమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమమ్" అని పేర్కొన్నది. సుందరకాండ పారాయణా విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంధాలు ఉన్నాయి. రామాయణానికి ఇది బీజకాండము. మంత్ర సంయుక్తము. దీనిలో గుప్తముగా హనుమంతుని కుండలినీ యోగసాధన నిక్షిప్తమై ఉన్నది.

వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహపీడలు, అనపత్యతలు, దారిద్ర్యములోనైన సంకటములన్నియను సుందరకాండ పారాయణము వలన తొలగుటయే గాక భక్తిముక్తులును కలుగును. అర్ధ పంచక జ్ఞానము ఆచార్యుల వలననే కలుగునని హనుమంతుని చర్య వలన బోధింపబడినది. ద్వయ మంత్రములోని రహస్యములు ఇందులో వివరింపబడినవి. గాయత్రీ మంత్రములోని "దేవ" శబ్దార్ధము ఇందు శ్రీరామ దివ్యమంగళవిగ్రహ వర్ణనచే వర్ణింపబడినది. సంసారసాగర తరణముకోరు యోగులకు తగిన అభ్యాసవిధి ఇందలి హనుమంతుని చర్యల వలన తెలియుచున్నది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

52వ వారం

సుమో యోధులు జపాన్ కు చెందిన భారీ శరీరం కలిగిన మల్ల యోధులు.వీరిని జపనీస్ భాషలో రిషికీలు అని పిలుస్తారు. ఆ దేశం లో వీరికున్న ప్రజాధరణ సినిమా హీరోలకు కూడా ఉడదు. అందుకే అక్కడ ఈ క్రేజ్ ఇంకా కొన సాగుతోంది. తకమిక జుచి, తకమిక నత ఇద్దరూ దేవతలే. జపాన్ ద్వీపాలు ఎవరి వల్ల పుట్టాయో తేల్చుకొనేందుకు హోరాహోరి తలపడ్డారు. అలా పుట్టుకొచ్చిందే ఈ సుమో. ఈ క్రీడ పుట్టుక గురించి జపనీయులు చెప్పుకొనే పురాణ కథనమిది. క్రమంగా ఇదో సంప్రదాయం గామారింది. పూర్వకాలంలో పంటలు బాగా పండాలని ఈ పోటీని నిర్వహించేవారు. వేడుకల వేళ సుమో వీరులు తలపడేవారు. సంగీత నృత్య కార్యక్రమాలతో కలిపి ఈ పోటీలు కొనసాగేవి. క్రీ.శ. 8 వ శతాబ్దం నుండి ఈ క్రీడ వాడుకలో ఉంది. 17వ శతాబ్దం నాటికి పూర్తి వినోద క్రీడగా ఆరంభమై జాతీయ క్రీడగా ఎదిగింది. నియమ నిబంధనలని ఏర్పరుచుకొన్నది.


సుమోగా మారాలంటే అంత సులభం కాదు. అందుకు కఠినమైన శిక్షణ అవసరం. చాలా చిన్న వయసులో మొదలవుతుంది. మానసిక, శారీరక సామర్థ్యాల్ని పరీక్షించాకే సుమో బడిలోకి ప్రవేశం. వీళ్ళకి శిక్షణ ఇచ్చే కేంద్రాలను స్టేబుల్స్ అంటారు. పదవీ విరమణ చేసిన సుమోలే ఉపాధ్యాయులు. తిండీ నిద్ర అన్నీ అక్కడే. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవాలి. ఖాళీ కడుపుతో నాలుగైదు గంటల సాధన చేయాలి. ఆ తరువాత రెండు మూడు గంటలు ఆరామంగా వేడి నీళ్ళ స్నానం. అప్పటికే సమయం మద్యాహ్నం 12 గంటలై ఉంటుంది. ఆకలి దంచేస్తుంటుంది. అప్పుడు తినడం మొదలెడతారు. అదే రోజుకి మొదటి ఆహారం. లక్ష్యం ఒక్కటే. ఎంత ఎక్కువ తినగలిగితే అంత తినడం, అంతగా లావవ్వడం. కానీ సుమోలు రోజంతా తినరు. కేవలం రోజుకి రెండు సార్లే. అయితే సగటు మనిషి తీసుకొనే ఆహారానికి సుమారు పది రెట్లు.

జపాన్లో ఈ సుమో పోరాటాలు చాలా ప్రాచీనమైనవి. ఇప్పటికి కూడా ప్రాచీన ఆచారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సుమోల జీవితం చాలా కట్టుదిట్టమై ఉంటుంది. వీరు సుమో అసోసియేషన్ విధించిన నిబంధనలకు లోబడి జీవించాల్సి ఉంటుంది. ఈ సంఘంలో పదవీ విరమణ చేసిన మల్లయోధులు ఉంటారు. వీరు మాత్రమే కొత్త సుమో యోధులను తయారు చేయడానికి అర్హులు. సుమో వీరుల్లో ఆరు విభాగాలు ఉంటాయి. జొనొకుచి ప్రాథమికమైనది. తరువాతవి జొనిడాన్, సాన్ డాన్మే, మకుషిత, జురియొ లు. చివరిది మాకూచి. మాధ్యమాలు పరుగులు పెట్టేది వీళ్ళవెనకే. జనాలు నీరాజనాలు పట్టేది వీళ్ళకే. చివరి రెండు దశల్ని సెకిటొరి అనీ కింది దశల్ని రికీషీ లనీ పిలుస్తారు. అంటే శిక్షణ పూర్తయిన సుమోలంతా రిషికీలే. ఎక్కువ టోర్నమెంట్లు గెలిస్తే వారిని యొకజునా అంటారు. అంటే గ్రాండ్ చాంపియన్ అన్నమాట.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

53వ వారం

హిందూ మతం లోని దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు - భారతి, సరస్వతి, శారద, హంస వాహిని, జగతీ ఖ్యాత, వాగీశ్వరి, కౌమారి, బ్రహ్మ చారిణి, బుద్ధి ధాత్రి, వరదాయిని, క్షుద్ర ఘంట, భువనేశ్వరి. ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి. బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు.

ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"

ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు. "నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని" అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది. తమిళనాడులో 'కూతనూర్' వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి


ఇవి కూడా చూడండి

[మార్చు]